ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో తొలి మూడు రోజులకు వీఐపీ టికెట్లను ఆలయ ఈవో శీనానాయక్ శుక్రవారం విడుదల చేశారు. రూ.వెయ్యిపై వీఐపీలకు బంగారు వాకిలి దర్శనం కల్పించనున్నారు. మహామండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్‌లో ఈవో శీనానాయక్, ఈఈ ఎల్.రమా, ఆలయ టెక్నికల్ సిబ్బంది హరీష్ ఈ టికెట్లను విడుదల చేశారు. దసరా ఉత్సవాల్లో ఎటువంటి సిఫార్సులు లేకుండా భక్తులు జగన్మాత దివ్య దర్శనానికి సంబంధించి 11, 12, 13వ తేదీలకు రూ.1,000 టికెట్లను జారీ చేశామని, ఈ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు వీఐపీ క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చునన్నారు.
మన మిత్ర యాప్ ద్వారా భక్తులు ఈ టికెట్లను పొందవచ్చునని తెలిపారు. మూలా నక్షత్రం మినహా అన్ని రోజులకు విడతల వారీగా టికెట్లు విడుదల చేస్తామన్నారు. టికెట్లు పొందిన భక్తులు కుమ్మరి పాలెంలోని టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా కొండపైకి చేరుకుంటారని, దర్శనం అనంతరం మల్లికార్జున స్వామి వారి ఆలయం మీదగా కొండ దిగువనకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, ఆలయ సిబ్బందికి ప్రత్యేక డ్యూటీ పాస్‌లను జారీ చేశారు.


