విశాఖ ఉక్కు విషాదం.. తప్పు ఎవరిది? | Visakha Steel Tragedy: Is the Government Blameless | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కు విషాదం.. తప్పు ఎవరిది?

Jun 9 2026 8:18 AM | Updated on Jun 9 2026 10:52 AM

Visakha Steel Tragedy: Is the Government Blameless

విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన తాజా విషాదంపై మరోసారి హై లెవల్‌ కమిటీని ప్రభుత్వం నియమించింది. అయితే ప్రతి ప్రమాదం తర్వాత విచారణలు, కమిటీలు, నివేదికలతో హడావిడి చేయడం.. కొంతకాలానికి అంతా మరచిపోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరుసగా ప్రమాదాలు పునరావృతమవుతుంటే అసలు బాధ్యులెవరు? తప్పంతా యాజమాన్యానిదేనా? లేక పర్యవేక్షణ బాధ్యత ఉన్న ప్రభుత్వాలకు అసలేం సంబంధం లేదా?? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.

విశాఖ ఉక్కు కర్మాగారంలో.. ద్రవ ఉక్కు ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ఘటనతో మరోసారి ఒక కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. ప్రతి ప్రమాదం తర్వాత యాజమాన్యాన్ని తప్పుబట్టడం, విచారణ కమిటీలు వేయడం, పరిహారాలు ప్రకటించడం జరుగుతోంది. కానీ వరుసగా ప్రమాదాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి? అసలు బాధ్యత ఎవరిపై ఉంది?..

విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఉత్పత్తి, నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు, యంత్రాల సంరక్షణ, సిబ్బంది నియామకాల బాధ్యత ప్రధానంగా యాజమాన్యానిదే. ఇది కాదనలేని విషయం. కానీ, కార్మిక సంఘాలు చాలా కాలంగా ఒకే విషయాన్ని చెబుతున్నాయి. అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని, వారి స్థానంలో కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడటం పెరిగిందని. దీంతో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభావం పడుతోందని హెచ్చరిస్తున్నాయి.

ఒకప్పుడు 18 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు ఉన్న ప్లాంట్‌లో ఇప్పుడు వారి సంఖ్య సగానికి పడిపోయింది. ఉత్పత్తి లక్ష్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగిందని, నిర్వహణ వ్యవస్థపై ఒత్తిడి అధికమైందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరిశ్రమల్లో భద్రత అనేది కేవలం యంత్రాల మీద ఆధారపడదు. అనుభవం ఉన్న సిబ్బంది, నిరంతర పర్యవేక్షణ, శిక్షణ, క్రమబద్ధమైన నిర్వహణ కూడా అంతే కీలకం. అయితే ఇక్కడితో కథ ముగియదు. 

తాజా ప్రమాదం తర్వాత.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొత్తం బాధ్యతను యాజమాన్యంపైనే నెట్టేసి పక్కకు తప్పుకోవాలని చూస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడం వాస్తవమే. కానీ రాష్ట్రంలో పనిచేస్తున్న అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన విశాఖ ఉక్కులో పదేపదే ప్రమాదాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత నుంచి తప్పించుకోగలదా? అనే ప్రశ్న కార్మిక వర్గాలు, పరిశ్రమల నిపుణుల నుంచి వస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా కూటమి నాయకులు పవన్‌ కల్యాణ్‌ లాంటి వాళ్లు విశాఖ ఉక్కు పరిరక్షణపై పలుమార్లు మాట్లాడారు. కానీ ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు, సిబ్బంది కొరత, యంత్రాల నిర్వహణ, ప్రమాదాల నివారణ చర్యలపై అదే స్థాయిలో పర్యవేక్షణ జరిగిందా? ఫ్యాక్టరీల శాఖ, కార్మిక శాఖ నిర్వహించిన తనిఖీల్లో ఏమి బయటపడింది? గత ప్రమాదాల తర్వాత ఇచ్చిన సూచనల అమలు ఎక్కడిదాకా వచ్చింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని విమర్శకులు అంటున్నారు.

ప్రమాదం జరిగిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ సంస్థ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కకు తప్పుకోవచ్చా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఫ్యాక్టరీల భద్రతను పర్యవేక్షించే ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టరేట్‌, కార్మిక శాఖ, జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తాయి. ప్రమాదాలకు దారితీసే లోపాలను గుర్తించడం, భద్రతా తనిఖీలు నిర్వహించడం, హెచ్చరికలు జారీ చేయడం వంటి బాధ్యతలు కూడా వాటిపైనే ఉంటాయి.

ముఖ్యంగా గత పదిహేనేళ్లలో స్టీల్‌ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2012లో జరిగిన ఘోర పేలుడులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా పలు ఘటనలు నమోదయ్యాయి. ఇన్ని ప్రమాదాలు జరిగినా భద్రతా వ్యవస్థలపై స్వతంత్ర సమీక్షలు జరిగాయా? గత విచారణల సిఫారసులు అమలయ్యాయా? వాటిని ఎవరు పర్యవేక్షించారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు కనిపించడం లేదు.

ఇక మరో కోణం ప్రైవేటీకరణ వివాదం. విశాఖ ఉక్కును కాపాడతామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి. కానీ వాస్తవంగా ప్లాంట్‌ భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితి, సిబ్బంది బలోపేతం, ఆధునీకరణ వంటి అంశాల్లో ఎంత మేర పురోగతి సాధించారన్న ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఉక్కు కర్మాగారం గురించి రాజకీయంగా పెద్ద ప్రకటనలు చేసినవారు, కార్మిక భద్రతపై అదే స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారా? అనే ప్రశ్న కూడా కార్మిక వర్గాల నుంచి వినిపిస్తోంది.

అందుకే ఈ ప్రమాదాన్ని కేవలం ఒక సాంకేతిక లోపంగా చూడటం సరిపోదని పరిశ్రమల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది యాజమాన్య నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, సిబ్బంది విధానాలు, ప్రభుత్వాల నిరంతర పర్యవేక్షణ వైఫల్యం వంటి అనేక అంశాల కలయికగా చూడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఈ విషాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవడం అవసరమే. కానీ అంతకంటే ముఖ్యమైనది గత ప్రమాదాల మాదిరిగానే ఈ ఘటన కూడా మరో ఫైల్‌గా మిగిలిపోకుండా చూడటం. స్వతంత్ర విచారణ, భద్రతా ప్రమాణాల సమగ్ర ఆడిట్‌, సిబ్బంది కొరతపై సమీక్ష, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలపై స్పష్టమైన జవాబుదారీతనం తీసుకొస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి కొన్నేళ్లకోసారి ప్రాణాలు కోల్పోయేది కార్మికులే.. సంతాప ప్రకటనలు విడుదల చేసేది వ్యవస్థే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement