
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గండికోటలో బాలిక హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ప్రియుడు లోకేష్.. బాలికను హత్య చేయలేదని కర్నూలు రేంజ్ డీఐజీ తేల్చి చెప్పారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. మరో వైపు బాలిక సోదరుడే హత్య చేశాడంటూ చేస్తున్న ప్రచారం దారుణమని తల్లిదండ్రులు అన్నారు. ఎవరైనా చెల్లిని వివస్త్రను చేసి హత్య చేస్తాడా అంటూ ప్రశ్నించారు. బాలిక సోదరుడు సురేంద్ర పరువు కోసం హత్య చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సురేంద్ర పాత్రను తల్లిదండ్రులు కొట్టి పారేస్తున్నారు.
లోకేష్‌ని ఎన్‌కౌంటర్ చేయాలి: వైష్ణవి తల్లి
తన బిడ్డను హత్య చేసిన వారిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ వైష్ణవి తల్లి పసుపులేటి దస్తగిరమ్మ అన్నారు. నా బిడ్డను కోల్పోయిన బాధలో నేనున్నా.. కొన్ని మీడియా ఛానళ్లు మా పై పనిగట్టుకొని వార్తలు రాస్తున్నాయి. మేమి చెప్పినవి వేయడం లేదు. ఇష్టం వచ్చినట్లు మాపై నిందలు వేస్తున్నారు. పాప కనిపించడం లేదని తెలిస్తే వెతుకులాడటం మేము చేసిన తప్పా.
సొంత చెల్లెలిని అన్న చంపుతాడా?
సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? మరీ ఇంత క్రూరంగా వివస్త్రను చేసి చంపుకుంటామా...? అత్యాచారం జరగలేదంటే పాప ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయి.?పోలీసులు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలి. నిజానిజాలు తెలియపరచాలి. మాకు న్యాయం జరగాలి. అనుమానితున్ని తెలియపరిచాం. లోకేషే నా బిడ్డను చంపాడు. మాకు న్యాయం జరగాలంటే లోకేష్‌ని ఎన్‌కౌంటర్ చేయాలి. నాకు జరిగిన అన్యాయం ఇంకో తల్లికి జరగకూడదు’’ అంటూ వైష్ణవి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూల్ రేంజీ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న గండికోటలో విద్యార్థి వైష్ణవి హత్య కేసులో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని.. బాలికపై ఎటువంటి హత్యాచారం జరగలేదన్నారు. మాకు ఇవాళ కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభించాయి. రాత్రి 9.00 గంటలకు జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీ పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తారు’’ అని ఆయన తెలిపారు.