టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటిపై అదే పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంచలన ఆరోపణలు
ఫిర్యాదు చేసినా పోలీసులు, రాష్ట్ర నాయకత్వంలో స్పందన లేదు
ఎమ్మెల్యే బెదిరింపుల కాల్ రికార్డులు ఉన్నాయి.. సుమోటోగా కేసులు నమోదు చేయాలి
అనంతపురం టౌన్: ‘టీడీపీ ప్రభుత్వ పాలనలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ రెండేళ్లలోనే రూ.200 కోట్ల విలువైన భూ దోపిడీ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూ దాహంతోపాటు కక్ష పూరిత రాజకీయాలతో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయించాడు. వారిని మానసిక క్షోభకు గురి చేశాడు’అని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వైకుంఠం ప్రభాకర్‌చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన అనంతపురంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
‘నగరంలో ఏ స్థలం రిజిస్ట్రేషన్ చేయాలన్నా దగ్గుపాటి ప్రసాద్ అనుమతి కావాలంట.. నగరం ఎవరబ్బ జాగీరు? స్వేచ్ఛగా భూములు కొనకూడదా? అమ్మకూడదా? ఎటు వెళుతోంది ప్రజాస్వామ్యం’ అంటూ మండిపడ్డారు. నగరంలోని పోలీసు ఇన్‌స్పెక్టర్లూ ఎమ్మెల్యే చెప్పిందే వేదమంటూ అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, చివరకు దాడులు చేస్తున్నా జిల్లా పోలీసు అధికారులకు ఏమాత్రమూ పట్టడం లేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే దగ్గుపాటి భూ దోపిడీలు, దాడులపై జిల్లా అధికారులతోపాటు టీడీపీ రాష్ట్ర నాయకులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేదన్నారు.
పోలీసులు ఎమ్మెల్యే చెప్పినట్లే వింటున్నారు
ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు చేస్తే నిజానిజాలపై విచారణ చేపట్టకుండానే కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు.. దగ్గుపాటి కుటుంబ సభ్యుల దోపిడీ మాత్రం కనిపించలేదా అని ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. త్రీ టౌన్ సీఐ ఎమ్మెల్యే మాటలు వింటూ స్థానికులపై ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు దాడులకు తెగబడుతున్నారన్నారు. ఎమ్మెల్యే భార్య పేరిట ఉన్న డీవీ ఇన్‌ఫ్రా సంస్థకు ఎలాంటి అనుభవమూ లేనప్పటికీ రూ.32 కోట్ల విలువైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అలాగే నగర పాలక సంస్థలో అనేక కాంట్రాక్టులను రుద్ర కన్‌స్ట్రక్షన్స్ పేరిట అధికారులను బెదిరించి దక్కించుకున్నారన్నారు. దగ్గుపాటి ప్రసాద్ అక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణ చేయించాల్సిన అవసరం ఉందని ప్రభాకర్‌చౌదరి పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే మేలు
గతంలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనంత వెంకటరామిరెడ్డి, గురునాథ్రెడ్డిలే మేలు అని, ప్రతిపక్షంలో తాము ఉన్నప్పటికీ ఏనాడూ టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయించలేదని ప్రభాకర్ చౌదరి వివరించారు. నేడు అధికార పక్షంలో ఉన్నప్పటికీ సొంత పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి అండతో టీడీపీ కార్యకర్తలపై బనాయిస్తున్న అక్రమ కేసులపై పోరాటాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
దగ్గుపాటి బెదిరింపుల కాల్ రికార్డులు 200పైగా నా దగ్గర ఉన్నాయి
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బెదిరింపుల కాల్ రికార్డులు 200కుపైగా తన దగ్గర ఉన్నాయని, వీటిపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. ప్రతి నెలా పోలీసులకు సకాలంలో సొమ్ము అందుతోందని, అందువల్లే ఎమ్మెల్యే బావమరిది అశోక్, సుందర్‌పై కేసులు ఉన్నా అరెస్టు చేయడం లేదని విమర్శించారు. పోలీసులకు సిగ్గుంటే ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలపై, బెదిరింపులపై సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు.
‘ఎమ్మెల్యే మాట వినకుంటే వారిపై కేసులు నమోదు చేయిస్తాడంట.. అవసరమైతే గంజాయి కేసు పెట్టిస్తాడంట.. లేదంటే టిప్పర్లతో గుద్ది చంపిస్తాడంట.. ఇలా ఎమ్మెల్యే మాట్లాడిన దాదాపు 200లకు పైగా కాల్ రికార్డులు నా దగ్గర ఉన్నాయి’ అని తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ప్రతి నెలా రూ.1.50 లక్షలు ఎమ్మెల్యేకు ఇవ్వాలంటూ స్థానిక సబ్ రిజిస్ట్రార్ మాట్లాడుతున్నాడంటే అర్బన్‌లో పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని పేర్కొన్నారు.


