గ్యాంగ్ రేప్.. హత్య కలకలం
కట్టేసి కొట్టడం.. గ్యాంగ్ రేప్.. హత్యలు అన్నీ ఇక్కడే
సీఎం సొంత జిల్లాలో
పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కొమ్ము కాస్తున్న మరికొందరు
దారి తప్పుతున్న దర్యాప్తు..
బలవుతున్న అతివలు
చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇంటర్ చదువుతున్న బాలికపై గతేడాది సెప్టెంబరు 25న జరిగిన గ్యాంగ్ రేప్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అటవీశాఖకు చెందిన పార్కులోకి తన స్నేహితుడితో కలిసి వెళ్లిన బాలికను బెదిరించిన కిషోర్, మహేష్, హేమంత్ లైంగిక దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాలిక స్నేహితుడి కడుపులో పిడిగుద్దులు గుద్ది, అతడి నోరు అదిమిపెట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆపై అడవిలో వీళ్లిద్దరినీ వదలి నిందితులు పారిపోయారు. ఈ ముగ్గురూ టీడీపీ నాయకులే. తీరా ప్రజలే నిందితులను పట్టిస్తే.. ముగ్గురినీ అరెస్టు చూపించిన ఖాకీలు తమ నిర్లక్ష్యం కప్పిపుచ్చుకోవడానికి వాళ్లను రోడ్లపై నడిపించారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్, తిరుపతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళపై జరిగిన కౄరమైన దాడి సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేసింది. తన భర్త తీసుకున్న అప్పును చెల్లించలేదని కుప్పం పట్టణంలోని నారాయణపురంలో ఓ మహిళను కన్న బిడ్డ ఎదుటే ఓ చెట్టుకు కట్టేసి కొట్టారు. రూ.80 వేల అప్పు తీసుకుని, వడ్డీలకు వడ్డీ చెల్లించి.. ఆపై డబ్బులు కట్టలేక ఆ కుటుంబం కుప్పం వదిలి వెళ్లిపోయింది. బిడ్డ చదువు కోసం టీసీ తీసుకోవడానికి వచ్చిన ఆమెను ఓ చెట్టుకు కట్టేసి అందరూ చూస్తుండగానే మునికన్నప్ప కుటుంబం దాడి చేసింది. కూటమి పార్టీ కార్యకర్తలైన నిందితులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు తొలుత వెనుకడుగువేశారు. ‘సాక్షి’ దీన్ని వెలుగులోకి తీసుకురావడంతో సీఎం ఆదేశాలతో పోలీసులు స్పందించి నిందితులను అరెస్టు చేశారు.
ఇక చిత్తూరు నగరంలో అఖిల్ అనే యువకు డు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవు ట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తూ, డిప్యూటీ మేయర్ రాజేష్‌కుమార్‌రెడ్డి వద్ద సొంత పనులు చక్కబెట్టేవాడు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, వేల్లూరు రోడ్డు వైపు ఒంటరి ప్రేమ జంటలే లక్ష్యంగా చేసుకున్న అఖిల్.. మహిళలపై దాడి చేసి, తాను పోలీసునని చెప్పుకునేవాడు. ఖాకీ దుస్తులు ధరించి, ప్రేమ జంటలను బెదిరించి, డ్రోన్ కెమె రాలో వీడియోలు ఉన్నాయని బంగారు ఆభరణా లు దోచుకునేవాడు. ఇతడిపై చర్యలు తీసుకోవడానికి కూడా ఆలోచించిన ఖాకీలు.. మీడియాలో వార్తలు రావడంతో చర్యలకు ఉపక్రమించారు.
● చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యంలో ఓ వివాహితపై బంగారుపాళ్యంకు చెందిన కానిస్టేబుల్, ఓ హోంగార్డు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన కూడా గతేడాది వెలుగులోకి వచ్చింది. బాధితురాలు స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు చెబితే.. ఆపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళలపై రోజు రోజుకు
పెరుగుతున్న వేధింపులు
పైరవీలతోనే..
పోస్టింగుల కోసం పైరవీలు చేస్తున్న కొందరు పోలీ సు అధికారులు సక్రమంగా విధులు చేయకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పార్టీ ఎమ్మెల్యేల వద్ద సెల్యూట్ చేసి అటెండెస్ వేసుకోవడం, వాళ్లు చెప్పిన పనులన్నీ చక్కబెట్టడం, లాటరీ, పేకాల క్లబ్బులు, అక్రమ గ్రానైట్ తరలింపులో కొందరు పోలీసు పాత్ర ఉన్నాయని.. ఫలితంగా శాంతిభద్రతలను గాలికి వదిలేశారనే ఆరోపణలు లేకపోలేదు. మరికొందరు పోలీసులు నిజాయితీగా విధులు చేయడానికి వస్తు న్నా, రాజకీయ నాయకుల మాట వినలేదని బదిలీ వేటు వేస్తుండటంతో డ్యూటీలు చేయలేక సతమతమవుతున్నారు. ఇందులో భాగంగా పలువురు ఇన్ స్పెక్టర్లు లా అండ్ ఆర్డర్ వద్దని లూప్‌లైన్ వెతుక్కుంటుంటే.. జిల్లాలోని ఓ సబ్‌డివిజన్ అధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.
తాజాగా విభిన్న ప్రతిభావంతురాలు కనిపించడంలేదంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే మా పరిధి కాదంటూ తప్పించారు. వారం తరువాత ఆమె హత్యకు గురై నదిలో పడి ఉండడాన్ని మృతురాలి తమ్ముడు గుర్తించాడు. ఈ కేసులో కూడా ఖాకీల దర్యాప్తు సక్రమంగా సాగలేదని పోలీసులను బాధ్యులుగా చేస్తూ ఓ న్యాయవాది మానవ హక్కులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులను ఓ ఠాణా నుంచి మరో స్టేషన్‌కు పంపిస్తూ నిర్లక్ష్యం చేశారంటూ వికలాంగ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
గ్యాంగ్ రేప్.. హత్య కలకలం


