క్రాంతికుమార్‌ది ప్రభుత్వ హత్యే | YSRCP leaders console Kranthi family members: Andhra pradesh | Sakshi
Sakshi News home page

క్రాంతికుమార్‌ది ప్రభుత్వ హత్యే

Jun 22 2026 4:36 AM | Updated on Jun 22 2026 4:36 AM

YSRCP leaders console Kranthi family members: Andhra pradesh

క్రాంతికుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు

సీబీఐతో విచారణ జరిపించాలి 

మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలి   

క్రాంతి కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌సీపీ నాయకుల పరామర్శ

లబ్బీపేట/కృష్ణలంక(విజయవాడతూర్పు): పోలీసుల వేధింపుల వల్లే పేరుపోగు క్రాంతికుమార్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని,  ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుపోగు క్రాంతికుమార్‌ మరణంపై సీబీఐ విచారణ జరిపి అందుకు కారకులైన పోలీసులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల వల్ల గతనెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్‌ కుటుంబాన్ని  వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ ఆధ్వర్యంలో పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు పూనూరి గౌతమ్‌ రెడ్డి, విజయవాడ మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ, పార్టీ అధికార ప్రతినిధి షేక్‌ ఆసిఫ్, పార్టీ గుంటూరు పార్లమెంట్‌ పరిశీలకులు పోతిన మహేష్, సోషల్‌ మీడియా స్టేట్‌ ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌ దొడ్డా అంజిరెడ్డి తదితరులు ఆదివారం పరామర్శించారు.

అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం తీరు వల్లే రక్షకభటులు భక్షక భటులుగా మారుతున్నారని, ప్రజలు, సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే పోలీసు వేధింపులకు రాష్ట్రంలో 12 మంది చనిపోయారని మండిపడ్డారు. ట్యాక్సీ నడుపుకుంటూ బతుకుబండి లాగుతున్న క్రాంతిని ఇన్‌ఫార్మర్‌గా మారాలని సీఐ నాగరాజు వేధించారని, లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించారని, ఈ వేధింపులకు భయపడే క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడని ధ్వజమెత్తారు.

క్రాంతి బలవన్మరణానికి సీఐతోపాటు విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబు, డీజీపీ, సీఎం, హోంమంత్రి బాధ్యత వహించాలని,  క్రాంతి ముగ్గురు పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత తక్షణం ఆ కుటుంబాన్ని పరామర్శించి క్షమాపణ చెప్పి తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం క్రాంతి కుటుంబం పనిచేసిందని, దానికి కానుకగా అతని శవాన్ని ప్రభుత్వం ఇచ్చిందని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌  ప్రశ్నించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్‌ మరణాలు వెలుగులోకి వచ్చేవి కావని, ఈ రెండు ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. సాయికృష్ణ, క్రాంతి మరణాలపై పవన్‌కళ్యాణ్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement