తిరుపతి పద్మావతిలో మరో గుండె మార్పిడి

Tirupati: Successful Heart Transplantation in Sri Padmavathi  Heart Centre - Sakshi

39 ఏళ్ల యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండె

ఆరు గంటల పాటు చికిత్స

ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ

తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/పెనమలూరు:  తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌ వైద్యులు మరోసారి గుండె మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 39 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలో వైద్యులు అతడి ప్రాణాలను కాపాడారు.

39 ఏళ్ల యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండె
ఏలూరు జిల్లా, దొండపూడికి చెందిన మత్తి సురేష్‌బాబు (49) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విజయవాడలోని క్యాపిటల్‌ ఆసుపత్రిలో చేర్చారు. బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈక్రమంలో ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన 39 ఏళ్ల యువకుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.

ఇందుకోసం అవయవదాన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీ పద్మావతి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌ డైరెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి సీఎంఓకు సమాచారం అందించారు. అన్ని అనుమతులు రావడంతో యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండెను అమర్చారు. డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డితోపాటు డాక్టర్‌ గణపతిలతో కూడిన ఏడుగురు వైద్యులు, టెక్నీషియన్ల బృందం ఆదివారం దాదాపు 6 గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స విజయవంతం చేశారు.

మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్‌ జగన్‌
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండె తరలింపునకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. చికిత్సకు అవసరమైన రూ.12 లక్షల నిధులను సీఎం రిలీఫ్‌ ఫండ్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా వెంటనే మంజూరు చేశారు. గుండె తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంఓను ఆదేశించారు. విజయవాడ నుంచి తిరుపతి చేరుకున్న అనంతరం విమానాశ్రయం నుంచి గుండె తరలింపునకు అధికారులు  గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేశారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేవలం 23 నిమిషాల్లో పద్మావతి కార్డియాక్‌ ఆసుపత్రికి గుండెను తరలించారు. దారిపొడవునా పోలీసులు ప్రొటోకాల్‌ పాటించి, కట్టుదిట్టమైన భద్రత ఇచ్చారు. 

నలుగురికి పునర్జన్మ
ఏలూరు జిల్లా దొండపూడికి చెందిన మాతి సురేష్‌బాబు (49) ఈనెల ఆరో తేదీన భవనం పైనుంచి పడిపోవడంతో బలమైన గాయాలు అయ్యాయి.  బ్రెయిన్‌ డెడ్‌ అవడంతో  కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో కృష్ణాజిల్లా, పెనమూరులోని క్యాపిటల్‌ ఆస్పత్రి, జీవన్‌దాన్‌ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో కావాల్సిన ఏర్పాట్లు చేశారు.

గుండెను శ్రీ పద్మావతి కార్డియాక్‌ ఆస్పత్రిలోని 39 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. కాలేయం, మూత్రపిండం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రికి, మరో మూత్రపిండం విజయవాడలోని క్యాపిటల్‌ ఆస్పత్రికి తరలించడంతో సురేష్‌బాబు నలుగురికి పునర్జన్మ ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను, బంధువులను  ఏపీ జీవన్‌దాన్‌ స్వచ్ఛంద సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ కె.రాఘవేంద్రరావు, జీవన్‌దాన్‌ సంస్థ ప్రధాన వైద్యుడు డాక్టర్‌ కె.రాంబాబు ప్రత్యేకంగా అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top