శభాష్‌ వలంటీర్.. ప్రాణాలకు తెగించి మరీ 

Village Volunteer Recued A Family From Fire Accident - Sakshi

అగ్ని కీలల నుంచి వృద్ధులు, చిన్నారులు సహా ఆరుగుర్ని కాపాడిన గ్రామ వలంటీర్‌

తన ఒళ్లు కాలుతున్నా ప్రాణాలకు తెగించి సాహసం

నరసరావుపేట: అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు ఓ గ్రామ వలంటీర్‌. ఆ మంటలకు తన ఒళ్లు కాలుతున్నా లెక్క చేయకుండా దగ్ధమవుతున్న గుడిసెలోంచి గ్యాస్‌ సిలిండర్‌ను బయటకు తెచ్చి భారీ ప్రమాదాన్ని, ప్రాణ నష్టాన్ని నివారించి శభాష్‌ అనిపించుకున్నాడు. గుంటూరు జిల్లా రొంపిచర్లలో ఈ ఘటన జరిగింది. రొంపిచర్లలో పేదలు నివసించే ప్రాంతంలో మొత్తం 12 వరకు పూరి గుడిసెలు ఉన్నాయి. అందులో 4 గుడిసెలు ఒకదానికొకటి ఆనుకుని ఉండగా.. మరో 8 గుడిసెలు కొద్ది దూరంలోనే ఉన్నాయి. శనివారం ఉదయం ఓ విద్యుత్‌ స్తంభం నుంచి తీగ తెగి పూరి గుడిసెపై పడింది. గుడిసెకు మంటలు అంటుకుని పక్కనే ఉన్న మరో రెండు పూరి గుడిసెలకు వ్యాపించాయి.

ఆ సమయంలో రెండు గుడిసెల్లో ఉన్న ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారులను వలంటీర్‌ బొజ్జా శివకృష్ణ బయటికి తీసుకొచ్చి వారి ప్రాణాలు కాపాడాడు. తగలబడుతున్న మరో గుడిసెకు తాళం వేసి ఉండగా.. క్షణాల్లో దానిని తొలగించి అందులోని గ్యాస్‌ సిలిండర్‌ను బయటకు తీసుకొచ్చాడు. వలంటీర్‌ ఆ సాహసం చేసి ఉండకపోతే గ్యాస్‌ సిలిండర్‌ పేలి పక్కనే ఉన్న ఏడెనిమిది గుడిసెలకు మంటలు వ్యాపించి ప్రాణనష్టం జరిగి ఉండేది. ఈ ఘటనలో శివకృష్ణ ఒంటికి మంటలు అంటుకోవడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధితులను పరామర్శించి సహాయం అందించారు. వైద్యశాలకు వెళ్లి వలంటీర్‌ శివకృష్ణను అభినందించారు. అతడి వైద్యానికయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుందనే దానికి ఇదే నిదర్శనమని, శివకృష్ణ లాంటి ఎందరో ఆ వ్యవస్థలో భాగస్వాములై ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.

కర్తవ్యం గుర్తొచ్చింది: వలంటీర్‌ శివకృష్ణ 
‘మా ఇంటికి సమీపంలోనే ఉన్నట్టుండి హాహాకారాలు వినిపించాయి. బయటకు వచ్చి చూస్తే ఎదురుగా మంటలు కనిపించాయి. కాలుతున్న ఓ గుడిసెలో వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్నారు. వారిని రక్షించి, వెంటనే తగులబడుతున్న గుడిసెకు వేసి ఉన్న తాళాన్ని తొలగించి సిలిండర్‌ను బయటకు తెచ్చాను. శరీరం, చేతులు, వేళ్లకు మంటలు అంటుకున్నాయి. బయటకు రాగానే స్పృహతప్పి పడిపోయాను. చుట్టుపక్కల వారు నన్ను వెంటనే కారులో నరసరావుపేట ఆస్పత్రికి తీసుకొచ్చారు.’ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top