
సచివాలయాల ద్వారా 540 సేవలు గతం నుంచే అందుతున్నాయని తెలుపుతున్న సీఎం డ్యాష్‌బోర్డు
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గతం నుంచీ 540 రకాల సేవలు
పాస్‌పోర్టు, పాన్‌కార్డు అప్లికేషన్ వంటి 200కి పైగా సీఎస్‌సీ సర్విసులు కూడా
పాలనను ప్రజల గడప ముందుకు తీసుకెళ్లిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ప్రజాసంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సేవల్ని ప్రజల గడప వద్దకే తీసుకెళ్లారు. పాలనలో వినూత్న సంస్కరణలు అమలుచేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవల్ని కూడా ప్రజలకు అందించింది. 2019కి ముందు చాలాచోట్ల పెద్ద గ్రామ పంచాయతీల్లో సైతం పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి కూడ లేని పరిస్థితి ఉండేది. ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఎలాంటి పనికోసమైనా ఎన్నో వ్యయప్రయాసలకు గురయ్యేవారు. ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందుల్ని తొలగించేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వాటిలో శాశ్వత ఉద్యోగులతోపాటు వలంటీర్లను కూడా నియమించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 540 రకాల సేవలతో పాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు కోసం అప్లికేషన్ వంటి 200కి పైగా సీఎస్‌సీ సర్విసులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సచివాలయాల ద్వారా 2019–24 మధ్య కాలంలో ఏకంగా 10.34 కోట్ల ప్రజా వినతులను పరిష్కరించింది. వీటిలో కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, పట్టదారు పాసుపుస్తకాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు తదితర సమస్యలున్నాయి.
చివరకు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవల్ని సైతం అప్పుడే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా కులధ్రువీకరణ పత్రాలు వంటి వాటికోసం వలంటీరు ద్వారా ఇంటివద్దగానీ, సచివాలయంలోగానీ దరఖాస్తు చేసుకుంటే.. ఆ దరఖాస్తుకు సంబంధించిన సమాచారాన్ని అర్జీదారుకు వాట్సాప్ ద్వారా తెలియజేయడంతోపాటు మంజూరైన ధ్రువీకరణపత్రాన్ని కూడా వాట్సాప్ ద్వారా పంపించే కార్యక్రమాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అప్పట్లోనే చేపట్టింది.
క్షేత్రస్థాయిలో వ్యవస్థ బలోపేతం
రాష్టంలో దాదాపు మూడువేల గ్రామ పంచాయతీలకు కనీసం కార్యాలయ భవనాలు లేని పరిస్థితిలో.. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రవ్యాప్తంగా 10,893 గ్రామ సచివాలయాలను మొదలు పెట్టి దాదాపు 9 వేల భవనాల నిర్మాణం పూర్తిచేశారు. గ్రామ సచివాలయాల్లో ఒక్కో దాంట్లో రెండేసి కంప్యూటర్లు, ఓ యూపీఎస్‌ను కూడా అందించారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్‌లు, 15,002 ప్రింటర్లతో పాటు మూడువేల ఆధార్ కిట్‌లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపిణీ చేశారు. వలంటీర్లతోపాటు ఇతర సచివాలయ సిబ్బందికి 2,91,590 స్మార్ట్‌ఫోన్లనూ సిమ్ కార్డులతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో అందజేశారు.