
వైద్య సేవలపైనా అసంతృప్తి ప్రభుత్వ ఐవీఆర్‌ఎస్ సర్వేలో వెల్లడి
చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ కుప్పకూలింది. వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంతో పాటు, ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన పీహెచ్‌సీల్లో (ప్రైమరీ హెల్త్ సెంటర్) మందులకు తీవ్ర కొరత నెలకొంది. వైద్యం కోసం పీహెచ్‌సీలకు వెళ్లిన వారిలో సగం మందికి పైగా రోగులకు ఉచిత మందులను ప్రభుత్వం అందించలేకపోతోంది.
ఈ విషయం ప్రభుత్వం నిర్వహించిన తాజా ఐవీఆర్‌ఎస్ సర్వేలోనే వెల్లడైంది. ఉమ్మడి 13 జిల్లాల వారీగా చేపట్టిన సర్వేలో ఏకంగా 43 నుంచి 55 శాతం మంది రోగులు ఉచిత మందులు అందలేదని స్పష్టం చేశారు. అదే విధంగా పీహెచ్‌సీల్లో అందుతున్న వైద్య సేవలపైనా 40 శాతం వరకూ రోగులు అసంతృప్తిగా ఉన్నారు. –సాక్షి, అమరావతి
సీఎం సొంత జిల్లాలో అధ్వాన్నం
ఏడాది పాలనలో ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే క్షేత్ర స్థాయిలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం పీహెచ్‌సీల్లో 200 రకాలకు పైగా ఉచిత మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, సగానికిపైగా మందులను ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో రోగులు మందులను బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది.
స్వయంగా సీఎం చంద్రబాబు సొంత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 48 శాతం మంది రోగులకు ఉచిత మందులు అందలేదని వెల్లడైంది. ఇక వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంత జిల్లాలో ఏకంగా 55 శాతం మంది రోగులు తమకు ఉచిత మందులు అందలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తేలింది. ఇక పీహెచ్‌సీల్లో అందుతున్న వైద్య సేవల విషయంలో చిత్తూరు జిల్లాలో 36 శాతం, అనంతపురం జిల్లాలో 40 శాతం మంది రోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.