దైవదర్శనానికి వెళ్తూ మృత్యు ఒడిలోకి..
ఆర్టీసీ బస్సు ఢీకుని మహిళ మృతి
భర్తకు స్వల్పగాయాలు
అయ్యా.. బస్సు ఢీకొంది.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి... కాపాడండయ్యా.. కాసిన్ని నీళ్లు తేండయ్యా.. శ్రీలత లే... ఒక్కసారి కళ్లు తెరచి చూడు.. అంటూ భార్యను ఒడిలో ఉంచి భర్త చేసిన ఆర్తనాదాలు అక్కడివారిని కన్నీరుపెట్టించాయి. కళ్లముందే భార్య చనిపోవడంతో భర్త చేసిన రోదనతో ఆ ప్రాంతమంతా విషాదం అలముకుంది.
విజయనగరం జిల్లా: గరివిడి మండలం గదబవలస పంచాయ తీ పరిధిలోని ఐతాంవలస సమీపంలోని రోడ్డు మలుపు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరగంజి శ్రీలత(46) అనే మహిళ దుర్మరణం చెందగా, భర్త సంగంనాయుడికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు... తెర్లాం మండలం పెరుమాళి గ్రామానికి చెందిన సంగంనాయుడు, శ్రీలత దంపతులు చీపురుపల్లి మండలంలో ఉన్న మానసాదేవి నాగశక్తి అమ్మవారిని దర్శించుకునేందుకు స్కూటీపై బయలు దేరారు. పెరుమాళి నుంచి చీపురుపల్లి వైపు వెళ్తుండగా ఐతాంవలస గ్రామానికి సమీపంలో ఉన్న మలుపు వద్దకు వచ్చేసరికి.. చీపురుపల్లి వైపు నుంచి ఎదురుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీ వెనుకవైపున కూర్చున్న శ్రీలత వెనుకకు పడిపోగా బస్సు టైరు ఆమె తలమీదుగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు విడవగా భర్తకు స్వల్పగాయాలయ్యాయి.
ఆనందంగా ఉన్నామన్న సమయంలో...
వీరిది మధ్యతరగతి కుటుండం. సంగంనాయు డు రాజాం జ్యూట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు ఆడపల్లలు. పెద్దమ్మాయి శ్రావణి శ్రీకాకుళం జిల్లాలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, చిన్నమ్మాయి సంధ్య నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. కష్టపడి చదివించి న ఇద్దరు పిల్లలు ప్రయోజకులయ్యారు.. ఆనందంగా ఉందామన్న సమయంలో విధి కన్నెర్రచేసింది. భర్తకు, పిల్లలకు పెద్దదిక్కును బస్సు ప్రమాదం రూపంలో మృత్యుఒడిలోకి చేర్చింది. శ్రీలత మరణంతో గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.


