పట్టణాల్లో కోలుకుంటున్న డిమాండ్
బలంగా గ్రామీణ వినియోగం
ఆర్‌బీఐ బులెటిన్ విడుదల
ముంబై: అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలబడినట్టు ఆర్‌బీఐ అక్టోబర్ బులెటిన్ తెలిపింది. ‘‘అమెరికాలో వాణిజ్య, ఆర్థిక పరమైన అనిశ్చితులు పెరిగాయి. అయినప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కుదురుగా ఉంది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తలెత్తడం, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ కొనసాగుతుండడంతో అక్టోబర్‌లో పెట్టుబడిదా రుల సెంటిమెంట్ దెబ్బతిన్నది.
ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపించింది. పట్టణ డిమాండ్ కోలుకుంటున్నట్టు, గ్రామీణ వినియోగం బలంగా ఉన్నట్టు ముఖ్యమైన సూచికలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ భా రత ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్త ప్రతికూలతలకు దూరంగా ఉండలేదు. కానీ, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి చేరడం, బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, తగినంత విదేశీ మారక నిల్వలు, విశ్వసనీయమైన ద్రవ్య, పరపతి కార్యాచరణతో భారత్ గట్టిగా నిలబడగలిగింది’’అని ఆర్‌బీఐ తన బులెటిన్‌లో పేర్కొంది.
సంస్కరణల మద్దతు
అక్టోబర్ 1 నాటి మానిటరీ పాలసీ కమిటీ తీర్మానం ప్రకారం వృద్ధి అవకాశాలు బలంగానే ఉన్నట్టు ఆర్‌బీఐ బులెటిన్ తెలిపింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. దేశీ చోద కాలు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. దేశీయంగా చేపడుతున్న సంస్కరణలను ప్రస్తావించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి మద్దతుగా ఆర్‌బీఐ రేట్ల తగ్గింపునకు అవకాశాలున్నట్టు పేర్కొంది. డాలర్‌తో రూపాయి విలువ ఇటీవల క్షీణించినట్టు పే ర్కొంటూ.. వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు స్థిరంగా బయ టకు వెళుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వరుసగా మూడో నెల సెపె్టంబర్‌లో ప్రతికూలంగా నమోదైనట్టు తెలిపింది. ఈ బులెటిన్‌లోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, అధికారికమైనవి కావని ఆర్‌బీఐ పేర్కొంది.


