67కు పెరిగిన విషాహార బాధితులు 

Victims of poisoning increased to 67 Madanapalle - Sakshi

బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ  

గ్రామంలో వైద్య శిబిరం  

నిమ్మనపల్లె(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం బండ్లపై గ్రామంలో శుక్రవారం రాత్రి విషాహారం తిని అనారోగ్యం బారినపడ్డ వారి సంఖ్య 67కి చేరుకుంది. ప్రతి మూడేళ్లకోసారి బండ్లపై హరిజనవాడ, దుర్గంవారిపల్లె, బండ్లపై కాలనీ, పారాశివారిపల్లె గ్రామస్తులు ఏకమై గంగజాతర నిర్వహిస్తారు. అందులో భాగంగా బండ్లపై గ్రామ ప్రజలు గురువారం రాత్రి అమ్మవారిని ఊరేగించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తులు, స్థానికులు సామూహిక భోజనాలు చేశారు. అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత భోజనం చేసినవారు రాత్రి 10 గంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు లోనయ్యారు.

వెంటనే వారిని 108లో నిమ్మనపల్లె, మదనపల్లె ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ఈ సందర్భంగా శనివారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాధితులను మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషా, సింగిల్‌ విండో అధ్యక్షుడు రెడ్డిశేఖర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. అంతమంది ఆస్పత్రిలో చేరినా శుక్రవారం రాత్రి విధులకు హాజరుకాకపోవడంతో మెడికల్‌ ఆఫీసర్‌ జులేఖబేగంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా విష ఆహారం ఘటనపై మదనపల్లె డివిజన్‌ ఆహార కల్తీ నియంత్రణాధికారి రాముడు విచారణ చేపట్టారు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ సేకరించారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం వల్లే అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top