
సాక్షి, విశాఖపట్నం: అరకు కాఫీ ఘుమఘుమలు మరోసారి అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కింది. ఐక్యరాజ్యసమితిలో ప్రశంసలు అందుకుంది. ఏపీలోనీ అరకు లోయలో మహిళలు పండిస్తున్న కాఫీలో చక్కటి పరిమళం ఉందని ఐరాస ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. కాఫీ సాగు ద్వారా ఆర్థిక సామాజిక విప్లవాన్ని తీసుకురావడంలో అరకు మహిళల కీలక పాత్ర ఉందని, అరకు మహిళలు భారత నారీశక్తికి చిహ్నాలని ఐకాస ప్రతినిధులు అన్నారు.
‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ఐరాసలో భారత శాశ్వత మిషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మహిళల సారథ్యంలో ప్రగతి సాధనపై భారత నిబద్ధత ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని ఐరాస జనరల్ అసెంబ్లీ 78వ సభ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ అన్నారు. ఈ ఏడాది జనవరిలో తాను భారత్‌లో పర్యటించినపుడు అక్కడి ‘నారీశక్తి’ పరివర్తన ఫలాలను ప్రత్యక్షంగా చూసినట్లు వివరించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను భారత మహిళలకు అనుసంధానం చేసిన విధానం గొప్పగా ఉందని ఐరాస డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మొహమ్మద్ అన్నారు.