ఇప్పటికి రెండుసార్లు పూర్తి అయినా నిర్ణయం తీసుకోకుండా తాత్సారం
ఈ ముసుగులో భూముల స్వాహాకు టీడీపీ నేతల యత్నాలు
సాక్షి, అమరావతి: నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూములపై రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కసరత్తు జరుగుతోంది. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో భాగంగా యంత్రాంగం నాలుగు నెలలుగా రెండు సార్లు రీ వెరిఫికేషన్ చేసింది. అయినా, ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. వివాదాలు లేని భూములపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా ఆ పని చేయలేకపోతోంది. దీంతో మళ్లీ వెరిఫికేషన్ జరిపిస్తున్నారు.
చంద్రబాబు సర్కారు వచ్చాక 22ఏ నుంచి తమ భూములను తొలగించాలని గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా 6,846 దరఖాస్తులు వస్తే కేవలం 829 మాత్రమే రెవెన్యూ యంత్రాంగం క్లియర్ చేసింది. 305 దరఖాస్తులకు అనుమతివ్వగా 524 తిరస్కరించింది. 6,017 పెండింగ్‌లో ఉంచారు. వీటిపై నిర్ణయం తీసుకోవడానికి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వెనుకాడుతున్నారు. వివాదాల భయంతో ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించాలనే రీతిలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)కు పంపుతున్నారు.
అయితే, సీసీఎల్‌ఏ, ప్రభుత్వ స్థాయిలోనూ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో దరఖాస్తులు జిల్లాల నుంచి సీసీఎల్‌ఏ, అక్కడినుంచి జిల్లాల చుట్టూ తిరుగుతున్నాయి. వాస్తవానికి రైతులు, భూముల యజమానులు పెట్టుకున్న దరఖాస్తులు లక్షల సంఖ్యలో ఉన్నాయి.
కాగా, బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను తొలుత పరిగణనలోకి తీసుకుంది. వాటిలో 90 శాతం పరిష్కరించలేకపోయింది. మండలాల వారీగా 22ఏ జాబితాలో అన్ని భూములపైనా వెరిఫికేషన్ జరిపింది. వీఆర్‌వో, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ తనిఖీ చేసిన తర్వాత ఆర్డీవో, జేసీ, కలెక్టర్ స్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
తహసీల్దార్... 22ఏ నుంచి తొలగించాలని సిఫారసు చేసిన భూములనూ పెండింగ్‌లో ఉంచారు. ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల జోక్యం ఉండడంతో చిక్కుల్లో పడతామని జిల్లా అధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు జంకుతున్నారు. 22ఏలోని భూములపై కన్నేసిన టీడీపీ ప్రజాప్రతినిధులు సంబంధిత యజమానులతో బేరాలు మాట్లాడుకుని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఈ నేపథ్యంలో సక్రమంగా ఉన్నాసరే పరిష్కారానికి అధికారులు భయపడుతున్నారు. ఎలాగోలా సమస్యకు తెరపడాలని భూ యజమానులు భావిస్తుండగా, దానిని సొమ్ము చేసుకోవడానికి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. దీంతో గందరగోళం నెలకొంది.


