
సాక్షి, అమరావతి: గత ఎన్నికలకు ముందు పట్టణ పేదలకు టిడ్కో ఇళ్లంటూ హడావుడిగా టెంకాయలు కొట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏ ఒక్కరికీ గృహ యోగం కల్పించకుండా దగా చేశారు! పేదలకు ఇళ్లంటూ రెండు దశాబ్దాల పాటు గృహ రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి కల్పించారు! ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే పేదలు తలెత్తుకుని ఆత్మ గౌరవంతో జీవించేలా 31 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు గృహ యజ్ఞాన్ని చేపట్టారు.
300 చ.అడుగుల టిడ్కో ఇళ్లను పేదలకు ఉచితంగా అందించడంతో పాటు ఇతర టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు భారీ ఊరట కల్పించారు. పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తుంటే ఈనాడు రామోజీ కడుపు మంటతో రగిలిపోతున్నారు. పేదల గూడుపై తన కరపత్రికలో బురద చల్లుతున్నారు.
‘ఇక్కట్ల ఇళ్లు.. జగన్‌కే చెల్లు!’ తొమ్మిది చోట్ల పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉందంటూ ఓ రోత కథనాన్ని రాసుకుని సంబరపడ్డారు! నిజానికి ఆయన చెబుతున్న తొమ్మిది చోట్ల వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే రోడ్లు, డ్రైన్‌లు, కల్వర్ట్‌లు, నీటి సరఫరా, సెప్టిక్ ట్యాంక్‌లు ఇతర పనులన్నీ పూర్తి అయ్యాయి. విశాఖపట్నం ఏఎస్‌ఆర్ కాలనీలో సిమెంట్ రోడ్లు లేవని, మురుగు కాల్వలు మచ్చుకైనా కనిపించడం లేదంటూ కన్నీళ్లు కార్చారు. అక్కడ 280 ఇళ్లలో లబ్ధిదారులు నిక్షేపంగా నివాసం ఉంటున్నారు.