
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. ‘హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్’ పేరిట మెయిల్స్ వచ్చాయి. ఉగ్రవాదుల బాంబు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేపట్టాయి. భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్, విష్ణు నివాసం ప్రాంతాల వద్ద ప్రత్యేక బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు.
వివిధ రాష్ట్రాలలో బాంబులు పెట్టినట్లు కొన్ని ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు అందుతున్నాయి. తిరుపతి జిల్లాకి కూడా ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో, జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురికావొద్దని ఎస్పీ తెలిపారు.
తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం, గవర్నర్ ఆర్‌ఎన్ రవి భవనం, సినీనటి త్రిష నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. తమిళనాడులోని పలు రాజకీయ, సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్స్ నేపథ్యంలో.. తిరుపతిలోని పోలీసు ప్రత్యేక విభాగం అలర్ట్ అయ్యింది.
