పంచాయతీ ఎన్నికల్లోనూ అవే కుట్రలు | TDP plots irregularities in panchayat elections too | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికల్లోనూ అవే కుట్రలు

Nov 13 2026 5:41 AM | Updated on Nov 13 2026 5:41 AM

TDP plots irregularities in panchayat elections too

పార్టీ రహితంగా జరిగే ఎన్నికైనా ఆగని టీడీపీ కుతంత్రాలు 

నామినేషన్ల అడ్డగింతకు పన్నాగం 

నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌ కేంద్రాల ఏర్పాటు 

ప్రజల్లో బలం ఉన్న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు పోటీ చేయకుండా పన్నాగాలు 

మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబు కూటమి 

నామినేషన్లు వేయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకున్న టీడీపీ గూండాలు 

దాడులు, దౌర్జన్యాలు, నామినేషన్‌ పత్రాల చించివేత వంటి అనైతిక చర్యలకు పాల్పడ్డ కూటమి 

పోలింగ్‌ రోజూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులు, పోలింగ్‌ కేంద్రాల నుంచి గెంటివేత 

ఇష్టారీతిన దొంగ ఓట్లు, రిగ్గింగ్‌కు పాల్పడ్డ కూటమి గూండాలు

ఓట్ల లెక్కింపులోనూ అవే దౌర్జన్యాలు 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్‌ పేరుతో ఫలితాలు తారుమారు 

ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ అదే విధమైన పన్నాగం 

నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ జారీకి ఒక రోజు ముందు పలు జిల్లాల్లో నామినేషన్‌ కేంద్రాల్లో మార్పులు 

గ్రామాల్లో కాకుండా కేవలం మండల కేంద్రాల్లోనే ఏర్పాటు చేయిస్తున్న కూటమి నేతలు 

నిబంధనల ప్రకారం పెద్ద పంచాయతీల్లో అక్కడే కేంద్రం ఏర్పాటు చేయాలి 

2 నుంచి 4 చిన్న పంచాయతీలకు కలిపి వాటిలో పెద్ద పంచాయతీలో ఏర్పాటు చేయాలని నిబంధన 

కానీ, ఇష్టానుసారం నామినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్న అధికార కూటమి 

కూటమి నేతల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులు

సాక్షి, అమరావతి: అధికారులను లోబరుచుకొని మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో అనేకానేక కుట్రలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన అధికార చంద్రబాబు కూటమి.. ఏ పార్టీలకూ, పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ అవే కుతంత్రాలకు పాల్పడుతోంది. అస్తవ్యస్త పాలన, ప్రభుత్వ అక్రమాలు, అవకతవకలు, సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం, రైతులు, యువత, మహిళలను నిలువునా వంచించడంతో చంద్రబాబు కూటమిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని స్పష్టమవడంతో చంద్రబాబు కూటమి అక్రమ పద్ధతులు ఎంచుకుంటోంది. మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో మాదిరిగానే కుట్రపూరితంగా గెలుచుకోవడానికి పన్నాగాలు పన్నుతోంది. ప్రజా బలం కలిగిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు పంచాయతీ సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో నామినేషన్ల ప్రక్రియ నుంచే అడ్డుకొనే కుట్రలకు తెరలేపింది.  

మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో అరాచకమే 
మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో నామినేషన్‌ పత్రాల దాఖలు నుంచి కౌంటింగ్‌ వరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లు లేకుండా దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడింది. నామినేషన్‌ పత్రాల దాఖలుకు నామినేషన్‌ కేంద్రాల వద్దకు కూడా రాకుండా పోలీసుల సహకారంతో టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతల చేతుల్లో నుంచి బహిరంగంగానే నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించేశారు. వారిని దాటుకొని నామినేషన్‌ పత్రాలను అధికారుల వద్ద దాఖలు చేసినా, కూటమి గూండాలు అధికారుల నుంచి వాటిని లాక్కొని మరీ చించేయడం వీడియోల సాక్షిగా బయటపడింది.

కొన్ని చోట్ల అధికారులూ కూటమి ఒత్తిళ్లకు తలొగ్గి, అన్నీ సక్రమంగా ఉన్న నామినేషన్లను కూడా తిరస్కరించారు. పలు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రమేయం లేకుండానే టీడీపీ నేతలే ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లను విత్‌డ్రా చేయించేశారు. ఇక మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ సమయంలో జరిగిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ఆదేశాలతో పోలీసులు ముందుగానే వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులు, ఏజెంట్లను నిర్బంధించి, పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారు. 

కూటమి గూండాలు అనేక పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులకు పాల్పడి, బయటకు నెట్టేశారు. ఆ తర్వాత యథేచ్ఛగా దొంగ ఓట్లు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. వారి ఇష్టానుసారం ఓట్లు లెక్కించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్‌ పేరుతో అర్ధరాత్రి వరకు తాత్సారం చేసి ఫలితాలు తారుమారు చేయించారు. సరిగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఓట్లను ఊడా చెల్లనివిగా చూపించి, మెజార్టి తగ్గించే కుట్రలకు పాల్పడ్డారు. అక్రమ పద్ధతుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను వెనక్కి నెట్టి, తామే గెలిచామని జబ్బలు చరుచుకున్నారు. 

ఇప్పుడూ అవే పన్నాగాలు 
మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లోలానే పంచాయతీ ఎన్నికల్లోనూ చంద్రబాబు వెన్నుపోటు పార్టీ కూటమి కుట్రలు, కుతంత్రాలకు దిగుతోంది. ఇందులో మొదటి అంకంగా నామినేషన్‌ కేంద్రాలను మార్చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా నామినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. కొందరు అధికారులు కూడా కూటమి నేతల అడుగులకు మడుగులొత్తుతూ నామినేషన్‌ కేంద్రాలను మారుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్‌ వస్తుండగా.. గురువారం నాడు కూడా నామినేషన్‌ కేంద్రాల్లో భారీ మార్పులు చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 

పంచాయతీ ఎన్నికలకు సంబందించి ఈ ఏడాది మార్చి 26వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. తక్కువ జనాభా ఉండే చిన్న గ్రామ పంచాయతీలైతే రెండు నుంచి నాలుగు పంచాయతీలను ఒక క్లస్టరుగా ఏర్పాటు చేసి వాటిలో పెద్ద పంచాయతీలో నామినేషన్ల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అత్యధిక జనాభా ఉండే పెద్ద పంచాయతీలకు ఆ గ్రామ పంచాయతీలోనే నామినేషన్లు స్వీకరించాలని ఆ నిబంధనల్లో ఎస్‌ఈసీ స్పష్టంగా తెలిపింది. ఇలా గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల కేంద్రాలు ఏర్పాటు చేస్తే అన్ని చోట్లా  వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల నామినేషన్లను అడ్డుకోలేమని భావించిన కూటమి పెద్దలు.. పలు జిల్లాల్లో నిబంధనలకు విరుద్దంగా ఆ మండలంలోని మొత్తం పంచాయతీలకు మండల కేంద్రంలోనే నామినేషన్ల కేంద్రాలు ఏర్పాటు చేయించారు. 

అనంతపురం, శ్రీ సత్యసాయి వంటి కొన్ని రాయలసీమ జిల్లాలతో పాటు మిగిలిన ఇతర జిల్లాల్లో పలు చోట్ల ఇలాంటి మార్పులు జరిగినట్టు సమాచారం. సాధారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం రెండో రోజు స్థానిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుడతారు. పంచాయతీలవారీగా మొత్తం ఓటర్ల జాబితాలతో పాటు ఎక్కడ నామినేషన్లు స్వీకరిస్తారో స్థానిక నోటిఫికేషన్‌లో పేర్కొని, ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డుల్లో అందరూ చూసేలా అందుబాటులో ఉంచాలి. రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్‌కు ముందే పంచాయతీల వారీగా నామినేషన్ల కేంద్రాల జాబితాలు సిద్దంగా చేసి, డీపీవో ద్వారా జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపాలి. అయితే, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఆఖరి నిమిషం వరకు పలు జిల్లాల్లో నామినేషన్ల కేంద్రాల్లో మార్పులు చేస్తుండటం కూటమి కుతంత్రాలకు నిదర్శనమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement