ఓటర్ల తుది జాబితా వచ్చేవరకు ‘స్థానిక’ సన్నాహాలు సరికాదు | YSRCP approaches Supreme Court Over AP Local Body Elections | Sakshi
Sakshi News home page

ఓటర్ల తుది జాబితా వచ్చేవరకు ‘స్థానిక’ సన్నాహాలు సరికాదు

Oct 6 2026 5:09 AM | Updated on Oct 6 2026 5:13 AM

YSRCP approaches Supreme Court Over AP Local Body Elections

సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ  

స్థానిక ఎన్నికల వాయిదాను కోరడం లేదు 

తుది ఓటర్ల జాబితాతోనే నిర్వహించాలని కోరుతున్నాం 

2026 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదిక కాకూడదని అభ్యర్థిస్తున్నాం 

ఇదే జరిగితే పెద్ద సంఖ్యలో పౌరులు ఓటుహక్కు కోల్పోతారు 

స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికలు జరిగే అవకాశమే ఉండదు 

అత్యున్నత న్యాయస్థానం ముందు పార్టీ తరఫున వాదనలు 

వార్డుల పునర్వీభజనపై హైకోర్టు ఉత్తర్వులపైనా అభ్యంతరాలు 

శుక్రవారం విచారణ చేపట్టనున్న సీజేఐ ధర్మాసనం  

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల వివాదం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ఓటర్ల జాబితా ఖరారు అలాగే రాష్ట్రంలో వార్డుల పునర్వీభజన (డీలిమిటేషన్‌)పై ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక ఉమ్మడి తీర్పును సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టనుంది.

 వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కడప మాజీ మేయర్‌ పాక సురేష్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం ముందు వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాది మహ్ఫూజ్‌ ఎ.నజ్కి సోమవారం ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక సమగ్ర సవరణ) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఈ ప్రక్రియ పూర్తయి తుది జాబితా ఖరారైన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. 2026 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదిక కాకూడదని వాదించారు. 

ఇదే జరిగితే పెద్ద సంఖ్యలో పౌరులు ఓటుహక్కు కోల్పోతారని, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికలు జరిగే అవకాశమే ఉండదని వివరించారు.  ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉన్నందున, తక్షణమే జోక్యం చేసుకోవాలని ధర్మాసనానికి విన్నవించారు. అలాగే జనాభా లెక్కల నిబంధనల ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ల సరిహద్దుల ఫ్రీజింగ్‌ అమల్లో ఉన్న సమయంలో వార్డుల పునర్వీభజన చేపట్టడం చట్టవిరుద్ధమని కూడా  పేర్కొన్నారు.  

జనాభా లెక్కల్లో వార్డు కూడా కీలకమే
వార్డుల పునర్వీభజనపై పిటిషనర్లు 
2027 జనాభా లెక్కల (సెన్సస్‌) ప్రక్రియ  కారణంగా 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా పరిపాలనా విభాగాల భౌగోళిక సరిహద్దులను ‘ఫ్రీజ్‌’ చేస్తూ రిజి్రస్టార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా 2025 ఆగస్టులో సర్క్యులర్‌ జారీ చేశారు. అయితే, ఈ ఫ్రీజింగ్‌ నిబంధన అమల్లో ఉండగానే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్‌) చేపడుతూ 2026 మార్చి 24న జీవో 65ను జారీ చేసింది.

సెన్సస్‌ రూల్స్‌–1990లోని నిబంధన 8(4) ప్రకారం ఫ్రీజింగ్‌ సమయంలో సరిహద్దులు మార్చకూడదని, వార్డు కూడా పరిపాలనా విభాగమేనని తెలుపుతూ వైఎస్సార్‌సీపీ నేతలు, కడప మాజీ మేయర్‌ పాక సురేష్‌ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అక్టోబర్‌ 1, 2026న తీర్పు వెలువరించింది. మున్సిపాలిటీ అనేది అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్‌ అని, ‘వార్డు’ కాదని కోర్టు స్పష్టం చేసింది.

మున్సిపాలిటీ భౌగోళిక సరిహద్దులు మారనంత వరకు, ఆ పరిధిలో వార్డుల పునర్విభజన చేపట్టడం చట్టవిరుద్ధం కాదని తేల్చిచెబుతూ పిటిషన్లను కొట్టివేసింది. దీన్ని పిటిషనర్లు సవాలు చేస్తూ.. ‘వార్డు కూడా సెన్సస్‌ ప్రక్రియలో కీలక భాగమేనని, మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు ఏపీ హైకోర్టు తీర్పు విరుద్ధంగా ఉందని’ పేర్కొంటూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పాత వార్డుల ఆధారంగానే ఎన్నికలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 65పై స్టే ఇవ్వాలని కోరారు. 

ఎస్‌ఈసీ చర్యలుసరికాదు
వైఎస్సార్‌సీపీ తరఫు వాదనలు
దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ సహా 19 రాష్ట్రాల్లో 01.07.2026ను అర్హత తేదీగా తీసుకుని సర్‌ను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 01.01.2026ను అర్హత తేదీగా తీసుకుంటూ పురపాలక సంఘాల్లో ఓటర్ల జాబితా ప్రచురణకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సర్‌ పూర్తయి తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలని కోరుతూ ఎన్నికల సంఘానికి మేం వినతి పత్రం ఇచ్చినా తగిన స్పందన లేదు.

సర్‌ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి. మేము ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం లేదు. సర్‌ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం.  2026 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకొని అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ చర్యలు చేపట్టడం సరికాదు. దీని వల్ల పెద్ద సంఖ్యలో పౌరులు ఓటు హక్కు కోల్పోతారు. నామినేషన్ల ముగింపు తేదీ నాటికి జరిగే అన్ని సవరణలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ ఓటర్ల జాబితా విడుదల చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

సర్‌లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం 31.07.2026న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో రాష్ట్రంలో సుమారు 15.22 లక్షల మంది మరణించిన వారు, 7.37 లక్షల నకిలీ ఓట్లు, పెద్ద సంఖ్యలో శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు నమోదై ఉన్నాయి. సర్‌ప్రక్రియ పూర్తికాకముందే 01.01.2026 అర్హత తేదీతో పాత, తప్పుల తడకగా ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు వెళ్లడం వల్ల ఒకే ప్రాంతంలో అసెంబ్లీకి ఒక జాబితా, స్థానిక సంస్థలకు మరొక జాబితా ఉంటుంది.

మరణించిన, నకిలీ ఓటర్లు స్థానిక జాబితాలో కొనసాగడం వల్ల రిజర్వేషన్లు, రొటేషన్‌ విధానం దెబ్బతింటుంది. పంచాయతీ రాజ్‌ చట్టం, మున్సిపాలిటీల చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన ఓటర్ల జాబితా ఉండదు. అది పూర్తిగా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే తయారవుతుంది. చట్ట సవరణల ద్వారా జూలై 1ని కూడా అర్హత తేదీగా ఆమోదించినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 01.01.2026 తేదీనే ఎంచుకోవడం ఏకపక్షం. ఎన్నికల సంఘం తీరు వల్ల స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. పారదర్శకతకు స్థానం లేకుండా పోతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement