సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మంత్రి నారా లోకేశ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల ఆగ్రహం, నిరసనల మధ్య ఆయన వ్యవహరించిన తీరు కాస్త అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది. హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి స్టీల్‌ప్లాంట్ వద్దకు చేరుకున్న లోకేశ్‌కు.. కార్మికుల మృతి, నిర్వహణ లోపంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన సహనం కోల్పోయి.. కార్మిక సంఘాల నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్లాంట్‌లో జరిగిన ప్రమాదాలు, కార్మికుల భద్రత అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు.. మంత్రి లోకేశ్ ఎదుటే నిరసనకు దిగాయి. నైపుణ్యం లేని కాంట్రాక్ట్ కార్మికులను ఎలా అనుమతించారన్న ప్రశ్నతో మంత్రిని నిలదీశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఎంపీ భరత్, హోం మంత్రి అనితలు పరిస్థితిని చల్లార్చేందుకు ప్రయత్నించినా, కార్మికుల ఆగ్రహం తగ్గలేదు.
ఈ క్రమంలో కార్మికుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిన లోకేశ్, “స్టీల్‌ప్లాంట్‌ను మేమే కాపాడాము” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. “అందుకే ఇంతమంది చనిపోయారా?” అంటూ వారు తిరిగి ప్రశ్నించారు.

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోకుండా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎందుకు గొడవ పడుతున్నారు.. రాజకీయం చేయడానికి వచ్చారా?” అంటూ లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కార్మిక సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మరోసారి కలుగజేసుకున్న లోకేశ్.. “మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదు కదా?” అంటూ వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారాయి.
పరామర్శకు వచ్చి అవహేళనగా మాట్లాడారని.. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని లోకేశ్‌ను ఉద్దేశించి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనూ ఆయన ‘‘మరి మమ్మల్నెందుకు నిలదీశారు?’’ అంటూ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తానికి, పరామర్శగా మొదలైన నారా లోకేశ్ స్టీల్‌ప్లాంట్ పర్యటన కార్మికుల ఆగ్రహం, ప్రశ్నలు, ఎదురుదాడులతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
నియంతలా లోకేశ్ తీరు
స్టీల్ ప్లాంట్ వద్ద పరామర్శ పేరుతో నారా లోకేశ్ చేసిన ఓవరాక్షన్‌పై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘‘కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. అందుకే ఈ ఘోరం జరిగింది. పైగా కార్మిక సంఘాలను, కార్మికులను ఇప్పుడు నారా లోకేశ్ అవమానించారు. నియంతలా వ్యవహరిస్తూ.. ఎవరికీ సమాధానం చెప్పను అన్నట్లు ఉంది ఆయన తీరు. కార్మికులను బెదిరించే విధంగా లోకేశ్ మాట్లాడారు. కార్మిక సంఘాలకు, కార్మికులకు ఆయన క్షమాపణలు చెప్పాలి. బాధిత కుటుంబాలకు రూ కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేజీహెచ్ దగ్గరా..
కేజీహెచ్ వద్ద పరామర్శకు వెళ్లిన మంత్రి లోకేశ్‌కు.. అక్కడా చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులను పరామర్శించబోయే సమయంలో వామపక్ష నేతలు అడ్డుకున్నారు. పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనూ లోకేశ్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. డబ్బులిచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదు అనడంతో.. వామపక్ష నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.



