మానవత్వం చూపించాల్సిన చోట అమానవీయంగా ప్రవర్తిస్తారా? | YS Jagan Full Speech Highlights At Vizag Steel Plant Victims Console, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

మానవత్వం చూపించాల్సిన చోట అమానవీయంగా ప్రవర్తిస్తారా?

Jun 10 2026 1:44 PM | Updated on Jun 10 2026 3:57 PM

Ys Jagan Speech At Vizag Steelpalnt Victims Console

సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఇక్కడి కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైఎస్సార్‌సీపీనేనని.. ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారాయన. బుధవారం సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం బాధాకరం. ప్రమాదంలో 9 మంది చనిపోయారు. గాయపడ్డ ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 95 శాతం కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు అని ఆయన అన్నారు. 

వైఎస్సార్‌సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది?.. కూటమి హయాంలో ఎలా ఉందో గమనించాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ అడ్డుకుంది. ఈ విషయంలో గట్టిగా పోరాటం చేశాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశాం.(2021 ఫిబ్రవరి 6, మార్చి 9న రాసిన నాటి లేఖలను ఆయన చదివి వినిపించారు). ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం అని గుర్తు చేశారాయన. 

మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 28 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ, ఈ రెండేళ్లలో 10,500 మందిని తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించారు. వీఆర్‌ఎస్‌ పేరుతో 1,800 మందిపై ఒత్తిడి చేశారు. మొత్తంగా.. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారు. 

కూటమి హయాంలో.. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగు నెలల జీతాలు బకాయిలు పెట్టారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్‌కు లింకు పెట్టారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్‌లో యూనిట్‌ విద్యుత్‌కు 50 పైసలే చార్జ్‌ చేసేవాళ్లం. కూటమి వచ్చాక యూనిట్‌కు రూ.8.50పైసలకు పెంచారు. ఉద్యోగుల్ని క్వార్టర్స్‌ను వదిలిపోయేలా చేశారు. బోనస్‌, మెడికల్‌ ఫెసిలిటీస్‌ ఏం లేవు. ప్యాకేజీ ఇచ్చామని కూటమి పెద్దలు చెబుతున్నారు. అది మెయింటెనెన్స్‌ కోసం కాదు.. బలవంతంగా బయటకు పంపేందుకు ఇచ్చిన ప్యాకేజీ. ఉద్యోగుల బాగోగుల కోసం ఏ ప్యాకేజీ ఇవ్వలేదు అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

ఇంత దారుణమా?
స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదు. లిక్విడ్‌ మెటల్‌ బ్లాస్ట్‌ అవ్వడంతోనే జరిగింది. కానీ, కేంద్ర, రాష్ట్రాలు స్పందిస్తున్న తీరు దారుణం. 14 నెలల కిందట ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. పెంటయ్య అనే కార్మికుడు మరణించాడు. నెలలోపే ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పటి వరకు పరిహారం కూడా ఇవ్వలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని జగన్‌ గుర్తు చేశారు. అధికారుల్ని అడిగితే ఫైల్‌ పోయిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది.

నువ్వు ఇచ్చింది ఏందయ్యా బోడే? లోకేష్ పై జగన్ ఫైర్ 

లోకేశ్‌ అసలు మనిషేనా?
ఇంత ప్రమాదం జరిగితే.. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాలి. చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి లోకేశ్‌ దారుణంగా మాట్లాడారు. నిన్న ఆయన మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది. లోకేశ్‌ లాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం పరిహారం ఇస్తారో చెప్పమంటే కూడా స్పందించలేదు అని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో మంత్రి నారా లోకేష్‌ చాలా విచిత్రంగా మాట్లాడాడు. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు వస్తాయని చెబుతున్నావు. అది రెగ్యులర్‌గా వచ్చేది. ‘బోడి’ మీరిచ్చేది ఏమిటి? మరి ప్రభుత్వం నుంచి ఏం ఇస్తున్నట్లు? ఆ రూ.1.72 కోట్లు అది వారి హక్కు. ఇంకా ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్‌ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్‌ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్‌ ఇన్సూరెన్స్‌.. అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. మరి ‘బోడి’ రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తోంది. మీకు మీరుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. వాళ్లకు హక్కుగా వచ్చేది వస్తోంది తప్ప, రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఇస్తున్నది ఏమీ లేదు.

ఇదీ చదవండి: మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా!

మీరు ఇవ్వకుంటే.. మేమొచ్చాక ఇస్తాం
గతంలో.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ తరహాలోనే ఫ్యాక్టరీ ప్రమాదం జరిగినప్పుడు స్పాట్‌లో రూ.కోటి రూపాయల పరిహారం అందించాం. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆదుకున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. బాధితులకు రావాల్సినవి కాకుండా మీరు ఏం చేస్తున్నారు?. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ప్రకటించలేదు. కేంద్రం, పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచే పరిహారం ప్రకటించారంతే. స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. బాధిత కుటుంబాలకు ఉద్యోగం కూడా ఇవ్వాలి. చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిహారం మేమే అందిస్తాం అని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement