 
													వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ(H-1B) వీసాలపై ఫీజు పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీసాలపై ప్రకటనను పునఃపరిశీలించాలని అమెరికా చట్టసభ సభ్యుల బృందం.. తాజాగా ట్రంప్‌ను కోరడం విశేషం. ఫీజు పెంపుల అంశం అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండగా.. ఏఐ(AI) సాంకేతిక నాయకత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా చట్టసభ సభ్యుల బృందం ప్రతినిధులు జిమ్మీ పనెట్టా, అమీ బెరా, సలుద్ కార్బజల్, జూలీ జాన్సన్ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో హెచ్1-బీ వీసాల ఫీజుల పెంపు గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. లేఖలో..‘హెచ్-1బీ గ్రహీతల్లో అత్యధిక వాటాను భారతీయులు కలిగి ఉన్నారు. వారిలో ఎక్కువ మంది సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు(AI)లో అమెరికా నాయకత్వానికి కేంద్రంగా ఉన్నారు. వీసాల విషయం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు కూడా ఎంతో కీలకం. ఇలాంటి వీసా విధానం ఇండో-పసిఫిక్‌లో అమెరికాకు అత్యంత సన్నిహిత ప్రజాస్వామ్య మిత్రదేశాలలో ఒకటైన భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుంది. వీసాల అమలు వల్ల కీలకమైన ప్రజాస్వామ్య భాగస్వామితో వ్యూహాత్మకంగా అమెరికా భాగస్వామ్యం బలపడుతుంది.
మరోవైపు.. ఏఐ, అధునాతన సాంకేతికతలలో చైనా దూకుడుగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో మనం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడాన్ని కొనసాగించాలి. హెచ్-1బీ వీసాల అమలు అంటే కేవలం ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయడం కాదు. ఇది 21వ శతాబ్దంలో ప్రపంచ శక్తిని నిర్వచించే పరిశ్రమలలో అమెరికా నాయకత్వాన్ని చూపించడం. వీసాల ఫీజు పెంపు పెద్ద కంపెనీలకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ.. నైపుణ్యంపై ఆధారపడే స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలను గుదిబండగా మారుతుంది’ అని హెచ్చరించారు.
లేబర్ డిపార్ట్‌మెంట్ వీడియో..
ఇదిలా ఉండగా.. హెచ్-1బీ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమిస్తున్నారని అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఆరోపించింది. హెచ్-1బీ వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ యువత తమ అమెరికన్ డ్రీమ్స్ కోల్పోతున్నారని, పరిస్థితిని సరిచేసి ఆ కలను తిరిగి అమెరికా ప్రజలకు ఇవ్వాలని సంకల్పించామని పేర్కొంది. దీనికి సంబంధించి తాజాగా వీడియో విడుదల చేసింది.
ఈ వీడియోలో చూపించిన గణాంకాల ప్రకారం, హెచ్-1బీ వీసాలలో 72 శాతం భారతీయులకే జారీ అవుతున్నాయని వెల్లడించింది. వీసా కింద అమెరికాలో పనిచేస్తున్న నైపుణ్య కార్మికుల్లో అధికశాతం భారత్ నుంచే వెళ్తున్నారని తెలిపింది. వీసా వ్యవస్థలో ఎలాంటి అవకతవకలు ఉన్నాయా అని గుర్తించేందుకు ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ పేరిట ఆడిట్ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమిస్తూ, స్థానిక అమెరికన్లకు నష్టం కలిగించే కంపెనీలను గుర్తించడమని పేర్కొంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
