డిజిటల్‌ స్కిల్‌ పై వాట్సాప్‌ ఇండియా శిక్షణ

WhatsApp India Training on Digital Skill in Andhra Pradesh - Sakshi

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఆన్‌లైన్‌లో శిక్షణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు డిజిటల్‌ టెక్నాలజీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్‌ ఇండియా ముందుకువచ్చింది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా డిజిటల్‌ స్కిల్‌ అకాడమీ శిక్షణ కార్యక్రమాన్ని వాట్సాప్‌ ఇండియా చేపట్టింది. కొత్తగా అందుబాటులోకి వస్తోన్న డేటా గోప్యత, సైబర్‌ భద్రత, ఆర్థిక అక్షరాస్యత వంటి వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఇన్ఫీ పార్క్‌కు వాట్సాప్‌ ఇండియా అప్పగించింది. బుధవారం వర్చువల్‌గా ఈ డిజిటల్‌ అకాడమీ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణ) చల్లా మధుసూదన్‌ రెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ కొండూరు అజయ్‌ రెడ్డి ప్రారంభించారు.

చల్లా మధుసూధన రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ కోర్సులో చేరడానికి 15,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వీరికి 10వ తేదీ నుంచి పది రోజులు పాటు శిక్షణ ఇచ్చి ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా వాట్సాప్‌ స్కిల్స్‌ స్టార్‌ కార్యక్రమానికి విద్యార్థులను ఎంపిక చేస్తారని చెప్పారు. ఇలా ఎంపికైన విద్యార్థులకు ఏడాది పాటు వివిధ డిజిటల్‌ టెక్నాలజీ అంశాలపై శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్‌ ఇస్తారన్నారు. వీరు శిక్షణ తీసుకున్న రంగాల్లో ఉద్యోగం పొందడానికి వాట్సాప్‌ ఇండియా సహకారం అందిస్తుందని వెల్లడించారు. సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అనేక వినూత్నమైన శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. వాట్సాప్‌ ఇండియా, నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొండూరు అజయ్‌ రెడ్డి కోరారు.

మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం...
విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చి వారికి నైపుణ్యం కలిగించే విధంగా పలు అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కింద 40 సాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ కోర్సులలో 1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.30.79 కోట్లు వ్యయం చేస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top