సాల్మన్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మురళీధర్‌రెడ్డి, మందపాటి శేషగిరిరావు
అంత్యక్రియలకు కుటుంబ సభ్యులనూ అనుమతించరా?
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపాటు
సాల్మన్ బంధువులను కామేపల్లి రంగుల ఫ్యాక్టరీ వద్ద అడ్డుకున్న పోలీసులు
పిడుగురాళ్ల రూరల్/దాచేపల్లి : టీడీపీ రౌడీల చేతిలో హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మందా సాల్మన్ మృతదేహాన్ని తీసుకొని కుటుంబ సభ్యులు, బంధువులు స్వగ్రామానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంపై గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పిన్నెల్లికి తీసుకెళ్తుండగా పిడుగురాళ్ల మండలం కామేపల్లి సమీపంలోని రంగుల ఫ్యాక్టరీ వద్ద అందరినీ వెళ్లనివ్వమంటూ సీఐ బ్రహ్మయ్య, ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావుల ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పారు. దగ్గరి బంధువులు చాలా మంది ఉన్నారని, వారందరి వాహనాలు అనుమతించాల్సిందేనని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు.
ఇందుకు పోలీసులు ఒప్పుకోక పోవటంతో కాసు మహేష్రెడ్డి, గౌతమ్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ‘ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ఇలా చేయమంటూ మీకెవరు చెప్పారు? ఇదేం ప్రభుత్వం’ అంటూ వారు ధ్వజమెత్తారు. ‘మేము ఏం నేరం చేశాం? మట్టి చేసేందుకు కూడా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలా?’ అంటూ సాల్మన్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటన్నర వాగ్వాదం అనంతరం ఎట్టకేలకు అన్ని వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం ఇంకా ఎన్నాళ్లు?
రాష్ట్రంలో నారా లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద సాల్మన్ మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాల్మన్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ శ్రేణులను వేధిస్తోందని.. ఒక్క పిన్నెల్లి గ్రామంలోనే దాదాపు 300 కుటుంబాలను 19 నెలలుగా గ్రామంలోకి రానీయడం లేదని మండిపడ్డారు.
పిడుగురాళ్ల, దాచేపల్లిలో గత 19 నెలల్లో ఏడుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అమానుషంగా చంపేశారన్నారు. పిన్నెల్లి వాసులు దాదాపు వెయ్యి మందిని గ్రామం నుంచి తరిమేశారని చెప్పారు. ఈ ఘటనపై వైఎస్ జగన్ స్పందించారని, త్వరలో బాధిత కుటుంబాన్ని కలుస్తారని తెలిపారు. ఈ ఘటనపై చంద్రబాబు, లోకేశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. సాల్మన్ అంత్యక్రియలను గ్రామంలో నిర్వహించనీయకుండా అడ్డుకుంటున్నారంటే ఇంతకన్నా అమానుషం ఇంకోటి ఉంటుందా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మందా సాల్మన్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
వైఎస్సార్‌సీపీ తరఫున ప్రకటించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. సాల్మన్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినట్లు వైఎస్సార్‌సీపీ గురజాల ఇన్‌చార్జ్ కాసు మహేష్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.


