తవ్వినకొద్దీ.. కట్టుకథలే..! | YS Jaganmohan Reddy allocated huge funds for the Veligonda project and started the work | Sakshi
Sakshi News home page

తవ్వినకొద్దీ.. కట్టుకథలే..!

Nov 9 2025 4:31 AM | Updated on Nov 9 2025 4:31 AM

YS Jaganmohan Reddy allocated huge funds for the Veligonda project and started the work

వెలిగొండ ప్రాజెక్టుపై కూటమి దొంగాట

2014–19 వరకు బాబు హయాంలో తవ్వింది 4 కిలోమీటర్లలోపే.. 

ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించి పనులను గాడిలో పెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

రెండు టన్నెల్స్‌ పూర్తి చేసి జాతికి అంకితం 

నిర్వాసితులకు కాలనీలు కేటాయించి మౌలిక వసతులు  

కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలో అరకొరగా నిధుల కేటాయింపు 

జోరుగా పనులు సాగుతున్నాయంటూ ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామానాయుడు గొప్పలు 

వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే సవతి ప్రేమ ఒలకబోస్తోంది. సీఎం చంద్రబాబు నుంచి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రాజెక్టు పూర్తికి, నిర్వాసితుల పునరావాసానికి దాదాపు రూ.2000 కోట్లు అవసరమంటూ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఏడాదిన్నర కాలంలో అత్తెసరు నిధులు విడుదల చేసి పనులు వేగంగా జరుగుతున్నాయంటూ మంత్రి నిమ్మల రామానాయుడు అసత్య ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముచ్చటగా మూడోసారి వచ్చిన మంత్రి.. ప్రాజెక్టుకు ఎంత నిధులిచ్చారు..జరిగిన పని గురించి చెప్పకుండా వచ్చే ఏడాదిలో నీళ్లిచ్చేస్తామంటూ ఎప్పటిలాగే గొప్పలు చెప్పుకుని వెళ్లిపోయారని పశ్చిమ ప్రకాశం వాసులు మండిపడుతున్నారు.  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మూడు జిల్లాల వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. 1997లో వెలిగొండ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. సర్వే పేరుతో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా తన నైజాన్ని ప్రదర్శించిన విషయాన్ని నేటికీ ప్రకాశం జిల్లా ప్రజలు మర్చిపోలేదు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల పాలనలో ఐదు సార్లు జిల్లాకు వచ్చారు. 

వచ్చినప్పుడల్లా ‘త్వరలో వెలిగొండను ప్రారంభించి పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేస్తా’ అంటూ హామీలు గుప్పిస్తూ కాలం గడిపేశారు. 2018 జూన్‌ నెలలో జిల్లాకు వచ్చిన చంద్రబాబు.. 2019 సంక్రాంతికల్లా వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని ప్రకటించారు. అధికారం పోయిన తర్వాత జిల్లాకు వచ్చి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయడంపై పశ్చిమ ప్రకాశం ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. 

తన హయాంలో వెలిగొండ ప్రాజెక్టును గాలికొదిలేసి వైఎస్సార్‌ సీపీ హయాంలో వెలిగొండ పనులు వేగంగా జరుగుతుంటే విమర్శలు చేయటమే పనిగా పెట్టుకోవటాన్ని ప్రజలు విమర్శించారు. ఈ నేపథ్యంలో 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండు సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అత్తెసరు నిధులను వెలిగొండ ప్రాజెక్టుకు కేటాయించింది. ఈ నిధులతో పనులు జో­రుగా జరుగుతున్నాయంటూ రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు కూడా సీఎం చంద్రబాబు మాదిరిగానే మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ముచ్చటగా మూడోసారి... 
వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు ఇప్పటికే రెండు సార్లు వచ్చిన నిమ్మల ఇటీవల దోర్నాల వచ్చి వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, సాక్షి దినపత్రికపై విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదని నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పారు. మూడు సార్లు వచ్చి ఏం సాధించారంటే.. ప్రొటోకాల్‌ ఖర్చులు తప్ప ఏమీ లేదనే చెప్పాలని రైతులు మండిపడుతున్నారు. 

2014–19 వరకు 2 టన్నెల్స్‌ కలిపి 4 కిలోమీటర్లలోపే... 
చంద్రబాబు మూడోసారి సీఎంగా ఉన్న 2014–19 మధ్యలో వెలిగొండకు గ్రహణం పట్టింది. ప్రాజెక్టుకు ప్రధానమైన రెండు టన్నెళ్లు కలుపుకుని కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయి. ఆ పనులను సైతం తన బినామీ అయిన సీఎం రమేష్‌కు నామినేషన్‌ మీద అప్పగించి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 

జలయజ్జంలో 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఆయన అకాల మరణం తర్వాత పనులు మందగించాయి. చంద్రబాబు నిధులివ్వకుండా ప్రాజెక్టును చిన్నచూపు చూసి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల ప్రజలనూ నిలువునా మోసం చేశారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రెండు టన్నెళ్లు పూర్తి... 
వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ పొడవు 18.80 కిలోమీటర్లు. రెండో టన్నెల్‌ పొడవు 18.78 కిలోమీటర్లు. ఈ రెండు టన్నెళ్లకు సంబంధించిన పురోగతిని పరిశీలిస్తే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును ఉరుకులు, పరుగులు పెట్టించారు. ఆయన హయాంలో మొదటి టన్నెల్‌కు సంబంధించి 11.58 కి.మీ పనులు పూర్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రెండు టన్నెళ్లకు సంబంధించి కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే పూర్తిచేశారు. 

అనంతరం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే 5.22 కిలోమీటర్ల మేర మొదటి టన్నెల్‌ తవ్వి పనులు పూర్తి చేశారు. అలాగే రెండో టన్నెల్‌ను కూడా 10.04 కిలోమీటర్లు తవ్వకాలు పూర్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. రెండు టన్నెళ్లు పూర్తయిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు...
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేప­ట్టి­న వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఒక వైపు ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు నిర్వాసితులకు అండగా నిలిచారు. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తండా నిర్వాసితులకు మార్కాపురం మండలం కుంట వద్ద, పెద్దారవీడు మండలం సుంకేశుల, కలనూతల, చింతలముడిపి గ్రామాల వారికి గోగులదిన్నె వద్ద, సుంకేశులలోని ఎస్సీలకు తోకపల్లి వద్ద కలనూతలలో, కొంతమంది నిర్వాసితులకు ఇడుపూరు వద్ద కాలనీలు ఏర్పాటు చేశారు. 

అలాగే సిమెంటు రోడ్లు, వాటర్‌ ట్యాంకులు, కమ్యూనిటీ హాలు, పాఠశాలలు నిర్మించారు. చంద్రబాబు హయాంలో పునరావాసానికి రూ. 1.80 లక్షలు ప్రకటిస్తే.. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే రూ.12.50 లక్షలకు పెంచారు. అందుకోసం రూ.1400 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీటిని పట్టించుకోకపోవడంతో చిల్లచెట్లు, పిచ్చికంపతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారాయి. దీంతో నిర్వాసితుల్లో నిరాశ, నిస్పృ­హలు ఏర్పడ్డాయి. 

ప్రాజెక్టు పరిధిలో 11 గ్రామాల ప్రజలు ప్రస్తుతానికి సొంతూళ్లలోనే ఉంటున్నారు. మొత్తం 7,270 కుటుంబాలు ఉన్నాయి. పునరావాస ప్రక్రియ పూర్తికాకపోవడంతో శిథిలావస్థకు చేదుకున్న గృహాల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు వీరి కష్టాలను గాలికొదిలేసి ఆర్భాటపు ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నారని పశి్చమ ప్రకాశం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement