కొడుకును కాపాడుకోవడం కోసమే.. ఏపీపీఎస్సీపై అభాండాలు | YS Jagan Fire On Chandrababu Over DSC Scam: AP | Sakshi
Sakshi News home page

కొడుకును కాపాడుకోవడం కోసమే.. ఏపీపీఎస్సీపై అభాండాలు

Aug 21 2026 4:16 AM | Updated on Aug 21 2026 4:16 AM

YS Jagan Fire On Chandrababu Over DSC Scam: AP

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ధ్వజం

గ్రూప్‌–1 పరీక్ష ప్రక్రియలో ఏ తప్పూ జరగలేదు.. అన్నీ పిచ్చి ఆరోపణలు 

పరీక్షల్లో అవకతవకలు జరగలేదని మీరు వేసిన సిట్టే హైకోర్టుకు చెప్పింది 

మీ మాదిరిగా పరీక్షలే రాయకుండా ఎవరికీ మేం ఉద్యోగాలివ్వలేదు 

కోవిడ్‌ కారణంగానే డిజిటల్‌ మూల్యాంకనం 

అయినా డిజిటల్‌ మూల్యాంకనాన్ని పరిగణనలోకి తీసుకోలేదు 

డిజిటల్‌ మూల్యాంకనాన్ని హైకోర్టు తప్పుబట్టలేదు  

కానీ నోటిఫికేషన్‌లో లేనందున మాన్యువల్‌ మూల్యాంకనం జరపాలని సూచించిన హైకోర్టు 

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే మొత్తం ప్రక్రియ 

సీసీటీవీల పర్యవేక్షణలో మూడు చోట్ల మూల్యాంకనం 

పేపర్లు ట్యాంపర్‌ అవలేదని తేల్చిన సీఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక 

బాబు హయాంలో సీసీటీవీలు లేవు.. ఒకటే ఇంటర్వ్యూబోర్డు 

మా హయాంలో ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు 

మూడు ఇంటర్వ్యూ బోర్డులు.. వాటిలో ఐఏఎస్‌లతోపాటు వీసీలు 

జంబ్లింగ్‌ పాటించాం.. పారదర్శకతకు పెద్దపీట వేశాం

సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు, కుంభకోణానికి పాల్పడి, ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన తన కొడుకును కాపాడుకోవాలన్న ఆరాటంతో సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా గ్రూప్‌–1 నియామకాలపై పచ్చి అబద్ధాలు వల్లెవేశారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వల్లెవేసిన అబద్ధాలను సాక్ష్యాధారాలతో కడిగిపారేశారు. గురువారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ గ్రూప్‌–1పై చంద్రబాబు  ప్రభుత్వమే వేసిన సిట్‌ ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ, ఇంటర్వూ్యలు జరిగాయని హైకోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పారన్నారు.

‘నిజానికి నాడు చంద్రబాబు హయాంలోనే గ్రూప్‌–1 పరీక్షల ప్రిలిమ్స్‌ జరిగాయి. మేము వచ్చాక మెయిన్స్‌ మాత్రమే నిర్వహించాం. ఎక్కడా తప్పు చేయలేదు. అక్రమాలు చోటు చేసుకోలేదు. డీఎస్సీ కుంభకోణం నుంచి కొడుకును కాపాడుకోవడం కోసమే నాలుగేళ్లుగా పనిచేస్తున్న 163 మంది ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయడానికి కూడా చంద్రబాబు  వెనుకాడటం లేదు’ అని జగన్‌ విమర్శించారు. ఏపీపీఎస్సీపై చంద్రబాబు అబద్ధాలను అంశాలవారీగా ఆధారాలతో సహా జగన్‌ ఖండించారు. వైఎస్‌ జగన్‌ ఏమి మాట్లాడారంటే...

డీఎస్సీలోలా పేపర్‌ లీకేజీ లేదు
‘‘చంద్రబాబు తన కొడుకును కాపాడుకోవడానికి ఏ విధంగా బురద జల్లుతున్నాడో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు మరింత దిగజారిపోయి తన ప్రభుత్వమే 2018లో  ప్రకటించిన ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పోస్టుల భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు టార్గెట్‌ చేశాడు. బాబు ప్రభుత్వ హయాంలోనే ప్రిలిమ్స్‌ అయిపోయాయి. మేము చేసింది కేవలం మెయిన్స్‌ నిర్వహించడమే. ఇక ఎక్కడ నుంచి వస్తాయి స్వార్థ ప్రయోజనాలు. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో లాగా పేపర్‌ లీకేజీ జరగలేదు.

 ఇప్పటి డీఎస్సీలో లాగా ప్రశ్నపత్రాల తయారీ విభాగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. ఎవరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు తీసుకురాలేదు. మా ప్రభుత్వంలో పరీక్షలే రాయకుండా ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు అమ్ముకున్నట్లుగా, బేరసారాలు చేస్తున్నట్లుగా, డబ్బులు ఇచ్చినట్లుగా ఎవరివీ ఆడియోలు, వీడియోలు ఎలాంటి ఆధారాలు మా ప్రభుత్వ హయాంలో రాలేదు. మా ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు జరుగుతున్న డీఎస్సీ స్కాంకు మధ్య తేడా ఇదే. కేవలం కొడుకును కాపాడుకోవడం కోసం చంద్రబాబు  ఆక్రోశం, ఆరాటం బయటకు వస్తోంది.

చంద్రబాబు వేసిన సిట్టే క్లీన్‌ చిట్‌ ఇచ్చింది
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఆరోపణలపై వాస్తవాల్లోకి వెళ్దాం.. చంద్రబాబు  అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2025 ఏప్రిల్‌లో ఒక సిట్‌ వేశారు. ఫలితాల వెల్లడిలో ఏ తప్పూ జరగలేదని నవంబర్‌14, 2025న చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇది ఒకవైపు జరుగుతుండగానే ఈ సిట్‌ ఇలా హైకోర్టులో అఫిడవిట్లు వేస్తుండటంతో ఎలాగోలా ఇరికించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ఫిబ్రవరి14, 2026న రెండో సిట్‌ వేశారు. బాబు కింద పనిచేసేవారే కదా ఆ సిట్‌లో ఉండేది. అధికారులను వాడుకోవడం చంద్రబాబుకు అలవాటే కదా.. నిజాలు ఎవరూ దాచిపెట్టలేరు.

ఎప్పటికైనా బయటకు వస్తాయి. 2019 ఎన్నికలకు 76 రోజుల ముందు చంద్రబాబు నోటిపికేషన్‌ ఇచ్చారు. మా ప్రభుత్వం మే 30న రాక మునుపే మే 26, 2019 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్స్‌ అయిపోయాయి. మేం వచ్చాక ప్రిలిమ్స్‌ ఫలితాలు ప్రకటించి 2020 డిసెంబర్‌లో మెయిన్స్‌  నిర్వహించాం. బాబు హయాంలో నిర్వహించిన ప్రిలిమ్స్‌లో ఎంపికైన వారికి మెయిన్స్‌ నిర్వహిస్తే వారిపై బురద జల్లుతున్నారు. ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా. 

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే మొత్తం ప్రక్రియ
కోవిడ్‌ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం. అటువంటి సమయంలో పరీక్షల ఫలితాల వెల్లడి ఆలస్యం కాకూడదని అప్పటి అధికారులు డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అప్పటి కమిషన్‌లో మునుపటి ప్రభుత్వం చంద్రబాబు హయాంలో నియమించిన ఐదుగురు సభ్యులు కూడా ఆమోదం తెలిపారు. బోర్డులో ఉన్న 10మంది సభ్యుల్లో ఐదుగురు వాళ్ళే ఉన్నారు. డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌ అంటే.. రాసిన పరీక్షల స్క్రిప్ట్స్‌ను స్కాన్‌చేసి పరీక్ష దిద్దే వారికి పంపిస్తారు. ఆన్‌లైన్‌లో వారు మార్కులు వేస్తారు. ఇది కూడా కోవిడ్‌ వల్ల.. అప్పటి పరిస్థితులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.

 రక్త సంబంధీకులు చనిపోతే కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి భయపడే పరిస్థితులు అవి. గ్రూప్స్‌  కింద ఒకే చోట తీసుకువచ్చి ఫిజికల్‌ ఎవాల్యుయేషన్‌ చేయలేని పరిస్థితి. అయినా కొంత మంది హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌ పరిగణనలోకి తీసుకోలేదు. ప్రక్రియ ముందుకు సాగలేదు. 

డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌ను తప్పుపట్టలేమని, కానీ నోటిఫికేషన్‌లో ఈ విషయం పేర్కొనకపోవడం వల్ల తాము మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌ చేయాలని ఆదేశాలు ఇస్తున్నట్లు హైకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొంది. హైకోర్టు చెప్పిన తర్వాత డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌ అన్నది పరిగణనలోకి తీసుకోలేదు. మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌ చేసి ఆ మార్కుల ఆధారంగా ఇంటర్వూ్యలు పూర్తి చేసి, 163 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నాలుగేళ్ల నుంచి ఈ 163 మంది ఉద్యోగాలు చేస్తుంటే ఇప్పుడు చంద్రబాబు వీరిపై విషం కక్కుతున్నారు.

మెగా డీఎస్సీ స్కామ్‌లో కుమారుడిని కాపాడుకునేందుకే గ్రూప్‌ 1 నియామకాలపై చంద్రబాబు పిచ్చి ఆరోపణలు.
చంద్రబాబు ఆరోపణలపై సీబీఐ విచారణకు మేం సిద్ధమే. మరి మెగా డీఎస్సీ–2025పై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా..? చంద్రబాబు, లోకేశ్‌ సిద్ధమైతే సీబీఐకి లేఖ రాయాలి.
⇒ 1.30 లక్షల ఉద్యోగాలు ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఇచ్చిన చరిత్ర మాది

⇒ అసలు పరీక్షే రాయకుండా ఎవరైనా ఉద్యోగాలు ఇస్తారా? 
⇒ స్కామ్‌ల కోసం జీవోలు ఇచ్చి పని పూర్తయ్యాక వాటిని రద్దు చేశారు
⇒ మీ స్కామ్‌లను కప్పిపుచ్చుకోవడానికి అంతర్జాతీయ క్రీడాకారిణి సింధును అడ్డుపెట్టుకుంటారా?
⇒ డీఎస్సీలో అక్రమాలు జరిగాయనేందుకు ఎన్నో సాక్షా్యలున్నాయి..

⇒ ఫస్ట్‌ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అనంతరం మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు మార్చారు? స్పోర్ట్స్‌ కోటా పేరిట ఇష్టానుసారంగా జీవోలు ఇచ్చి ఎందుకు మార్చారు? పార్టిసిపెంట్‌ సర్టిఫికెట్లకు ఉద్యోగాలు ఇచ్చేస్తారా? టీచర్‌ పోస్టులకు బేరసారాల ఆడియో కాల్‌పై తీసుకున్న చర్యలేమిటి? డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో జాబ్‌ ఇప్పిస్తామని తన దగ్గర రూ.14.10 లక్షలు లంచం వసూలు చేశారని బాధిత అభ్యర్థి రాధిక తాజాగా ఫిర్యాదు చేయడం స్కామ్‌కు నిదర్శనం కాదా?
⇒ హైకోర్టు పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగిన గ్రూప్‌ 1కి.. స్కామ్‌లు జరిగిన మెగా డీఎస్సీకి అసలు పోలిక ఉందా?

చంద్రబాబు ఆరోపణలుృవాస్తవాలు
1 డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌లో అక్రమాలు జరిగాయి.
వాస్తవం: అసలు డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌ను పూర్తిగా పక్కన పెట్టి, హైకోర్టు సూచనల మేరకు మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌లో  ప్రక్రియ పూర్తి చేసినప్పుడు, ఈ ఆరోపణకు విలువేముంది?

2 గ్రూప్‌1 ఎవాల్యుయేషన్‌ హాయ్‌ల్యాండ్‌లో ఏదో జరిగింది.
వాస్తవం: హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ప్రక్రియకు, తుది ఫలితాల వెల్లడికి ఏ సంబంధం లేదు. 
ఆ మేరకు 2025, నవంబరు 11న చంద్రబాబు ప్రభుత్వమే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అన్నీ నియమానుసారం జరిగాయని అధికారులు అందులో తేల్చి చెప్పారు. అందుకే హాయ్‌ల్యాండ్‌ అనేది టాపిక్‌ కాదు. అది అప్రస్తుతమని స్పష్టం చేశారు. మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌ కూడా ఏపీపీఎస్సీ, ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీఆర్‌ఆర్‌ కాలేజీలో జరిగాయని, ఎక్కడా అక్రమాలు లేవని, అంతా సీసీ టీవీల పర్యవేక్షణలో జరిగిందని చెప్పారు.

3 జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్‌ జరిగింది
వాస్తవం: జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్‌ జరగలేదని, సిట్‌ (చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిందే) స్పష్టమైన నివేదిక ఇచ్చినా, అబద్ధాలు ప్రచారం చేస్తూ నిందలు వేస్తున్నారు. నిజానికి మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌ ప్రక్రియ అంతా సీసీ టీవీల పర్యవేక్షణలో చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు ఏనాడైనా, అలా జవాబుపత్రాలు దిద్దించారా? ఆయన హయాంలో 2016, 2017లో పరీక్షలు నిర్వహించినప్పుడు పేపర్లు దిద్దేటప్పుడు సీసీ కెమెరాలు లేవు. మా హయాంలో ఏపీపీఎస్సీలో పనిచేసిన సవాంగ్‌లాంటి అధికారులు చాలా సమర్థులు.

వీళ్లు అల్లాటప్పా మనుషులు కాదు. ఎప్పుడూలేని విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలు, వాటిని దిద్దడంలో కానీ, ఓఎంఆర్‌ జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌)లో కానీ ఎలాంటి ట్యాంపరింగ్‌ జరగలేదని, సీఎఫ్‌ఎస్‌ఎల్‌ స్పష్టంగా ధ్రువీకరించిందని సిట్‌ నివేదిక ఇచ్చింది. అయినా తన కొడుకును కాపాడుకునేందుకు, చంద్రబాబు గ్రూప్‌ృ1 పరీక్షపై అభాండాలు వేస్తున్నారు. ఇక ఇక్కడ వివాదం ఎక్కడుంది?.

4 ఓఎంఆర్‌ షీట్ల సవరణలు గుర్తుతెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారు. వారికి ఎలాంటి అర్హత లేదు.
వాస్తవం: చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా అంతా దొంగలే. అంతా తప్పుడు ప్రచారం చేస్తూ, నిందలు వేస్తున్నారు. అసలు వారు నియమించిన సిట్, చాలా స్పష్టంగా చెప్పింది. ఎక్కడా, ఏ తప్పు జరగలేదని తేల్చి చెప్పింది. ఇంకా సీసీ టీవీ ఫుటేజ్‌ ఉంది. సీఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలు కూడా ఉన్నాయి. ఇక్కడ అందరూ గుర్తించాల్సిన ఒక అంశం ఏమిటంటే, మేము అధికారంలోకి వచ్చే నాటికే, ప్రిలిమ్స్‌ ముగిశాయి. మరి ఎవరికి ఏ ఇంట్రెస్ట్‌ ఉంటుంది. పైగా ఏపీపీఎస్సీ బోర్డులో ఎక్కువ మంది టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే.

5 పేపర్లు ఒకసారి దిద్దిన తర్వాత మళ్లీ కరెక‌్షన్స్‌ చేశారు.
వాస్తవం: అసలు ఏపీపీఎస్సీ పరీక్షల మూల్యాంకనం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. ఎక్కడా అభ్యర్థికి అన్యాయం జరగకుండా అనేక మంది బాధ్యులు ఉంటారు. ఇంకా పలు దశలు ఉంటాయి. చీఫ్‌ ఎగ్జామినర్‌ మొదలు, స్క్రూటినైజర్, సూపర్‌వైజర్లు ఉంటారు. అంత మంది చెక్‌ చేస్తారు. కంట్రోల్‌ బండిల్‌ స్లిప్‌లు ఉంటాయి. వాటిపై అందరి సంతకాలు ఉంటాయి. అదొక పక్కా విధానం. 

ఎక్కడా ఏ అభ్యర్థికి నష్టం జరగకుండా ఒక పక్కా విధానం, వ్యవస్థ ఉంటుంది. ఇంకా ఏ పేపర్‌ ఎవరిదని ఎవరికీ తెలియదు. కేవలం బార్‌కోడ్‌ మాత్రమే ఉంటుంది. దిద్దేవారికి అది ఎవరి ప్రశ్నపత్రం అనేది అస్సలు తెలియదు. ప్రతి దానికి బార్‌ కోడ్, క్యాంప్‌ ఆఫీసర్‌ సిగ్నేచర్‌ ఉంటుంది. వీటన్నింటిపై సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇదంతా ఒక ప్రొసీజర్‌. ఏదో ఆరోపణ చేయాలని, బండపడేయాలన్నట్లు బురదజల్లుతున్నారు.

6 రాతపరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చాయని ఆరోపణ.
వాస్తవం: ఇక్కడ నా సవాల్‌. చంద్రబాబుగారి హయాంలో గతంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల వివరాలు బయట పెట్టగలరా? నిజానికి ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు మా హయాంలో తెచ్చాం. అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా నిర్వహించాం. ఫేషియల్‌ రికగ్నిషన్, థంబ్‌ ఇంప్రెషన్‌ తీసుకొచ్చాం. చరిత్రలో తొలిసారిగా పరీక్ష హాల్‌లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశాం.

మా తర్వాతే యూపీఎస్సీలో కూడా అమలు చేశారు. మా ప్రభుత్వం రాకముందు, ఏపీపీఎస్సీకి సంబంధించి ఒకటే ఇంటర్వ్యూ బోర్డు. అందులో ఒకరు మాత్రమే సివిల్స్‌ సర్వీసెస్‌ అధికారి ఉండేవారు. మేము వచ్చిన తర్వాత మూడు ఇంటర్వ్యూ బోర్డులు పెట్టాం. 24 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు, వివిధ వర్సిటీలకు చెందిన ఆరుగురు వీసీలను పెట్టాం. అభ్యర్థులకు జంబ్లింగ్‌ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించాం.

అంటే ఏ అభ్యర్థి, ఏ బోర్డు ముందుకు వెళ్తారో వేరెవరికీ తెలియదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక, మళ్లీ పాత విధానం. ఒకటే బోర్డు, ఒకే ఐఏఎస్‌ అధికారి. మా హయాంలో ఒకేసారి 1.30 లక్షల సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు వచ్చిందా? అంత పారదర్శకంగా ఆ ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కటంటే ఒక్క ఆరోపణ వచ్చిందా? మా హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6296 పోస్టులు భర్తీ చేశాం. కానీ, ఎక్కడా వివాదాలు లేవు. మేము ఇచ్చిన రెండు నోటిఫికేషన్లు చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. మరో రెండు రద్దు చేశారు. ఇదీ చంద్రబాబుకు నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రేమ.

7     కొంత మంది ఎవాల్యుయేటర్లు సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. 
వాస్తవం: అసలు తాను దిద్దేది ఎవరి పేపరో ఎవాల్యుయేటర్‌కు ఎలా తెలుస్తుంది? అక్కడ అభ్యర్థి పేరు, ఇతర వివరాలు ఏవీ ఉండవు. కేవలం ఒక్క బార్‌కోడ్‌ మాత్రమే ఉంటుంది. పైగా అన్నిచోట్ల సీసీ కెమేరాలు కూడా ఉన్నాయి. వక్రీకర­ణకైనా హద్దూ, పొద్దు ఉందా?

చివరిగా చంద్రబాబుకు ఇదే నా సవాల్‌
చంద్రబాబు ఆరోపణలు చేస్తున్న గ్రూప్‌ృ1 పరీక్ష, గత ఏడాది మీరు నిర్వహించిన డీఎస్సీ. రెండింటిపై సీబీఐ విచారణ జరిపిద్దాం. ఒక్క డీఎస్సీృ2025పైనే కాదు. గ్రూప్‌ృ1. 2018పైనా సీబీఐ విచారణకు మేము రెడీ. నీవు రెడీనా? మేము తప్పు చేయలేదు. మాకు ఆ ధైర్యం ఉంది. మరి మీకు ఆ ధైర్యం ఉందా?   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement