‘డ్రగ్స్’పై ‘డర్టీ’ ప్రచారం | YSRCP leaders have links to international dealer: fake alleges to TDP chief Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘డ్రగ్స్’పై ‘డర్టీ’ ప్రచారం

Mar 25 2025 4:32 AM | Updated on Mar 25 2025 1:20 PM

YSRCP leaders have links to international dealer: fake alleges to TDP chief Chandrababu Naidu

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో డ్రగ్స్‌ దందా అంటూ గగ్గోలు 

ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించేలా బాబు కూటమి ప్రచారం 

అదంతా విష ప్రచారమేనని తేల్చిన కేంద్ర హోం శాఖ 

2022, 23, 24లో దేశంలో డ్రగ్స్‌ కేసులు ఎక్కువ ఉన్న 12 రాష్ట్రాల జాబితా పార్లమెంటుకు.. 

ఆ జాబితాలో ఏపీనే లేదు 

అంటే బాబు కూటమి చేసిందంతా విషప్రచారమేనని తేటతెల్లం 

గుజరాత్‌ పోర్టుకు వచ్చిన డ్రగ్స్‌ కంటైనర్‌ కూడా రాష్ట్రానికేనని దుష్ప్రచారం 

విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్‌ విషయంలోనూ ఇదే రాద్ధాంతం 

ఆ రెండు ప్రచారాలూ తప్పేనని తేల్చిన సీబీఐ  

సాక్షి, అమరావతి: స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కూటమి డ్రగ్స్‌ దందా అంటూ యావత్‌ రాష్ట్రంపై అభాండాలేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయిందంటూ నిత్యం విష ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించింది. ఇదంతా కేవలం దుష్ప్రచారమేనన్న వాస్తవాన్ని కేంద్ర హోం శాఖ తాజా నివేదిక వెల్లడించింది. 2022 నుంచి 2024 వరకు దేశంలో అత్యధికంగా డ్రగ్స్‌ కేసులు నమోదైన 12 రాష్ట్రాల జాబితాను కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు సమర్పించింది. ఈ జాబితాలో మన రాష్ట్రం పేరే లేదు.

అసలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్‌ ప్రభావమే లేదని, ఎల్లో మీడియా, చంద్రబాబు ముఠా చేసిన రాద్ధాంతమంతా రాజకీయ కుట్రే అన్న విషయాన్ని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. అంతేకాదు.. గుజరాత్‌ పోర్టుకు వచ్చిన ఓ కంటైనర్‌లో డ్రగ్స్‌ ఉన్నట్లు తేలగానే చంద్రబాబు ముఠా దాన్ని రాష్ట్రంతో లింకు పెట్టి రచ్చ చేసింది. విశాఖపట్నం పోర్టుకు వచ్చిన డ్రై ఈస్ట్‌ కంటైనర్‌ విషయంలోనూ ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్న చందంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. ఈ కంటైనర్ల విషయంలో బాబు ముఠా ఆరోపణలన్నీ అవాస్తవాలేనని సీబీఐ దర్యాప్తుల్లో వెల్లడైంది.కేంద్ర హోం శాఖ తాజా నివేదిక కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. 

నాడు డ్రగ్స్‌ కేసుల జాబితాలోనే లేని ఏపీ దేశంలో 2022, 2023, 2024 సంవత్సరాల్లో గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణా (ఎన్‌డీపీఎస్‌) కేసులు, ఈ కేసులు అత్యధికంగా నమోదైన 12 రాష్ట్రాల వివరాలను కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు నివేదించింది. ఈ మూడేళ్లలో దేశంలో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద మొత్తం 3,02,228 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఎన్‌డీపీఎస్‌ కేసుల్లో.. కేరళ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో పంజాబ్, మూడో స్థానంలో మహారాష్ట్ర ఉన్నట్లు తెలిపింది. మొత్తం 12 రాష్ట్రాల్లో నమోదైన కేసుల వివరాలనూ ఇచ్చింది. హోం శాఖ ఇచ్చిన ఈ టాప్‌ 12 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ లేనే లేదన్న వాస్తవం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డ్రగ్స్‌ దందాను సమర్ధంగా కట్టడి చేసిందన్న విషయాన్ని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.

కంటైనర్ల విషయంలోనూ విష ప్రచారమే
ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విదేశాల నుంచి రాష్ట్రానికి భారీగా డ్రగ్స్‌ దిగుమతి చేస్తున్నారంటూ చంద్రబాబు ముఠా చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అదంతా దుష్ప్రచారమేనని సీబీఐ దర్యాప్తుతో నిగ్గు తేలింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వచ్చిన ఓ నౌకలోని కంటైనర్‌లో భారీగా డ్రగ్స్‌ను గుర్తించారు. వెంటనే దీనిపై చంద్రబాబు కూటమి, ఎల్లో మీడియా విష ప్రచారం ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకే ఆ డ్రగ్స్‌ను దిగుమతి చేశారంటూ యాగీ చేశాయి. డీఆర్‌ఐ, సీబీఐ దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కంటైనర్‌లోని మాదక ద్రవ్యాలను గుజరాత్‌ పోర్టులో దిగుమతి చేసి చెన్నైకు తరలించాలన్నది ఆ డ్రగ్స్‌ ముఠా మాస్టర్‌ ప్లాన్‌ అని ఆ రెండు కేంద్ర సంస్థల దర్యాప్తులో వెల్లడైంది. సీబీఐ చెన్నైకు చెందిన కొందరిని అరెస్ట్‌ కూడా చేసింది. 

ఇక ఎన్నికలకు ముందు ఓ ఆక్వా సంస్థ విదేశాల నుంచి డ్రై ఈస్ట్‌ను దిగుమతి చేసుకుంది. ఈ కంటైనర్‌పై అనుమానంతో సీబీఐ అధికారులు తనిఖీ చేయగానే చంద్రబాబు కూటమి మళ్లీ రాద్ధాంతం మొదలెట్టింది. డ్రై ఈస్టు పేరుతో డ్రగ్స్‌ను దిగుమతి చేశారంటూ కూటమి నేతలు, ఎల్లో మీడియా విష ప్రచారం చేశారు. సీబీఐ దర్యాప్తులో వాస్తవాలు వెల్లడయ్యాయి. ఆ కంటైనర్‌ ద్వారా దిగుమతి చేసింది డ్రై ఈస్టు మాత్రమేనని సీబీఐ నిర్ధారించింది. దీంతో ఈ రెండు కంటైనర్ల విషయంలో టీడీపీ కూటమి చేసిందంతా దుష్ప్రచారమేనన్నది నిర్ధారణ అయ్యింది. కేవలం ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయ ప్రయోజనం పొందేందుకే చంద్రబాబు ముఠా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతోపాటు యావత్‌ రాష్ట్రంపై విష ప్రచారానికి తెగించిందన్న విషయం నిగ్గు తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement