
స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని నమ్మించి మోసం చేసిన కూటమి
ప్రభుత్వ ప్రకటనలు నమ్మి సబ్సిడీ రుణాల కోసం యువత దరఖాస్తులు
వారందరికీ ప్రభుత్వం మొండిచేయి
ఇప్పటికే రూ. 4 వేల కోట్లకు పైగా రుణాలివ్వాల్సిన సంక్షేమ శాఖలు
సాక్షి, అమరావతి : బడుగు, బలహీన వర్గాల యువతను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్), ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల స్వయం ఉపాధికి, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలిస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు, టీడీపీ నేతలు.. అధికారంలోకొచ్చాక మొండిచేయి చూపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను అన్ని సంక్షేమ శాఖలు కలిపి కనీసం రూ.4 వేల కోట్ల రుణాలివ్వాల్సి ఉంది.
ఇందులో 50 శాతం ప్రభుత్వ సబ్సిడీగా ఇవ్వాలి. స్వయం ఉపాధి కోసం చిన్నపాటి పరిశ్రమలు, వ్యాపారాలు, వ్యవసాయ అనుబంధ సంస్థలు తదితర వాటికి యూనిట్‌కు రూ.50 వేల నుంచి రూ.8 లక్షల వరకు సబ్సిడీపై రుణాలిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా తెగ ప్రచారం చేశారు. ఆ తర్వాత బీసీ, అగ్రవర్ణ పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రుణాలిస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ప్రకటనలు గుప్పించారు.
అర్హులైన వారంతా ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్, మానిటరింగ్ సిస్టమ్ (ఏపీఓబీఎంఎంఎస్) వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తేదీలనూ ప్రకటించారు. కూటమి నేతల మాటలు నమ్మిన యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంది. కూటమి ఇచ్చిన హామీ ప్రకారం 2024, 2025 రెండేళ్లకు ఇప్పటికే రెండు పర్యాయాలు రుణాలివ్వాల్సి ఉంది. అయినా ఇప్పటి వరకు ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
బీసీ సంక్షేమ శాఖ మొండిచేయి
బీసీలతో పాటు ఈడబ్ల్యూఎస్ (కాపు, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన)కు రూ.వెయ్యి కోట్ల సబ్సిడీ రుణాలు ఇస్తామని ఆర్భాటపు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం.. చివరకు మొండి చేయి చూపింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు నెలల్లో 1.30 లక్షల మందికి సబ్సిడీ రుణాలిస్తున్నట్టు మంత్రి సవిత ప్రకటించారు.
లబ్ధిదారుల వాటా, జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివద్ధి సంస్థ, బ్యాంకు రుణాలు కలిపి మొత్తం రూ.1,969.58 కోట్లు అవుతుందని, అందులో రూ.1,038.81 కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఒక్కో యూనిట్‌కు పదికి పైగా దరఖాస్తులొచ్చాయి. చివరకు ముఖ్య నేత ఆదేశాలతో ఎవరికీ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది.
వింత మెలికతో ఎస్సీలకు ఎగనామం
ఎస్సీల రుణాల విషయంలో ప్రభుత్వం వింత మెలిక పెట్టి మొత్తం పథకానికే ఎసరు పెట్టింది. పెద్ద సంఖ్యలో రుణాలు ఇస్తామంటూ దరఖాస్తులకు రెండు పర్యాయాలు గడువు పెంచిన ఎస్సీ కార్పొరేషన్.. ముగింపు గడువు ఎప్పుడో, రుణాలు ఎప్పుడిస్తారో అన్న విషయాలపై స్పష్టత ఇవ్వలేదు. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్న ఆకాంక్షతో ఎస్సీ యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసింది.
సుమారు రూ.410 కోట్ల సబ్సిడీ అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. రుణం మంజూరైన రెండేళ్లకు దానిని లబ్ధిదారులకు అందిస్తామంటూ మెలిక పెట్టడంతో అందరూ విస్తుపోతున్నారు. లబ్ధిదారుడి వాటా, ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణం మొత్తం కలిపితేనే ఎస్సీ యువత యూనిట్ పెట్టుకుని స్వయం ఉపాధి పొందగలదు. అయితే రుణాలు ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మెలిక పెట్టిందని ఎస్సీ వర్గాలు మండిపడుతున్నాయి.
మైనార్టీలకూ ఇదే మోసం
మైనార్టీ యువతకు అందించే రుణాలకూ ప్రభుత్వం ఇదే విధమైన మెలిక పెట్టింది. రాష్ట్రంలో 49,218 మందికి రూ.326 కోట్ల సబ్సిడీ రుణాలిస్తామంటూ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ గొప్పగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ద్వారా అందించే రుణాలకు ముందుగా బ్యాంకు రుణం పొందిన లబ్ధిదారులకు.. రెండేళ్ల తర్వాత పరిశీలించి సబ్సిడీ అందిస్తామని మెలిక పెట్టడంతో ముస్లిం మైనార్టీ వర్గాలు కంగుతిన్నాయి. రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు నాలుగు శ్లాబ్‌లలో సబ్సిడీ రుణాలు ఇస్తామనే ఆర్బాటం మినహా ఇప్పటి వరకు ఒక్క రుణమూ మంజూరు చేయలేదు.
అడవి బిడ్డల పట్లా అలక్ష్యం
బీసీలను మోసం చేసిన కూటమిబీసీలకు స్వయం ఉపాధి రుణాలు ఇస్తామని నమ్మించిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత గొంతు కోశారు. కూటమి నేతల మాటలు నమ్మిన చేతి వృత్తిదార్లు, పేద, మధ్య తరగతి ప్రజలు, ప్రధానంగా నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. వారందరినీ ప్రభుత్వం మోసం చేసింది. – చింతపల్లి గురుప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ కులాల ఐక్య వేదిక
కార్పొరేషన్‌ల నిధుల మళ్లింపు దారుణం
కూటమి ప్రభుత్వం సబ్సిడీ రుణాలివ్వకుండా.. ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోంది. స్వయం ఉపాధి మార్గం ఎంచుకున్న యువత లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. – ఆండ్ర మాల్యాద్రి, రాష్ట్ర కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం
జీవోలు అమలు చేయడం చేతకాలేదా?
ముస్లిం మైనార్టీల స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలిస్తామని జీవో ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి దాన్ని అమలు చేయడం చేతకాలేదా? ముస్లిం మైనార్టీలను కూటమి ప్రభుత్వం మరోమారు మోసం చేసింది. 2018–19 మధ్య కూడా టీడీపీ ప్రభుత్వం ఇదే తరహాలో ముస్లిం మైనార్టీ యువత నుంచి దరఖాస్తులు తీసుకుని.. చివరకు నిధులు విడుదల చేయకుండా మొండిచేయి చూపింది. – షేక్ నాగుల్ మీరా, రాష్ట్ర అధ్యక్షుడు, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి
అడవి బిడ్డల పట్లా అలక్ష్యం
గిరిజనులకు సబ్సిడీ రుణాల విషయంలో ప్రభుత్వం పూర్తి అలక్ష్యం ప్రదర్శిస్తోంది. గిరిజనుల స్వయం ఉపా«ధి కోసం గిరిజన ఆర్థిక సహకార సంస్థకు రూ.110 కోట్లు కేటాయించినట్టు లెక్కల్లో చూపినప్పటికీ.. ఇంతవరకు సబ్సిడీ రుణాలకు ఒక్క పైసా విదల్చలేదు. వారి స్వయం ఉపాధి కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న ఆలోచన చేయలేదు. ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా వంచిస్తోంది.