సాక్షి, అమరావతి: 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మూడో విడత సీట్లను ఆదివారం హెల్త్ వర్సిటీ కేటాయించింది. సీట్లు దక్కించుకున్న విద్యార్థులు ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటల్లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 4,255 ఎంబీబీఎస్ సీట్లను కన్వీనర్ కోటాలో కేటాయించగా..మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన సీట్లను స్ట్రే వెకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ ద్వారా వర్సిటీ భర్తీ చేయనుంది.
గందరగోళంగా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆరోపణ
సాక్షి, అమరావతి : 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు ప్రక్రియ గందరగోళంగా మారిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మూడో దశ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపులో మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరిగిందని విమర్శిస్తున్నారు. ఆదివారం మూడో విడత కన్వీనర్ కోటా సీట్లను హెల్త్ వర్సిటీ విద్యార్థులకు కేటాయించింది.
అంతకుముందు ప్రకటించిన సీట్ మ్యాట్రిక్స్‌లో ఎస్వీయూ రీజియన్ బీసీ–డీ కేటగిరీలో మూడు సీట్లు జనరల్, ఒక సీటు ఉమెన్‌కు రిజర్వ్ చేసినట్టు స్పష్టం చేసింది. అయితే కేటాయింపులో మాత్రం రెండు సీట్లు జనరల్, రెండు సీట్లు అమ్మాయిలకు కేటాయించింది. బీసీ–డీలో ఒక సీటే అమ్మాయిలకు రిజర్వ్ చేసినట్టు ప్రకటించి, ఇద్దరికి కేటాయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
బీసీ–డీ జనరల్‌లో చూపించిన సీట్‌ను ఉమెన్‌కు కేటాయించడంతో అదే బీసీ–డీ రిజర్వేషన్‌లోనే ముందున్న తాను సీట్ కోల్పోతున్నట్టు ఎ.శ్రీహర్ష అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై వర్సిటీ అధికారులను వివరణ కోరగా.. సోమవారం సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. పరిశీలించాకే అలాట్‌మెంట్ లెటర్‌లు జారీ చేస్తామన్నారు.
ఎంబీబీఎస్ మెడికల్ పీజీ తాత్కాలిక ఫీజుల ఖరారు
సాక్షి, అమరావతి: 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సులకు తాత్కాలిక ఫీజులను ఖరారు చేస్తూ ఆదివారం వైద్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ ఉత్తర్వులిచ్చారు.2020–23 బ్లాక్ పీరియడ్ ఫీజులపై ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 10%, పీజీ కోర్సుల్లో 15% చొప్పున పెంపుతో తాత్కాలిక ఫీజులను నిర్ణయించారు.
కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తీర్పులకు అనుగుణంగా తుది ఫీజులను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో 2020–23 బ్లాక్ పిరియడ్ ఫీజుల మీద 15% వృద్ధితో పలు వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు ఫీజులపైనా వేరుగా జీవో ఇచ్చారు.


