నెల్లూరు జిల్లా ఉదయగిరి వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు
ఉదయగిరి/తవణంపల్లె: చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తొలగేటట్లు లేవు. అదునుకు ఎరువులు అందక రాష్ట్రంలోని రైతన్నలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం తిరుమాపురం పంచాయతీ గుడినరవ తదితర గ్రామాల రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నామంటూ శనివారం వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వారం రోజులుగా యూరియా కోసం తిప్పలు పడుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయగిరిలోని కొట్టాయపల్లి సొసైటీ కార్యాలయం ఎదుట బైఠాయించి, ఆందోళన చేశారు. అలాగే, చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో శనివారం యూరియా కోసం రైతులు వేకువజాము నుంచే నిరీక్షించారు. మండలంలోని పుణ్యసముద్రంలో శనివారం యూరియా కోసం క్యూలో పడిగాపులు కాశారు. చివరికి అధికారులు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులను తీసుకొని రైతుల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సోమవారం పంపిణీ చేస్తామని చెప్పడంతో.. మళ్లీ సోమవారం క్యూ కట్టాల్సిందేనా అంటూ రైతులు నిరాశతో వెనుదిరిగారు.


