breaking news
Central Drug Stores
-
సర్కారు ఆస్పత్రుల్లో సంకటం
విజయవాడ జీజీహెచ్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూత వేటు దూరంలో ఉండే విజయవాడ జీజీహెచ్‌లో రోగులే సిరంజీలు, దూది, మందులు, సర్జికల్ పరికరాలను బయట కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొంది. ఇక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్స్‌కు తీవ్ర కొరత పరిస్థితులు దాపురించాయి. ఆస్పత్రులకు ప్రభుత్వం సరిపడా మందులు, సర్జికల్స్‌ను సరఫరా చేయకపోవడంతో బయట కొనుక్కోవాలని సిబ్బంది చీటీలు రాసి పంపుతున్నారు. దీంతో దారి ఖర్చుల కోసం తెచ్చుకున్న పదీ పరకా ఖర్చయిపోయి పరామర్శకు వచ్చిన బంధువులు, స్నేహితులను అప్పు కోసం చేయి చాపాల్సి వస్తోందని రోగులు, కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. పీహెచ్‌సీల్లో 214, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 417, జిల్లా, బోధనాస్పత్రుల్లో 712 రకాల చొప్పున మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఏ ఒక్క చోటా నిర్దేశించిన మేరకు లేవు. ఇక వైద్య రంగంలో అత్యంత కీలకమైన బోధనాస్పత్రుల్లో 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. వీటికి కూడా తీవ్ర సంక్షోభం నెలకొంది. మందులు, సర్జికల్స్ కొరత నేపథ్యంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ విజయవాడ జీజీహెచ్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులను పరిశీలించింది. చేతిలో చీటీలతో ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ వద్ద రోగులు, వారి సహాయకులు తండోపతండాలుగా క్యూ కట్టి కనిపించారు. బీపీ బిళ్లలు, నాజల్ డ్రాప్స్, సిరంజిలు, కాటన్, ఎగ్జామినేషన్ గ్లౌజ్‌లు, రక్త నమూనాలు సేకరించే ట్యూబ్‌లు, సర్జికల్, బ్లడ్ థిన్నర్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన వివిధ రకాల మందులు బయట కొనుక్కోవాలని చీటీలు రాయడంతో రోగులపై రూ.300 నుంచి రూ.వేలల్లో భారం పడుతున్నట్టు వెల్లడైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జీజీహెచ్‌లలో ఇదే దుస్థితి నెలకొంది. ఈ మందులు బయట కొనుగోలు చేసుకోవాలంటూ చీటీల్లో టిక్ పెట్టిన విజయవాడ జీజీహెచ్ సిబ్బంది » గుంటూరు జీజీహెచ్‌లో బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ల చికిత్సల్లో వినియోగించే ఎస్సెన్షియల్ యాంటిబయోటిక్స్ కొరత వేధిస్తోంది. బీ–కాంప్లెక్స్, ఎకోస్ప్రిన్, మల్టీ విటమిన్ మాత్రలు సరిపడా ఉండటం లేదు. న్యూరాలజీ, కార్డియాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో గతంలో నెల, రెండు నెలలకు సరిపడా ఇచ్చిన మందులను తీవ్ర కొరత నేపథ్యంలో ఇప్పుడు వారం, పది రోజులకు సరిపడా మాత్రమే ఇస్తున్నారని రోగులు ఫిర్యాదు చేస్తున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా సెకండరీ హెల్త్ ఆస్పత్రులను మందులు, సర్జికల్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. » ఉత్తరాంధ్రలో ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా సక్రమంగా లేకపోవడం కిడ్నీ వ్యాధిగ్రస్తుల పాలిట శాపంగా మారుతోంది. డయాలసిస్ రోగులకు అవసరమైన కాల్సిట్రియోల్, ఫెబుక్సోస్టాట్, సోడియం బైకార్బొనేట్, కోర్తలిడన్, విటమిన్, టోర్సెమైడ్ లాంటి మందులను రోగులే బయట కొనుక్కోవ్సాలిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ కేజీహెచ్‌లో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. సర్జికల్స్ మెటీరియల్స్‌కు తీవ్ర కటకట నేపథ్యంలో గాయాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు డ్రెస్సింగ్ కోసం అవసరమైన మందులు, సూదులు, కిట్స్ కూడా బయటకు రాస్తున్నారు. ఇమ్యూనోగ్లోబులిన్స్, వెంటిలేటర్ కిట్స్, ఆక్సిజన్ పైపులు, గుండె వ్యాధులకు వాడే మందులకు కొరత ఏర్పడింది. కర్నూలు, అనంతపురం, తిరుపతిల్లోని బోధనాస్పత్రుల్లోనూ మందులు, సర్జికల్స్‌కు తీవ్ర కొరత ఉంది. సర్జికల్స్ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. » సీఎం సొంత జిల్లా చిత్తూరువ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో బీపీ, విటమిన్, విరేచనాలు, జలుబు, దగ్గు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం వాడే మందులకు కొరత నెలకొంది. ఎసిడిటీ, గ్యాస్ సమస్యల కోసం వాడే రాంటాక్ బిళ్లలు కూడా కొన్ని చోట్ల అందుబాటులో లేక బయట కొనుక్కోవాలని చెబుతున్నారు. » కుక్క కాటుకు పీహెచ్‌సీల్లో ఇచ్చే ఏఆర్వీ వ్యాక్సిన్‌తో పాటు క్యాల్షియం, విరోచనాలు, బీపీ, గ్యాస్ మాత్రలు, జలుబు, దగ్గు సిరప్‌ల నిల్వలు నామమాత్రంగా కూడా లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే పరిస్థితి గ్రామ స్థాయిలోని విలేజ్ క్లినిక్స్‌లోనూ నెలకొంది.సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఖాళీ..!చంద్రబాబు గద్దెనెక్కాక ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. మందులు, సర్జికల్స్ కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ ఏమాత్రం సరిపోవడం లేదని సూపరింటెండెంట్లు, వైద్య శాఖ పదే పదే మొత్తుకుంటున్నా ప్రభుత్వం అదనపు బడ్జెట్ ఇవ్వడం లేదు. 2025–26లో కేటాయించిన బడ్జెట్ మూడు క్వార్టర్లకే ఖర్చయిపోవడంతో అదనంగా రూ.100 కోట్లకుపైగా కేటాయించాలని వైద్య శాఖ అభ్యర్థించింది. ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా అదనంగా విదల్చకపోవడంతో ఇతర బడ్జెట్‌ను అరకొరగా సర్దుబాటు చేసి డిసెంబర్, జనవరి నెలల్లో ఇవ్వాల్సిన పర్చేజ్ ఆర్డర్లను ఏపీఎంఎస్ఐడీసీ ఫిబ్రవరి నెలాఖరులో ఇచ్చింది. 2025–26 చివరి క్వార్టర్ మందులే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్(సీడీఎస్)కు పూర్తి స్థాయిలో చేరని దుస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేయాల్సిన సీడీఎస్‌లలో నిల్వలు తరిగిపోయాయి. ఏలూరు జీజీహెచ్‌లో మందుల కొరతపై ఇటీవల తీవ్ర వివాదం నెలకొంది. ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్‌కు సంబంధించిన మందులు, సర్జికల్స్ సరఫరా కోసం మార్చి నెలలోనే ఇండెంట్లు తీసుకుని పీవో (పర్చేజ్ ఆర్డర్) జారీ చేయాలి. ఏప్రిల్ ముగుస్తున్నా ఇంకా ఇండెంట్లు తీసుకునే ప్రక్రియ ముగియ లేదు. రాష్ట్రంలోని అన్ని సీడీఎస్ (సెంట్రల్ డ్రగ్ స్టోర్స్)లలో శుక్రవారం నాటికి 712 రకాల మందులకు గాను 150–400 రకాలు నిల్వలు లేవు. పశ్చిమ గోదావరి సీడీఎస్‌లో 300 లోపు మందులే ఉన్నట్లు సమాచారం. సీఎం సొంత జిల్లాలోని చిత్తూరు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం సీడీఎస్‌లలో 400 లోపు రకాల మందుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆస్పత్రులకు మందుల సరఫరాలో సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. కిడ్నీ బాధితులకు ఎంత కష్టం..ఉద్దానం కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో బాధితుల వైద్య సేవలకు ఎంతో ప్రాధాన్యమిస్తూ క్రానిక్ కిడ్నీ డిసీజ్(సీకేడీ) కింద ప్రత్యేకంగా పీహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వాస్పత్రులకు నాణ్యమైన, ఖరీదైన మందులను సరఫరా చేసింది. కూటమి సర్కారు వచ్చాక సీకేడీ మందుల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఒక్కో కిడ్నీ బాధితుడిపై మందుల కొనుగోళ్ల రూపంలో నెలకు రూ.15 వేల మేరకు భారం పడుతోంది. కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్య సేవల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం నెలకొల్పిన పలాస కిడ్నీ కేర్ సెంటర్‌ను కూటమి సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. మందులు, సర్జికల్స్‌ను సక్రమంగా సరఫరా చేయడం లేదు. డయలైజర్ల కొరత నెలకొంది. డయాలసిస్ రోగులు వీటిని బయట కొనుగోలు చేసేందుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. సప్లయ్ లేదంటున్నారు2019లో నాకు కిడ్నీ జబ్బు బయటపడింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నా. గత ప్రభుత్వం ఉచితంగా మందులు ఇచ్చేది. ఏడాదికిపైగా మందులు ఇవ్వడం లేదు. ఆస్పత్రుల్లో అడిగితే సప్లయ్ లేదంటున్నారు. కూలికి పోతే గానీ పూటగడవని పరిస్థితి మాది. బయట కొనేందుకు ప్రతి నెలా రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. ఎంతో కష్టంగా ఉంది. – కూర్మారావు, కిడ్నీ బాధితుడు, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాప్రతిసారి బయటే కొంటున్నాంమా మనవడికి పుట్టుకతోనే కాళ్ల వంకర సమస్య ఉంది. చికిత్స కోసం తరచూ జీజీహెచ్‌కు వస్తుంటాం. ప్రతిసారి బాబుకు డ్రెస్సింగ్ మెటీరియల్ బయటే కొంటున్నాం. – మేరీ, మైలవరంబీపీ బిళ్లలు బయట కొన్నామా అమ్మ నరాల సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. విజయవాడ జీజీహెచ్‌లో అడ్మిట్ చేస్తే బీపీ బిళ్లలు బయట కొనుక్కోమని చీటీ రాసిచ్చారు. – సుబ్బారావు, మంగళగిరిపెద్దాస్పత్రిలోనూ అంతే..వారం కిందట వడదెబ్బ తగలడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లా. వైద్యులు రాసిన మందుల చీటితో కౌంటర్‌కు వెళితే రెండు రకాల మందులు బయట కొనుక్కోమన్నారు. స్థానిక పీహెచ్సీలో వైద్యం సరిగా లేదని వ్యయప్రయాసలకోర్చి పెద్దాస్పత్రికి పోతే అక్కడా అదే తంతు. – మహేశ్వరి, వీరకనెల్లూరు, చిత్తూరు జిల్లావిజయవాడ వన్‌టౌన్ గొల్లపాలెంగట్టులో నివసించే శ్రీనివాసరావు కార్పెంటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య సమస్యతో విజయవాడ జీజీహెచ్‌కు రావడంతో సీటీ స్కాన్ చేశారు. రిపోర్ట్ ఆధారంగా వైద్యులు ఆరు రకాల ఔషధాలు సూచించారు. మందుల కౌంటర్‌కు వెళితే మూడు రకాలు బయట కొనుక్కోవాలని చెప్పారు. దీంతో జీజీహెచ్ ప్రాంగణంలోని ప్రైవేట్ మెడికల్ షాప్‌లో మందులు కొన్నాడు. ‘ఉచిత వైద్యం చేస్తారని ప్రభుత్వాస్పత్రికి వస్తే మందుల కోసం రూ.300కిపైనే ఖర్చయింది. సీటీ స్కాన్ ఫిలిమ్ కోసం మరో రూ.300 తీసుకున్నారు. రిపోర్ట్ వాట్సప్‌లో పెట్టిస్తే చాలని డాక్టర్ చెప్పారు. అలా పెట్టం అని రూ.300 వసూలు చేశారు. నా ఒకరోజు సంపాదన మందులు, రిపోర్టులకే ఖర్చయిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక్కడ కనిపిస్తున్న వృద్ధురాలు లక్ష్మి స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు. వ్యవసాయ కూలీ. కొన్నేళ్లుగా గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్న ఆమె భర్త రమణ తీవ్ర అనారోగ్యం పాలవడంతో వారం క్రితం విజయవాడ జీజీహెచ్‌లో అడ్మిట్ చేశారు. ‘కాళ్లావేళ్లా పడితే బుధవారం ఐసీయూకు మార్చారు. బీపీ బిళ్లలు కూడా బయటే కొన్నాం. ఇప్పుడు సిరంజీలు కూడా బయట కొనాలంటున్నారు. పొలం పనులు చేసుకుని జీవించే వాళ్లం. ఉచిత వైద్యం కోసం వస్తే మాతోనే డబ్బు ఖర్చు పెట్టిస్తున్నారు..’ అని బోరుమంది.కమీషన్ల రోగం..రోగుల ప్రాణాలతో చెలగాటం» రాష్ట్రవ్యాప్తంగా వేధిస్తున్న వెంటిలేటర్ల కొరత » విజయవాడలో 80కు గాను అందుబాటులో కేవలం 35 మాత్రమే.. తిరుపతి రుయాలో 60 వెంటిలేటర్లు మరమ్మతులకు.. » కమీషన్లు ఇచ్చే కంపెనీకే కాంట్రాక్టు ఇవ్వడానికి టెండరు ప్రక్రియ సాగదీతసాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తి పరాకాష్టకు చేరుతోంది. పేద రోగుల ప్రాణాల కంటే కమీషన్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు హోరెత్తుతున్నాయి. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓ పక్క వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తుంటే మరోపక్క కొత్తవి కొనుగోలు విషయంలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కృష్ణాజిల్లా మచిలీపట్నం జీజీహెచ్‌లోని అనస్తీషియా విభాగంలో మూడు వెంటిలేటర్లు ఉంటే వాటిలో రెండు పనిచేయడంలేదు. దీంతో అత్యవసర కేసులను విజయవాడ జీజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారు.అలాగే విజయవాడ జీజీహెచ్‌లో 80 వెంటిలేటర్ల అవసరం ఉండగా, 35 మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని పనిచేయని దుస్థితి. తిరుపతి రుయాలో 120 వెంటిలేటర్లు ఉంటే 60 మరమ్మతులకు గురయ్యాయి. ఇక్కడ 100 వరకూ వెంటిలేటర్ల అవసరం ఉంది. కర్నూలు జీజీహెచ్‌లో 369 ఉంటే, 191 పనిచేయడంలేదు. ఇక్కడ కొన్ని నెలలుగా 70 వెంటిలేటర్లు సమకూర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా పట్టించుకోవడంలేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొత్త, పాత బోధనాస్పత్రులను వెంటిలేటర్ల కొరత సమస్య తీవ్రంగా వేధిస్తుంటే అస్మదీయ సంస్థలకు కాంట్రాక్టును కట్టబెట్టేందుకు ఏడాదికి పైగా టెండరు ప్రక్రియను ప్రభుత్వ పెద్దలు సాగదీస్తున్నారు.తిరస్కరించిన కంపెనీల అర్హత కోసం..2024లో ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్ల కొనుగోలు కోసం ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)కి ప్రతిపాదనలు వెళ్లాయి. గతేడాది జనవరిలో టెండర్లు పిలిచారు. అయితే దానిని రద్దుచేశారు. అనంతరం.. గతేడాది డిసెంబరులో వెంటిలేటర్ల కోసం ప్రత్యేకంగా టెండరు పిలిచారు. బిడ్ల మదింపు అనంతరం అర్హత సాధించిన ఎనిమిది సంస్థల పరికరాలకు ఈనెల 7, 8 తేదీల్లో డెమో నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థ తెచ్చిన పరికరాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇవి ప్రమాణాల మేరకు లేవని, రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందని వైద్యుల బృందం కుండబద్దలుకొట్టి తిరస్కరించినట్లు సమాచారం. అయితే, వైద్యశాఖ ఉన్నతాధికారే రీ–డెమో పెట్టి తిరస్కరించిన పరికరాలన్నింటినీ ఆమోదించాలని ఆదేశించారు. ఈనెల 28న రీ–డెమో నిర్వహణకు కార్పొరేషన్ సమాయత్తమైనట్లు సమాచారం. అవసరం లేకున్నా..కమీషన్ల కోసం గతేడాది పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ పరికరాలను అవసరం లేకపోయినా బోధనాస్పత్రులకు పెద్ద మొత్తంలో డంప్ చేశారు. రూ.9 కోట్లు విలువచేసే 80 పరికరాలను డీఎంఈ ఆస్పత్రులకు ఆర్డర్ పెట్టారు. వైద్యసేవలతో ఏమాత్రం ప్రమేయంలేని, కళాశాలల్లో కూడా డిమాండ్ లేని ఈఎన్టీ సిమ్యులేటర్ల కొనుగోలు రూపంలో మరో కుంభకోణానికి తెరలేపారు. ఏకంగా ఒకే కంపెనీ పరికరాలను సరఫరా చేసేలా దాని అనుబంధ సంస్థలు రెండు టెండర్లు వేస్తే వాటిని ఆమోదించి, కాంట్రాక్టును అవార్డు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. -
మందులు డోర్ డెలివరీ..
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు గ్రామానికి చెందిన వి. అప్పలకొండ రెండు వారాల కిందట ఇంటివద్ద కాలుజారి పడిపోవడంతో వెన్నెముక దెబ్బతింది. దీంతో లేచి నడవలేని పరిస్థితి. బీపీ సమస్యతో బాధపడుతున్న తను ఊరిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ వరకూ వెళ్లి మందులు తెచ్చుకోలేని పరిస్థితి. అప్పలకొండ భార్య విలేజ్ క్లినిక్ కు మందుల కోసం వెళ్లింది. భర్త బదులు భార్య మందుల కోసం రావడంతో ఏమైందని కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) అబిగైల్ ఆరా తీశారు. బాధితుడు కదల్లేని స్థితిలో ఉన్నాడని తెలుసుకుని ఇంటి వద్దకే మందులు అవసరమున్నాయని ఎంవో యాప్‌లో నమోదు చేసింది. మరుసటి రోజు నెల రోజులకు సరిపడా మందులు విలేజ్ క్లినిక్‌కు పోస్టల్లో వచ్చాయి. వాటిని సీహెచ్‌వో ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేసింది. మందులను వాడే క్రమాన్ని వివరించింది. ఈ పరిణామంతో అప్పలకొండ సంతోషం వ్యక్తం చేశాడు. ‘కదల్లేని స్థితిలో ఉన్న తనకు ఇంటి వద్దకే అవసరమైన మందులను అందించారు. ప్రయాసలను తగ్గించారు. మాలాంటి వృద్ధులు, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ పెట్టడం గతంలో ఎన్నడూ చూడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని సీహెచ్వోతో తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఇలా ఒక్క అప్పలకొండ మాత్రమే కాదు...గుండె, మూత్రపిండాలు, మెదడు సంబంధిత, క్యాన్సర్ వంటి ధీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన బాధితుల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్) కార్యక్రమంలో వీరికి అవసరమైన మందులను వారుంటున్న ఇంటి గుమ్మం వద్దకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సచివాలయాల ద్వారా పౌర సేవలను ఇంటికే చేరువ చేసేలా..వైద్య సేవలను సైతం మరింత దగ్గర చేసింది. ఈ క్రమంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడకపోవడంతో ఆరోగ్యం క్షీణించి, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.ఈ నేపథ్యంలో మందులు సక్రమంగా వాడాలంటే సకాలంలో వారికి చేరువచేయాలని సీఎం జగన్ భావించారు. ఈ సంకల్పంతో దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు జగనన్న సురక్షలో మందుల డోర్ డెలివరీని ప్రారంభించారు. తపాల శాఖ ద్వారా మందులు సరఫరా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందుల డోర్ డెలివరీ కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ మాడ్యూల్‌ను తయారు చేసింది. ఇందులో వ్యాధిగ్రస్తుల వివరాలు, వారికి అవసరమైన మందుల జాబితా పొందుపరిచారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నిర్దేశించిన ప్రణాళిక మేరకు గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను పరిశీలించినప్పుడు వారికి అసరమైన మందులను సూచిస్తారు. వాటిని డోర్ డెలివరీ చేయాలని ఆన్లైన్లో టోకెన్ రూపంలో సిఫారసు చేస్తారు. ఈ సూచన దగ్గరలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు వెళుతుంది. ఆ వెంటనే డాక్టర్ సూచించిన మందులను పార్సిల్ చేసి, తపాల శాఖ ద్వారా విలేజ్ క్లినిక్‌లకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి సీహెచ్‌వోలు వ్యాధిగ్రస్తుల ఇళ్లకు డెలివరీ చేస్తారు. ఇంటి వద్దకే మందులు తెచ్చి ఇచ్చారు – టి. నిక్సాన్, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా పదేళ్లుగా మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకుని వాడుకునే వాడిని. ప్రభుత్వం కొత్తగా ఇంటి వద్దకే మందులు సరఫరా చేస్తున్నారంటూ స్థానిక విలేజ్ క్లినిక్ వాళ్లు మందులు తెచ్చి ఇచ్చారు. ఈ విధానం చాలా బాగుంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఊరటనిచ్చే విధానమిది. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తోంది – అబిగైల్, సీహెచ్‌వో, కొమరవోలు వైఎస్సార్ విలేజ్ క్లినిక్, అనకాపల్లి జిల్లా విలేజ్ క్లినిక్‌లో 105 రకాలు, పీహెచ్సీలో కొన్ని వందల రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకు అవసరమైన మందుల జాబితాను ఆన్లైన్లో సూచించిన వెంటనే పోస్టల్లో మాకు వాటిని పంపుతున్నారు. ఈ మందులను ఇళ్ల వద్దకు వెళ్లి అందించినప్పుడు వారు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తుంది. వేగంగా మందుల సరఫరా – డి. మురళీధర్ రెడ్డి, ఎండీ, ఏపీఎంస్ఐడీసీ సకాలంలో మందులు అందక, ఇతర దుకాణాల్లో కొనలేక నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యం. ఈ క్రమంలోనే మందుల డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ రోజుకారోజు వైద్యాధికారుల నుంచి ఆన్లైన్లో వచ్చిన ఇండెంట్లను పరిశీలించి మందులను పార్సిల్ రూపంలో మరుసటి రోజే పోస్ట్ చేస్తున్నాం. సీహెచ్‌వోలు మందులను అందజేసి, ధ్రువీకరణ కోసం ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. -
47 శాతం యాంటీబయోటిక్స్‌కు అనుమతుల్లేవ్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రైవేట్ రంగంలో యాంటీబయోటిక్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతులు లేని యాంటీబయోటిక్స్‌ను సైతం వైద్యులు యాంటీబయోటిక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. 2019లో దేశంలో ఉపయోగించిన వాటిలో 47 శాతానికి పైగా యాంటీబయోటిక్స్‌కు ఎలాంటి అనుమతులు లేవని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రీజినల్ హెల్త్–సౌత్‌ఈస్టు ఆసియా’ జర్నల్‌లో ప్రచురించారు. 2019లో అత్యధికంగా అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్‌ను 7.6 శాతం మంది, సెఫిక్సైమ్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను 6.5 శాతం మంది ఉపయోగించినట్లు అధ్యయనంలో తేలింది. ఇదంతా ప్రైవేట్ రంగంలో సాగిందే. ప్రభుత్వ రంగంలో వాడిన యాంటీబయోటిక్స్‌ను ఇందులో చేర్చలేదు. అనుమతుల్లేని యాంటీబయోటిక్స్ ఫార్ములేషన్స్లో తొలి మూడు స్థానాల్లో సెఫాలోస్పారిన్స్, మాక్రోలైడ్స్, పెన్సిల్సిన్స్ ఉన్నాయి. ఇండియాలో యాంటీబయోటిక్స్ వాడకంపై నిఘా పెట్టేందుకు సరైన వ్యవస్థలు లేవని హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్లో కన్సల్టింగ్ ఫిజీషియన్, డయాబెటాలిజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ హరికిషన్ బూగూరు చెప్పారు. అనుమతి లేని ఔషధాలను విచ్చలవిడిగా వాడితే రోగులకు ముప్పు తప్పదని హెచ్చరించారు. -
రాష్ట్రంలో మూడు భారీ ఔషధ నిల్వ కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రాంతీయ ఔషధ నిల్వ (రీజనల్ డ్రగ్ స్టోర్స్ - ఆర్డీఎస్) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో వీటి నిర్మాణానికి జాతీయ ఆరోగ్యమిషన్ రూ.10 కోట్ల వంతున నిధులు ఇస్తోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ విస్తీర్ణంలో.. 40 వేల చదరపు అడుగుల్లో మందులు నిల్వ చేయడానికి అవకాశం ఉండేలా వీటిని డిజైన్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన స్థలాల్లో ఏడాదిలోగా ఈ నిర్మాణాలను పూర్తిచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. భారీగా నిల్వలకు అవకాశం ⇔ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్) ఉన్నాయి. ⇔ దీనివల్ల మందుల నిల్వకు సరిపడా విస్తీర్ణం అందుబాటులో లేదు. ⇔ ఈ నేపథ్యంలో రాష్ట్రం పంపిన ప్రతిపాదనలతో మూడు ఆర్డీఎస్ల నిర్మాణానికి రూ.10 కోట్ల వంతున నిధులిచ్చేందుకు జాతీయ ఆరోగ్యమిషన్ అంగీకరించింది. ⇔ కొత్తగా నిర్మించే ఈ కేంద్రాల్లో క్వారంటైన్ సదుపాయంతో పాటు భారీగా మందులు నిల్వ చేసుకునే వీలుంటుంది. ⇔ మందుల్ని ఈ కేంద్రాల్లో నిల్వ చేసి అవసరాన్ని బట్టి జిల్లాలకు పంపిస్తారు. ⇔ ఒక్కో కేంద్రంలో కనీసం ఆరునెలలకు సరిపడా మందుల్ని నిల్వచేయవచ్చు. ⇔ మందుల నిల్వతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కోల్డ్‌చైన్ (శీతలీకరణ) అవకాశం ఉంటుంది. ⇔ ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు, ఖరీదైన మందుల నిల్వకు ఇబ్బందులుండవు. -
మందుల్లేవ్!
నో స్టాక్ - గుంటూరు జీజీహెచ్‌లో మందుల్లేక రోగుల ఇక్కట్లు - ఆస్పత్రి ప్రారంభించినప్పటి బడ్జెట్టే నేటికీ అమలు.. - రోగులు పెరుగుతున్నా బడ్జెట్ పెంచని ప్రభుత్వం - తక్కువ ధర మందులైతేనే.. లేదంటే బయట కొనాల్సిందే! - టెండర్లు పిలిచే వరకు రోగులకు తప్పని అవస్థ సాక్షి, గుంటూరు : అపర సంజీవనిగా పేరొందిన ఆస్పత్రిలోనే మందుల కొరత వెంటాడుతోంది. కోస్తాంధ్ర ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ విభాగంలో చూపించుకుని వెళ్దామని వచ్చిన వారికి కూడా మందులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక వార్డుల్లో చేరిన వారి పరిస్థితి మరింత దారుణం. మందుల కొనుగోలుకు ఆస్పత్రి ప్రారంభమైనప్పుడు కేటాయించిన బడ్జెట్‌నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎన్నో రెట్లు రోగులు పెరిగినా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఆ స్థాయిలో మందులు రాక పోవడంతో వైద్యాధికారులు సైతం ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ధర తక్కువైతే ఇక్కడ.. లేదంటే బయట.. జీజీహెచ్‌కి వివిధ సమస్యలతో నిత్యం వేలాది మంది పేద రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో 1175 పడకలు ఉన్నప్పటికీ అవి కూడా చాలక ఒక్కొక్క బెడ్‌కు ఇద్దరు చొప్పున రోగులను ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. వార్డుల్లో రోగులకు వైద్యుల సూచనల మేరకు మందులు వేయాల్సిన స్టాఫ్ నర్సులు అవి తమ వద్ద లేవని బయట కొనుక్కోమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక ఉచిత వైద్యం అందుతుందనే ఆశతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన పేద రోగులు, వారి బంధువులు మందులు బయట కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. ఏవో తక్కువ ధరకు దొరికే మందులు మాత్రం ఆసుపత్రిలో ఉంటున్నాయని, అధిక ధరవైతే స్టాక్ లేవని చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. సూపర్ స్పెషాలిటీ వార్డుల్లో మరింత తీవ్రం.. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి సరఫరా కాని మందులను హెచ్‌డీఎస్ నిధుల ద్వారా కొనుగోలు చేసే వీలుంటుంది. కానీ అవి టెండర్ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ టెండర్లు ఏడు నెలలుగా పిలవకపోవడంతో ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రమయింది. ముఖ్యంగా సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలైన కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జన్ వంటి విభాగాల్లో మందుల కొరత క్కువగా ఉందని చెబుతున్నారు. వీటిని బయట కొనుగోలు చేయాలంటే అధిక ధరలు ఉంటాయని, దీంతో పేద ప్రజలకు భారంగా మారుతుందని పలువురు ఆక్షేపిస్తున్నారు. మందులపై పర్యవేక్షణ కరవు... మందుల స్టాక్ రూమ్ నుంచి వివిధ వార్డులకు రోజూ మందులు సరఫరా అవుతుంటాయి. ఆ మందులు ఎవరికి వేశారనేది ఎప్పటికప్పుడు రికార్డు చేయాలి. ఆ మందులు ఏ రోగికి వినియోగించారో రోజూ ఆసుపత్రి ఉన్నతాధికారులకు తెలియజేస్తే కావాల్సిన మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తెప్పించే వీలు ఉంటుంది. ఏ వార్డులో ఎన్ని మందులు ఉన్నాయి. ఏయే మందులు ఉన్నాయి అనే విషయం ఎవ్వరికీ తెలియడంలేదు. రోజూ ఎవరో ఒక ఉన్నతాధికారి వార్డులను పరిశీలించి అక్కడ ఏయే మందులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునే వీలుంటుంది. రోగులకు అందుబాటులేని మందులను కొనుగోలు చేసి అందించే అవకాశం ఉంటుంది. కొరత గుర్తించి కొనుగోలు చేస్తున్నాం.. జీజీహెచ్‌లో మందుల కొరత తలెత్తుతూనే ఉంది. వాటిని గుర్తించి వెంటనే కొనుగోలు చేస్తున్నాం. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి కొన్ని మందులు రానప్పుడు టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. కొన్ని నెలలుగా టెండర్లు పెండింగ్‌లో పడ్డాయ్. దీనిపై కలెక్టర్‌కు లేఖ రాస్తాం. రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ పెంచాలి.- డాక్టర్ వేణుగోపాలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్


