
అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తున్న పోలీసులపై కూడా..
ఎమ్మెల్సీలకు రక్షణ కల్పించండి
పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉపఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరిగేలా చూడండి
‘మండలి’ చైర్మన్ మోషేన్‌రాజుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల వినతి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అండతో చెలరేగిపోతున్న టీడీపీ గూండాల దౌర్జన్యాలు, అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజుకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీలకు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని వారు కోరారు.
పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పార్టీ నేత వేల్పుల రామలింగారెడ్డి (రాము) తదితరులపై టీడీపీ గూండాల దాడి, రక్షణ కల్పించడంలో పోలీసుల వైఫల్యం, నిందితులపై చర్యలు తీసుకోకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రాజగొల్ల రమేష్ యాదవ్, మురుగుడు హనుమంతరావు, కవురు శ్రీనివాస్, అనంతబాబు విజయవాడలో శాసన మండలి చైర్మన్‌ను శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు.
బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ను హతమార్చేందుకు జరిగిన కుట్రను ఆయనకు వివరించారు. తక్షణం ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యయుతంగా ఉప ఎన్నిక జరిగేలా చూడాలని వారు కోరారు. అనంతరం చైర్మన్ కార్యాలయం వెలుపల రమేష్ యాదవ్, అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీకి రక్షణ కల్పించడంతోపాటు వారి హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ భరోసా ఇచ్చారని చెప్పారు. వారు ఇంకా ఏమన్నారంటే..
చంద్రబాబు దుర్మార్గానికి నిదర్శనం
పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేం నలగొండవారిపల్లె గ్రామానికి వెళ్లి వస్తుండగా పదిహేను వాహనాల్లో నూటయాబై మంది వరకు టీడీపీ గూండాలు మా వాహనాలను అటకాయించి చుట్టుముట్టారు. పెద్దపెద్ద రాళ్లు, ఇసుప రాడ్లు, కర్రలతో దాడిచేశారు. దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే, అది పట్టించుకోకుండా మా పార్టీకి చెందిన దాదాపు పాతిక మందిపై తప్పుడు కేసులు పెట్టారు. పైగా.. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ అయితే ‘ఏ పత్తి యాపారం చేయడానికి ఆ గ్రామానికి వెళ్లారు’.. అంటూ ఎగతాళిగా మాట్లాడారు. మాపై దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే పోలీసులున్నా పట్టించుకోలేదు.
చట్టాలను కాపాడాల్సిన పోలీసులు ఏ పత్తి యాపారం చేస్తున్నారో కూడా ఆయన చెబితే బాగుంటుంది. పోలీసులు ఖాకీ యూనిఫారం వదిలి పచ్చచొక్కాలు వేసుకుంటే సరిపోతుంది. ఒక బీసీ ఎమ్మెల్సీపై దాడికి ప్రేరేపించడం చంద్రబాబు దుర్మార్గానికి నిదర్శనం. పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఘటనలపై విచారణ జరపాలి. ఈ ఎన్నికలో ప్రజలు వైఎస్ జగన్ పక్షాన ఉండడాన్ని తట్టుకోలేకే ఇలా దాడులకుతెగబడుతున్నారు.