సర్కారు ఆస్పత్రుల్లో సంకటం | There is a severe shortage of medicines and surgical supplies across the state | Sakshi
Sakshi News home page

సర్కారు ఆస్పత్రుల్లో సంకటం

Apr 25 2026 3:34 AM | Updated on Apr 25 2026 3:36 AM

There is a severe shortage of medicines and surgical supplies across the state

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మందులు లేక.. ఎదురుగా ఉన్న షాపులో కొనుగోలు చేస్తున్న రోగుల బంధువులు

రాష్ట్ర వ్యాప్తంగా మందులు, సర్జికల్స్‌కు తీవ్ర కటకట..

సూది, దూది, సిరంజిలు కూడా బయట కొనాల్సిన దుస్థితి  

వైద్య సంరక్షణలో అత్యంత కీలకమైన బోధనాస్పత్రుల్లో  తీవ్రస్థాయిలో మందుల కొరత  

బీపీ, షుగర్‌ టాబ్లెట్లు బయట కొనుక్కోవాలని చీటీలు రాస్తున్న వైనం.. పీహెచ్‌సీల్లో అందుబాటులో లేని కాల్షియం మాత్రలు 

ఖాళీగా వెక్కిరిస్తున్న సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ 

మందులు, సర్జికల్స్‌ కొనుగోళ్ల రూపంలో ఒక్కో రోగిపై రూ.వందల నుంచి వేలల్లో భారం మోపుతున్న బాబు సర్కార్‌  

రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులపై అంతులేని నిర్లక్ష్యం 

విజయవాడ జీజీహెచ్‌ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూత వేటు దూరంలో ఉండే విజయవాడ జీజీహెచ్‌లో రోగులే సిరంజీలు, దూది, మందులు, సర్జికల్‌ పరికరాలను బయట కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొంది. ఇక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్స్‌కు తీవ్ర కొరత పరిస్థితులు దాపురించాయి. ఆస్పత్రులకు ప్రభుత్వం సరిపడా మందులు, సర్జికల్స్‌ను సరఫరా చేయకపోవడంతో బయట కొనుక్కోవాలని సిబ్బంది చీటీలు రాసి పంపుతున్నారు. దీంతో దారి ఖర్చుల కోసం తెచ్చుకున్న పదీ పరకా ఖర్చయిపోయి పరామర్శకు వచ్చిన బంధువులు, స్నేహితులను అప్పు కోసం చేయి చాపాల్సి వస్తోందని రోగులు, కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. 

పీహెచ్‌సీల్లో 214, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 417, జిల్లా, బోధనాస్పత్రుల్లో 712 రకాల చొప్పున మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఏ ఒక్క చోటా నిర్దేశించిన మేరకు లేవు. ఇక వైద్య రంగంలో అత్యంత కీలకమైన బోధనాస్పత్రుల్లో 372 రకాల సర్జికల్స్‌ అందుబాటులో ఉండాలి. వీటికి కూడా తీవ్ర సంక్షోభం నెలకొంది. మందులు, సర్జి­కల్స్‌ కొరత నేపథ్యంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ విజయవాడ జీజీహెచ్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్ప­త్రులను పరిశీలించింది. చేతిలో చీటీలతో ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రైవేట్‌ మెడికల్‌ స్టోర్స్‌ వద్ద రోగులు, వారి సహాయకులు తండోపతండాలుగా క్యూ కట్టి కనిపించారు. 

బీపీ బిళ్లలు, నాజల్‌ డ్రాప్స్, సిరంజిలు, కాటన్, ఎగ్జామినేషన్‌ గ్లౌజ్‌లు, రక్త నమూనాలు సేకరించే ట్యూబ్‌లు, సర్జికల్, బ్లడ్‌ థిన్నర్, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌లకు సంబంధించిన వివిధ రకాల మందులు బయట కొనుక్కోవాలని చీటీలు రాయడంతో రోగులపై రూ.300 నుంచి రూ.వేలల్లో భారం పడుతున్నట్టు వెల్లడైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జీజీహెచ్‌లలో ఇదే దుస్థితి నెలకొంది. 

ఈ మందులు బయట కొనుగోలు చేసుకోవాలంటూ చీటీల్లో టిక్‌ పెట్టిన విజయవాడ జీజీహెచ్‌ సిబ్బంది  

» గుంటూరు జీజీహెచ్‌లో బ్యాక్టీరియా, ఇతర ఇన్‌ఫెక్షన్ల చికిత్సల్లో వినియోగించే ఎస్సెన్షియల్‌ యాంటిబయోటిక్స్‌ కొరత వేధిస్తోంది. బీ–కాంప్లెక్స్, ఎకోస్ప్రిన్, మల్టీ విటమిన్‌ మాత్రలు సరిపడా ఉండటం లేదు. న్యూరాలజీ, కార్డియాలజీ లాంటి సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో గతంలో నెల, రెండు నెలలకు సరిపడా ఇచ్చిన మందులను తీవ్ర కొరత నేపథ్యంలో ఇప్పుడు వారం, పది రోజులకు సరిపడా మాత్రమే ఇస్తున్నారని రోగులు ఫిర్యాదు చేస్తున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా సెకండరీ హెల్త్‌ ఆస్పత్రులను మందులు, సర్జికల్స్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. 

» ఉత్తరాంధ్రలో ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా సక్రమంగా లేకపోవడం కిడ్నీ వ్యాధిగ్రస్తుల పాలిట శాపంగా మారుతోంది. డయాలసిస్‌ రోగులకు అవసరమైన కాల్సిట్రియోల్, ఫెబుక్సోస్టాట్, సోడియం బైకార్బొనేట్, కోర్తలిడన్, విటమిన్, టోర్సెమైడ్‌ లాంటి మందులను రోగులే బయట కొనుక్కోవ్సాలిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ కేజీహెచ్‌లో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. 

సర్జికల్స్‌ మెటీరియల్స్‌కు తీవ్ర కటకట నేపథ్యంలో గాయాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు డ్రెస్సింగ్‌ కోసం అవసరమైన మందులు, సూదులు, కిట్స్‌ కూడా బయటకు రాస్తున్నారు. ఇమ్యూనోగ్లోబులిన్స్, వెంటిలేటర్‌ కిట్స్, ఆక్సిజన్‌ పైపులు, గుండె వ్యాధులకు వాడే మందులకు కొరత ఏర్పడింది. కర్నూలు, అనంతపురం, తిరుపతిల్లోని బోధనాస్పత్రుల్లోనూ మందులు, సర్జికల్స్‌కు తీవ్ర కొరత ఉంది. సర్జికల్స్‌ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్‌లపై తీవ్ర ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. 

» సీఎం సొంత జిల్లా చిత్తూరువ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో బీపీ, విటమిన్, విరేచనాలు, జలుబు, దగ్గు, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ కోసం వాడే మందులకు కొరత నెలకొంది. ఎసిడిటీ, గ్యాస్‌ సమస్యల కోసం వాడే రాంటాక్‌ బిళ్లలు కూడా కొన్ని చోట్ల అందుబాటులో లేక బయట కొనుక్కోవాలని చెబుతున్నారు. 

»  కుక్క కాటుకు పీహెచ్‌సీల్లో ఇచ్చే ఏఆర్‌వీ వ్యాక్సిన్‌తో పాటు క్యాల్షియం, విరోచనాలు, బీపీ, గ్యాస్‌ మాత్రలు, జలుబు, దగ్గు సిరప్‌ల నిల్వలు నామమాత్రంగా కూడా లేవు. షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే పరిస్థితి గ్రామ స్థాయిలోని విలేజ్‌ క్లినిక్స్‌లోనూ నెలకొంది.

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ ఖాళీ..!
చంద్రబాబు గద్దెనెక్కాక ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. మందులు, సర్జికల్స్‌ కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్‌ ఏమాత్రం సరిపోవడం లేదని సూపరింటెండెంట్‌లు, వైద్య శాఖ పదే పదే మొత్తుకుంటున్నా ప్రభుత్వం అదనపు బడ్జెట్‌ ఇవ్వడం లేదు. 2025–26లో కేటాయించిన బడ్జెట్‌ మూడు క్వార్టర్‌లకే ఖర్చయిపోవడంతో అదనంగా రూ.100 కోట్లకుపైగా కేటాయించాలని వైద్య శాఖ అభ్యర్థించింది. ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా అదనంగా విదల్చకపోవడంతో ఇతర బడ్జెట్‌ను అరకొరగా సర్దుబాటు చేసి డిసెంబర్, జనవరి నెలల్లో ఇవ్వాల్సిన పర్చేజ్‌ ఆర్డర్‌లను ఏపీఎంఎస్‌ఐడీసీ ఫిబ్రవరి నెలాఖరులో ఇచ్చింది. 

2025–26 చివరి క్వార్టర్‌ మందులే సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌(సీడీఎస్‌)కు పూర్తి స్థాయిలో చేరని దుస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రులకు మందులు, సర్జికల్స్‌ సరఫరా చేయాల్సిన సీడీఎస్‌లలో నిల్వలు తరిగిపోయాయి. ఏలూరు జీజీహెచ్‌లో మందుల కొరతపై ఇటీవల తీవ్ర వివాదం నెలకొంది. ఏప్రిల్, మే, జూన్‌ క్వార్టర్‌కు సంబంధించిన మందులు, సర్జికల్స్‌ సరఫరా కోసం మార్చి నెలలోనే ఇండెంట్‌లు తీసుకుని పీవో (పర్చేజ్‌ ఆర్డర్‌) జారీ చేయాలి. ఏప్రిల్‌ ముగుస్తున్నా ఇంకా ఇండెంట్‌లు తీసుకునే ప్రక్రియ ముగియ లేదు. 

రాష్ట్రంలోని అన్ని సీడీఎస్‌ (సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌)లలో శుక్రవారం నాటికి 712 రకాల మందులకు గాను 150–400 రకాలు నిల్వలు లేవు. పశ్చిమ గోదావరి సీడీఎస్‌లో 300 లోపు మందులే ఉన్నట్లు సమాచారం. సీఎం సొంత జిల్లాలోని చిత్తూరు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రాతిని­ధ్యం వహిస్తున్న అనంతపురం సీడీఎస్‌లలో 400 లోపు రకాల మందుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆస్పత్రులకు మందుల సరఫరాలో సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.  

కిడ్నీ బాధితులకు ఎంత కష్టం..
ఉద్దానం కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో బాధితుల వైద్య సేవలకు ఎంతో ప్రాధాన్యమిస్తూ క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌(సీకేడీ) కింద ప్రత్యేకంగా పీహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వాస్పత్రులకు నాణ్యమైన, ఖరీదైన మందులను సరఫరా చేసింది. 

కూటమి సర్కారు వచ్చాక సీకేడీ మందుల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఒక్కో కిడ్నీ బాధితుడిపై మందుల కొనుగోళ్ల రూపంలో నెలకు రూ.15 వేల మేరకు భారం పడుతోంది. కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్య సేవల కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నెలకొల్పిన పలాస కిడ్నీ కేర్‌ సెంటర్‌ను కూటమి సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. మందులు, సర్జికల్స్‌ను సక్రమంగా సరఫరా చేయడం లేదు. డయలైజర్‌ల కొరత నెలకొంది. డయాలసిస్‌ రోగులు వీటిని బయట కొనుగోలు చేసేందుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. 

సప్లయ్‌ లేదంటున్నారు
2019లో నాకు కిడ్నీ జబ్బు బయటపడింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నా. గత ప్రభుత్వం ఉచితంగా మందులు ఇచ్చేది. ఏడా­దికిపైగా మందులు ఇవ్వడం లేదు. ఆస్పత్రుల్లో అడిగితే సప్లయ్‌ లేదంటున్నారు. కూలికి పోతే గానీ పూటగడవని పరిస్థితి మాది. బయట కొనేందుకు ప్రతి నెలా రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. ఎంతో కష్టంగా ఉంది.  – కూర్మారావు, కిడ్నీ బాధితుడు, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా

ప్రతిసారి బయటే కొంటున్నాం
మా మనవడికి పుట్టుకతోనే కాళ్ల వంకర సమస్య ఉంది. చికిత్స కోసం తరచూ జీజీహెచ్‌కు వస్తుంటాం. ప్రతిసారి బాబుకు డ్రెస్సింగ్‌ మెటీరియల్‌ బయటే కొంటున్నాం. – మేరీ, మైలవరం

బీపీ బిళ్లలు బయట కొన్నా
మా అమ్మ నరాల సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. విజయవాడ జీజీహెచ్‌లో అడ్మిట్‌ చేస్తే బీపీ బిళ్లలు బయట కొనుక్కోమని చీటీ రాసిచ్చారు.     – సుబ్బారావు, మంగళగిరి

పెద్దాస్పత్రిలోనూ అంతే..
వారం కిందట వడదెబ్బ తగలడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లా. వైద్యులు రాసిన మందుల చీటితో కౌంటర్‌కు వెళితే రెండు రకాల మందులు బయట కొనుక్కోమన్నారు. స్థానిక పీహెచ్‌సీలో వైద్యం సరిగా లేదని వ్యయప్రయాసలకోర్చి పెద్దాస్పత్రికి పోతే అక్కడా అదే తంతు.  – మహేశ్వరి, వీరకనెల్లూరు, చిత్తూరు జిల్లా

విజయవాడ వన్‌టౌన్‌ గొల్లపాలెంగట్టులో నివసించే శ్రీనివాసరావు కార్పెంటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య సమస్యతో విజయవాడ జీజీహెచ్‌కు రావడంతో సీటీ స్కాన్‌ చేశారు. రిపోర్ట్‌ ఆధారంగా వైద్యులు ఆరు రకాల ఔషధాలు సూచించారు. మందుల కౌంటర్‌కు వెళితే మూడు రకాలు బయట కొనుక్కోవాలని చెప్పారు. దీంతో జీజీహెచ్‌ ప్రాంగణంలోని ప్రైవేట్‌ మెడికల్‌ షాప్‌లో మందులు కొన్నాడు. ‘ఉచిత వైద్యం చేస్తారని ప్రభుత్వాస్పత్రికి వస్తే మందుల కోసం రూ.300కిపైనే ఖర్చయింది. సీటీ స్కాన్‌ ఫిలిమ్‌ కోసం మరో రూ.300 తీసుకున్నారు. రిపోర్ట్‌ వాట్సప్‌లో పెట్టిస్తే చాలని డాక్టర్‌ చెప్పారు. అలా పెట్టం అని రూ.300 వసూలు చేశారు. నా ఒకరోజు సంపాదన మందులు, రిపోర్టులకే ఖర్చయిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇక్కడ కనిపిస్తున్న వృద్ధురాలు లక్ష్మి స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు. వ్యవసాయ కూలీ. కొన్నేళ్లుగా గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్న ఆమె భర్త రమణ తీవ్ర అనారోగ్యం పాలవడంతో వారం క్రితం విజయవాడ జీజీహెచ్‌లో అడ్మిట్‌ చేశారు. 

 

‘కాళ్లావేళ్లా పడితే బుధవారం ఐసీయూకు మార్చారు. బీపీ బిళ్లలు కూడా బయటే కొన్నాం. ఇప్పుడు సిరంజీలు కూడా బయట కొనాలంటున్నారు. పొలం పనులు చేసుకుని జీవించే వాళ్లం. ఉచిత వైద్యం కోసం వస్తే మాతోనే డబ్బు ఖర్చు పెట్టిస్తున్నారు..’ అని బోరుమంది.

కమీషన్ల రోగం..రోగుల ప్రాణాలతో చెలగాటం
» రాష్ట్రవ్యాప్తంగా వేధిస్తున్న వెంటిలేటర్ల కొరత 
» విజయవాడలో 80కు గాను అందుబాటులో కేవలం 35 మాత్రమే.. తిరుపతి రుయాలో 60 వెంటిలేటర్లు మరమ్మతులకు..  
» కమీషన్లు ఇచ్చే కంపెనీకే కాంట్రాక్టు ఇవ్వడానికి టెండరు ప్రక్రియ సాగదీత
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తి పరాకాష్టకు చేరుతోంది. పేద రోగుల ప్రాణాల కంటే కమీషన్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నా­రని ఆరోపణలు హోరెత్తుతున్నాయి. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓ పక్క వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తుంటే మరోపక్క కొత్తవి కొనుగోలు విష­యంలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కృష్ణాజిల్లా మచిలీపట్నం జీజీహెచ్‌లోని అనస్తీ­షియా విభాగంలో మూడు వెంటిలేటర్లు ఉంటే వాటిలో రెండు పనిచేయడంలేదు. దీంతో అత్యవసర కేసులను విజయవాడ జీజీహెచ్‌కు రిఫర్‌ చేస్తు­న్నా­రు.

అలాగే విజయవాడ జీజీహెచ్‌లో 80 వెంటిలేటర్ల అవసరం ఉండగా, 35 మాత్రమే  ఉన్నాయి. వీటిలో కొన్ని పనిచేయని దుస్థితి. తిరుపతి రుయాలో 120 వెంటిలేటర్లు ఉంటే 60 మరమ్మతులకు గుర­య్యా­యి. ఇక్కడ 100 వరకూ వెంటిలేటర్ల అవసరం ఉంది. కర్నూలు జీజీహెచ్‌లో 369 ఉంటే, 191 పని­చేయడంలేదు. ఇక్కడ కొన్ని నెలలుగా 70 వెంటిలేటర్లు సమకూర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా పట్టించుకోవడంలేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొత్త, పాత బోధనాస్పత్రులను వెంటిలేటర్ల కొరత సమస్య తీవ్రంగా వేధిస్తుంటే అస్మదీయ సంస్థలకు కాంట్రాక్టును కట్టబెట్టేందుకు ఏడాదికి పైగా టెండరు ప్రక్రియను ప్రభుత్వ పెద్దలు సాగదీస్తున్నారు.

తిరస్కరించిన కంపెనీల అర్హత కోసం..
2024లో ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్ల కొనుగోలు కోసం ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)కి ప్రతిపాదనలు వెళ్లాయి. గతేడాది జనవరిలో టెండర్లు పిలిచారు. అయితే దానిని రద్దుచేశారు. అనంతరం.. గతేడాది డిసెంబరులో వెంటిలేటర్ల కోసం ప్రత్యేకంగా టెండరు పిలిచారు. బిడ్‌ల మదింపు అనంతరం అర్హత సాధించిన ఎనిమిది సంస్థల పరికరాలకు ఈనెల 7, 8 తేదీల్లో డెమో నిర్వహించారు. 

ఇందులో ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థ తెచ్చిన పరికరాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇవి ప్రమాణాల మేరకు లేవని, రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశ­ముందని వైద్యుల బృందం కుండబద్దలుకొట్టి తిరస్క­రించినట్లు సమాచారం. అయితే, వైద్యశాఖ ఉన్నతాధికారే రీ–డెమో పెట్టి తిరస్కరించిన పరికరా­లన్నింటినీ ఆమోదించాలని ఆదేశించారు. ఈనెల 28న రీ–డెమో నిర్వహణకు కార్పొరేషన్‌ సమాయ­త్తమైనట్లు సమాచారం. 

అవసరం లేకున్నా..
కమీషన్ల కోసం గతేడాది పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ అల్ట్రాసౌండ్‌ పరికరాలను అవసరం లేకపోయినా బోధనాస్పత్రులకు పెద్ద మొత్తంలో డంప్‌ చేశారు. రూ.9 కోట్లు విలువచేసే 80 పరికరాలను డీఎంఈ ఆస్పత్రులకు ఆర్డర్‌ పెట్టారు.  వైద్యసేవలతో ఏమాత్రం ప్రమేయంలేని, కళాశాలల్లో కూడా డిమాండ్‌ లేని ఈఎన్టీ సిమ్యులేటర్ల కొనుగోలు రూపంలో మరో కుంభకోణానికి తెరలేపారు. ఏకంగా ఒకే కంపెనీ పరికరాలను సరఫరా చేసేలా దాని అనుబంధ సంస్థలు రెండు టెండర్లు వేస్తే వాటిని ఆమోదించి, కాంట్రాక్టును అవార్డు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 

Advertisement
 
Advertisement
Advertisement