మళ్లీ స్వర్ణముఖిలో ఇసుకదొంగలు
ఏర్పేడు: మళ్లీ స్వర్ణముఖి నదిలో ఇసుక దొంగలుపడ్డారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఎలాంటి అనుమతులు లేకపోయినా తెల్లబంగారాన్ని తోడేసి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ ఇసుకాసురులు మళ్లీ ఇసుక అక్రమ రవాణా మొదలుపెట్టేశారు. గతంలో కురిసిన వర్షాలకు స్వర్ణముఖి నదిలో నీరు ప్రవహించటంతో నెలపాటు వీరి ఇసుక దందాకు బ్రేక్ పడింది. మళ్లీ నీటి ప్రవాహం తగ్గటంతో స్వర్ణమ్మ తెల్లబంగారాన్ని తవ్వి తరలించేస్తున్నారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట–గుడిమల్లం మార్గంలోని స్వర్ణముఖి నదిలో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. సుమారు 30 అడుగుల పైగా లోడేయడంతో పక్కనున్న విద్యుత్ స్తంభాలు వాలిపోయి కూలటానికి సిద్ధంగా ఉన్నాయి. పెనుమల్లం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఇక్కడ ఇసుక దందాను నడిపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ట్రాక్టర్లు వరుసగా ఇసుకను తీసుకెళుతుండడంతో స్థానికులు ఫిర్యాదు చేయగా, రెవెన్యూ సిబ్బంది వచ్చి ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల కిందట రేణిగుంట మండలంలోనూ అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను స్వాథీనం చేసుకుని కేసులు పెట్టారు.
మళ్లీ స్వర్ణముఖిలో ఇసుకదొంగలు


