
లోకేశ్ సేవా సమితి వ్యవస్థాపకుడు మల్లికార్జునరెడ్డి ఆవేదన
పార్టీ కోసం ఆస్తులు అమ్మి రూ.కోట్లు
ఖర్చు పెట్టాను.. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో కాలు తీసేశారు
పింఛన్‌కు దరఖాస్తు చేస్తే తిరస్కరించారు..
ఆత్మహత్యే శరణ్యమంటూ కన్నీటిపర్యంతం
సాక్షి, నెల్లూరు సిటీ: సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ టీడీపీ నాయకులు, కార్యకర్తలను పూర్తిగా వాడుకుని వదిలేస్తారని అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడి జీవితం కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. టీడీపీని నమ్ముకుని ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డానని నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన కంచి మల్లికార్జునరెడ్డి తెలిపారు.
‘1983లో పార్టీ స్థాపించినప్పటి నుంచి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశాను. పార్టీ కోసం నా జీవితాన్ని, ఆస్తులను త్యాగం చేశాను. ఈ రోజు బతుకుదెరువు కోసం పార్టీ నేతలను, స్థానికులను యాచించాల్సిన దుస్థితి వచ్చింది’ అని మల్లికార్జునరెడ్డి ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
లోకేశ్ పేరుతో సేవా కార్యక్రమాలకు రూ.కోట్లు ఖర్చు..
‘నేను 2014లో నారా లోకేశ్ సేవా సమితిని ఏర్పాటు చేశాను. రూ.కోట్లు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాను. అప్పట్లో పవర్ ప్రాజెక్ట్‌లకు ఐస్ సరఫరా కాంట్రాక్ట్ చేసేవాడిని. నేను సంపాదించిన డబ్బులతోపాటు 2 ఇళ్లు, ఇంటి స్థలం అమ్మేసి లోకేశ్ సేవా సమితి కార్యక్రమాలకు ఖర్చు చేశాను. రూ.1.50లక్షలు ఖర్చు చేసి చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు, తల్లి అమ్మణ్ణమ్మల పెయింట్ ఫొటో వేయించాను. ఆ ఫొటోను చంద్రబాబుకు బహూకరించాను.
గతేడాది డిసెంబర్‌లో షుగర్ పెరిగి నాకు ఒక కాలు తొలగించారు. తల నరాలు బలహీనపడి నా భార్య అనార్యోగంతో బాధపడుతోంది. దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు.’ అని చెప్పారు. ‘ఇటీవల నెల్లూరు వచి్చన లోకేశ్‌ను కలిశాను. నా పరిస్థితిని వివరించడంతో అధైర్య పడొద్దు.. మంత్రి నారాయణకు చెప్పాను. ఆయన చూసుకుంటారని లోకేశ్ హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరూ సాయం చేయలేదు. నా జీవితాన్ని పారీ్టకి అంకితం చేశాను. నన్ను ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం’ అని అన్నారు.