వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేత | YSRCP Leader House Demolished: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేత

Jun 22 2025 6:04 AM | Updated on Jun 22 2025 6:04 AM

YSRCP Leader House Demolished: Andhra Pradesh

నోటీసులు లేకుండా జేసీబీతో కూల్చేసిన అధికారులు

కోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు టీడీపీ నాయకుల ఆదేశాలతో నేలమట్టం

సాక్షి టాస్‌్కఫోర్సు: ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో మాజీ ఎంపీటీసీ, వైఎస్సార్‌ సీపీ నాయకుడి నివాసాన్ని టీడీపీ నాయకుల ఆదేశాలతో రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా వచ్చి జేసీబీతో కూల్చేశారు. బాధితుడి కథనం ప్రకారం... తూర్పువీరాయపాలెం సర్వే నంబర్‌ 133/5లో ఎ0.02 సెంట్ల స్థలాన్ని మాజీ ఎంపీటీసీ ముప్పరాజు శ్రీను 2010లో ముప్పరాజు లక్ష్మిలు అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి రిజిస్టర్‌ చేయించుకున్నారు. గ్రామానికి నడిబొడ్డున ప్రధాన కూడలిలో ఈ స్థలం ఉండటంతో టీడీపీ నాయకుల కన్ను పడింది.

ఈ స్థలం తమదంటూ గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు ముప్పరాజు చిన్న వెంకటేశ్వర్లు, మదమంచి ఏడుకొండలు, మండాది శ్రీను 2013లో దర్శి కోర్టు, 2015లో మార్కాపురం కోర్టులను ఆశ్రయించారు. ఆ కోర్టుల్లో వైఎస్సార్‌ సీపీ నాయకుడు ముప్పరాజు శ్రీను, అతని భార్య రామతీర్థంలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు అనంతరం శ్రీను ఆ స్థలంలో 2023లో రూ.20 లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకున్నారు. అది సహించలేని టీడీపీ వర్గీయులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాగైనా ఆ స్థలాన్ని దక్కించుకోవాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గొట్టిపాటి లక్ష్మిని ఆశ్రయించారు.

ఆమె ఆదేశాలతో శనివారం తహసీల్దార్‌ శ్రావణ్‌ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ రెడ్డి, వీఆర్వో ఆర్‌ శ్రీనివాసరావు, ఇన్‌చార్జి ఎస్సై మల్లికార్జునరావు, పోలీసు సిబ్బంది జేసీబీతో వెళ్లి  ముందస్తు సమాచారం , నోటీసు ఇవ్వకుండా శ్రీను ఇంటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఎవరైనా అడ్డొస్తే కేసులు పెడతామంటూ హెచ్చరించారు. ఏ అధికారంతో కూల్చేస్తారని ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పకుండా తమను భయభ్రాంతులకు గురిచేసి భవనాన్ని కూల్చేశారని బాధితుడు శ్రీను కన్నీటి పర్యంతమయ్యాడు. తన ఇల్లున్న స్థలం ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారని శ్రీను తెలిపాడు.

అయితే ఇదే  ప్రాంతంలో తన స్థలంతో పాటు టీడీపీ నాయకులకు చెందిన పది ఇళ్లు ఉన్నాయని, అవి ఆర్‌అండ్‌బీ పరిధిలోకి రాకుండా తన ఇల్లే ఎలా వచ్చిందని అడిగినా సమాధానం ఇవ్వలేదన్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ శ్రావణ్‌ కుమార్‌ను వివరణ కోరగా.. శ్రీను అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాన్ని తొలగించే ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూసేందుకు వచ్చామన్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి సురేశ్‌ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు రెవెన్యూ, 
పోలీసు సిబ్బందితో బందోబస్తుకు విచ్చనట్లు తహసీల్దార్‌  చెప్పారు.

అలా అయితే ఆర్‌ అండ్‌ బీ అధికారులే రావాలిగా... 
ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వస్తే ఆ శాఖాధికారులే వచ్చి విషయం చెప్పాలి. కానీ పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్లు వచ్చి పడగొట్టడమేంటి? ఈ స్థలాన్ని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకునే వ్యూహంతో ఉన్నారు. ఇది గమనించే ఇటీవల మళ్లీ దర్శి కోర్టును ఆశ్రయించా. కేసు విచారణకు రాబోతున్న దశలో హడావుడి చేసి ఇల్లు కూలగొట్టారు. ఇది నిజంగా ఆర్‌అండ్‌బీ స్థలమే అయితే గతంలో టీడీపీ నాయకులు  ఎందుకు కేసులు వేశారు. – ముప్పరాజు శ్రీను, బాధితుడు

Advertisement
 
Advertisement
Advertisement