పశ్చిమగోదావరి జిల్లా: ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అతివేగంతో రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో పోలమూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ (28), అంజిబాబు (25), రాజు (19) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానికుల కథనం ప్రకారం, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం అర్ధరాత్రి 12.30 సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పెనుమంట్ర పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతుండగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


