47 శాతం యాంటీబయోటిక్స్‌కు అనుమతుల్లేవ్‌

Over 47 percent antibiotic used in India unapproved - Sakshi

బోస్టన్‌ వర్సిటీ, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ అధ్యయనంలో వెల్లడి  

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రైవేట్‌ రంగంలో యాంటీబయోటిక్స్‌ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. సెంట్రల్‌ డ్రగ్‌ రెగ్యులేటర్‌ అనుమతులు లేని యాంటీబయోటిక్స్‌ను సైతం  వైద్యులు యాంటీబయోటిక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. 2019లో దేశంలో ఉపయోగించిన వాటిలో 47 శాతానికి పైగా యాంటీబయోటిక్స్‌కు ఎలాంటి అనుమతులు లేవని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌–సౌత్‌ఈస్టు ఆసియా’ జర్నల్‌లో ప్రచురించారు.

2019లో అత్యధికంగా అజిత్రోమైసిన్‌ 500 ఎంజీ ట్యాబ్లెట్‌ను 7.6 శాతం మంది, సెఫిక్సైమ్‌ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను 6.5 శాతం మంది ఉపయోగించినట్లు అధ్యయనంలో తేలింది. ఇదంతా ప్రైవేట్‌ రంగంలో సాగిందే. ప్రభుత్వ రంగంలో వాడిన యాంటీబయోటిక్స్‌ను ఇందులో చేర్చలేదు. అనుమతుల్లేని యాంటీబయోటిక్స్‌ ఫార్ములేషన్స్‌లో తొలి మూడు స్థానాల్లో సెఫాలోస్పారిన్స్, మాక్రోలైడ్స్, పెన్సిల్సిన్స్‌ ఉన్నాయి. ఇండియాలో యాంటీబయోటిక్స్‌ వాడకంపై నిఘా పెట్టేందుకు సరైన వ్యవస్థలు లేవని హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో కన్సల్టింగ్‌ ఫిజీషియన్, డయాబెటాలిజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్‌ హరికిషన్‌ బూగూరు చెప్పారు. అనుమతి లేని ఔషధాలను విచ్చలవిడిగా వాడితే రోగులకు ముప్పు తప్పదని హెచ్చరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top