విజయవాడలో మహిళ దారుణ హత్య
అడ్డుకోబోయిన కూతురుపైనా హత్యాయత్నం
గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి
అజిత్‌సింగ్ నగర్ (విజయవాడ సెంట్రల్): భర్తతో విభేదాల కారణంగా విడిపోయి... వేరొకరితో సహజీవనం చేస్తున్న ఆమె అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. విజయవాడ అజిత్‌సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం కేదారేశ్వరపేట 8వ లైన్‌కు చెందిన మహ్మద్ ఉసీనా (36) భర్తకు దూరంగా ఉంటూ కొడుకు, కూతురుతో కలిసి వేరుగా జీవిస్తోంది.
మంగళగిరి సమీపంలోని నులకపేట ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ కొల్లిపర సాయి శివకుమార్(40)తో సహజీవనం చేస్తోంది. ఈమె కుమార్తె ఎండీ సోని (19)కి కొంతకాలం క్రితం వివాహం కాగా ఆమె భర్తతో గొడవలు పడి పుట్టింటికి వచ్చేసింది. సోని రెండో వివాహం విషయమై శివకుమార్, ఉసీనాకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఉసీనా గది నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. సోని వెళ్లి చూడగా ఉసీనాపై శివకుమార్ విచక్షణారహితంగా దాడి చేస్తూ, గొంతు నులుముతూ కనిపించాడు. సోని భయంతో కేకలు వేయగా రోకలిబండతో ఆమె తల పగుల కొట్టేందుకు ప్రయత్నించాడు.
రక్తంతోనే ఆమె బయటకు పరుగులు తీసింది. వారి కేకలు విన్న స్థానికులు వచ్చి చూసేలోపు శివకుమార్ ఆటోతో పరారయ్యాడు. గది లోపలకు వెళ్లి చూడగా ఉసీనా మృతి చెంది కనిపించింది. సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని సోనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉసీనా కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.


