ఇళ్లు కూల్చివేశారు.. కన్నీళ్లు మిగిల్చారు | Ten houses demolished in VR Agraharam Anakapalle district | Sakshi
Sakshi News home page

ఇళ్లు కూల్చివేశారు.. కన్నీళ్లు మిగిల్చారు

Jun 14 2026 5:30 AM | Updated on Jun 14 2026 5:30 AM

Ten houses demolished in VR Agraharam Anakapalle district

వారం గడువు కోరినా కనికరించని అధికారులు

ప్రభుత్వ ఆదేశాలతో ఆకస్మికంగా అనకాపల్లి జిల్లా వీఆర్‌ అగ్రహారంలో పది ఇళ్లు కూల్చివేత 

మండు వేసవిలో నిలువ నీడ కోల్పోయిన పేదలు  

నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేతపై బాధితుల ఆగ్రహం

యలమంచిలి రూరల్‌: ‘మా తాతల కాలం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇంకా పూర్తిగా నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. వారం రోజులు గడువిస్తే మేమే స్వచ్చందంగా ఇళ్లు ఖాళీ చేస్తాం’ అని మొరపెట్టుకున్నా అధికారులు కరుణించలేదు. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో నిర్దాక్షిణ్యంగా 10 ఇళ్లను కూల్చివేశారు. పేదలకు మండు వేసవిలో నిలువ నీడలేకుండా రోడ్డుపాలు చేశారు. నిర్వాసితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వీఆర్‌ అగ్రహారంలోని సెజ్‌లో పరిశ్రమల ఏర్పాటు కోసం రెండో విడత భూసేకరణకు ఏపీఐఐసీ అధికారులు శ్రీకారం చుట్టారు. 

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండానే సేకరించిన భూముల్లో ఇళ్లు కూల్చివేస్తున్నారు. నెలరోజుల క్రితం ఇక్కడ గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన కోసం సీఎం చంద్రబాబు, మంత్రులు వచ్చారు. ఆ సమయంలో భూనిర్వాసితుల నుంచి నిరసన ఎదురుకాకుండా ముందు జాగ్రత్తగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భాగంగా 44 మందికి దిబ్బపాలెం సెజ్‌ నిర్వాసితుల కాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించి పట్టాలు పంపిణీ చేశారు. 

అక్కడ ఇళ్లు నిర్మించుకోవడానికి నిర్వాసితులు వెళితే స్థానిక జనసేన నేతలు అడ్డుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక నిర్వాసితులు దిక్కుతోచని స్థితిలో ఉండగా, కలెక్టర్‌ ఆదేశాలంటూ శనివారం రాంబిల్లి తహసీల్దార్‌ సత్యనారాయణ వారి ఇళ్లను కూల్చేందుకు నాలుగు పొక్లెయిన్లతో వీఆర్‌ అగ్రహారం చేరుకున్నారు. 

నోటీసులు ఇవ్వకుండానే... 
నోటీసులు ఇవ్వకుండా ఆకస్మాత్తుగా ఇళ్లు కూల్చివేస్తే పిల్లలు, వృద్ధులతో సహా అందరం రోడ్డునపడాల్సి వస్తుందని అధికారులకు నిర్వాసితులు తెలియజేశారు. తమకు వారం గడువు ఇస్తే ఖాళీ చేసి వెళతామని చెప్పారు. అయినా అధికారులు అంగీకరించలేదు. విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను నేలమట్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి మేరకే అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని, కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేసి తమను రోడ్డుపాలు చేశారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

పేదల ఇళ్లు కూల్చివేత
రాజమహేంద్రవరంలోని పుంతరోడ్డులో 20 నిర్మాణాల తొలగింపు 
ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేశారని బాధితుల ఆవేదన 
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని 44వ డివిజన్‌ నుంచి 47వ డివిజన్‌ వరకు గల పుంత రోడ్డులో 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను అధికారులు శనివారం కూల్చివేశారు. శనివారం ఉదయం 6 గంటలకే వందల మంది పోలీసులు, జేసీబీలతో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. హఠాత్తుగా జేసీబీలతో ఇళ్లను కూల్చివేశారు. దీంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటిలోని సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇళ్లు ఖాళీ చేయించి, ఇతర ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేయకుండా ఇలా అర్ధంతరంగా కూల్చివేయడంపై మండిపడ్డారు. 

టీడీపీ నేతలకు వత్తాసు 
పుంతలోనే టీడీపీకి చెందిన నాయకుల భవనాలు ఉన్నాయి. వీటికి కనీసం నోటీసులు కూడా జారీ చేయకపోవడం గమనార్హం. ఒక నేత ఏకంగా ‘సైట్‌ ఫర్‌ సేల్‌’ అని బోర్డు పెట్టి దానిపై ఫోన్‌ నంబర్‌ కూడా రాసి­నా అక్కడ మాత్రం నగర పాలక సంస్థ అధికారులు కనీసం బోర్డు కూడా పెట్టలేదు. అధికారం, అంగ బలం ఉన్నవారికి ఒక న్యాయం. సామాన్యులకు మరో న్యాయమా అని పలువురు విమర్శిస్తున్నారు. 

ప్రత్యేక ఆక్రమణల తొలగింపు 
కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ భూములు, ప్రజా రహదారులు, రోడ్డు మార్జిన్లు, కాలువలు, డ్రైన్లు, పార్కులు, ఇతర ప్రజా ఆస్తులపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ రాహుల్‌ మీనా తెలిపారు. ఇందిరా సత్యనగర్‌ పుంత ప్రాంతంలో ఉన్న 28 ఆక్రమణలు తొలగించగా, ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement