
చంద్రప్రభ వాహనసేవలో ఉభయదారులుగా కొందరిని చేర్చాలని పట్టు
సంప్రదాయం మేరకు అలా కుదరదంటున్న ఉభయదారులు
ఎమ్మెల్యే వైఖరి మార్చుకోకపోతే ధర్నా చేస్తామంటూ హెచ్చరిక
సాక్షి, అమరావతి/చిత్తూరు రూరల్: శాస్త్రాలు, సంప్రదాయాలు తరువాత.. ముందు నా మాట నెగ్గాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్. కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాల్లో చంద్రప్రభ వాహనసేవకు కొందరిని ఉభయదారులుగా చేర్చాల్సిందేనని మంకుపట్టు పడుతున్నారాయన. అయితే.. ఇలా చేర్చడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయానికి విరుద్ధమని ఉభయదారులు చెబుతున్నారు. దీనికి తాము అంగీకరించబోమని మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ స్పష్టం చేశారు.
పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకంలోని స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలను ఏటా వినాయకచవితి పండుగ రోజు నుంచి 21 రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో స్వామిని రోజుకొక వాహనంపై ఊరేగిస్తారు. ఒక్కోసేవకు తరతరాలుగా కొన్ని గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలవారే ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి సెపె్టంబర్ 16 వరకు నిర్వహించనున్నారు. అయితే.. చంద్రప్రభ వాహనసేవలో మూడు గ్రామాలకు చెందిన కొందరిని ఉభయదారులుగా చేర్చాలని ఎమ్మెల్యే పట్టుబడున్నారు.
చంద్రప్రభ వాహనసేవకు కాణిపాకం, చిన్నకాంపల్లి, వడ్రంపల్లి, కారకంపల్లి, ఉత్తర బ్రాహ్మణపల్లి, పుణ్యసముద్రం, సంతపల్లి, మారేడుపల్లి, అగరంపల్లి, 45.కొత్తపల్లి, చిగరపల్లి, తిరువణంపల్లి, బొమ్మసముద్రం గ్రామాల వారు మాత్రమే తరతరాలుగా ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పట్నం, పైపల్లి, సిద్ధంపల్లి గ్రామాలకు చెందిన కొందరిని ఉభయదారులుగా చేర్చాలని ఎమ్మెల్యే పట్టుపడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా చెప్పినా కూడా వారిని ఉభయదారులుగా చేర్చుకోకపోవడం ఏంటని పలువురిని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి.
ఉభయదారుల వ్యవహారాల్లో జోక్యం కుదరదు
కొత్తవారిని చేర్చాలన్న ఎమ్మెల్యే మురళీమోహన్ సూచనకు తాము అంగీకరించకపోవడంతో ఆయన కక్షసాధింపు చర్యలకు దిగారని చంద్రప్రభ వాహనసేవ ఉభయదారుల్లో కొందరు బుధవారం చిత్తూరులో మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగమశా్రస్తాలు, తరతరాల సంప్రదాయాలతో ముడిపడి ఉన్న బ్రహ్మోత్సవాల్లో ఇప్పుడు కొత్తగా ఉభయదారులుగా చేర్చుకోవడం కుదరదని స్పష్టం చేశారు.
‘అసలు ఉభయదారుల వ్యవహారాల్లో వేలు పెట్టడానికి నువ్వెవరు? ఎమ్మెల్యే అయినంత మాత్రాన నువ్వు చెప్పినవాళ్లందరినీ ఉభయదారులుగా చేర్చుకోవాలా? అలా సాధ్యం కాదని చెప్పినందుకు మాలో ఒకరిని ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండీతిప్పలు లేకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టించారు. దారిన పోయేవాళ్లందరినీ ఆలయ ఉభయదారులుగా అంగీకరించే ప్రసక్తేలేదు. మరోమారు ఎమ్మెల్యే మురళీమోహన్ ఈ వ్యవహారంలో తలదూరిస్తే ఆలయం ఎదుటే ధర్నా చేస్తాం..’ అని చెప్పారు.