రాష్ట్రంలో మండిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు
ఆహార ద్రవ్యోల్బణంలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ
సెప్టెంబర్‌ను మించి అక్టోబర్‌లో భారీగా ద్రవ్యోల్బణం పెరుగుదల
రికార్డు స్థాయిలో 13.23 శాతంగా నమోదు
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా ధరల షాక్ కొడుతోంది. సామాన్యుల జీవనం దినదిన గండంగా మారుతోంది. నానాటికీ ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టడంలేదు. దీంతో ఆహార ధరల ద్రవ్యోల్బణం దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో నమోదైందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ నెల వినియోగదారుల ధర సూచీను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ గురువారం విడుదల చేసింది.
ఆహార ద్రవ్యోల్బణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, వినియోగదారుల ధరల సూచీలో మూడో స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయిందని తెలిపింది. సెప్టెంబర్‌లో ఆహార ధరల ద్రవ్యోల్బణం రాష్ట్రంలో 10.18 శాతం ఉండగా.. అక్టోబర్‌లో ఏకంగా 13.23 శాతానికి పెరిగిపోయిందని పేర్కొంది. అలాగే వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 6.29 శాతం ఉండగా అక్టోబర్‌లో ఏకంగా 7.25 శాతానికి పెరిగిందని వెల్లడించింది.
గ్రామాల్లోనే అత్యధికం
జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో ఆహార ధరల ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో ఆహార ధరల ద్రవ్యోల్బణం 8.94 శాతం ఉండగా.. వినియోగ ధరల ద్రవ్యోల్బణం 6.09 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా బియ్యం, కందిపప్పు, పామాయిల్, సన్‌ప్లవర్, వేరుశనగ నూనె ధరలు, ఎండు మిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, నిమ్మకాయలు తదితరాల ధరలన్నీ భారీగా పెరిగిపోయాయి. అలాగే వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం ఏపీలో పట్టణాల కన్నా గ్రామాల్లోనే అత్యధికంగా ఉందని కేంద్రం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 7.81 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 6.37 శాతం ఉందని పేర్కొంది.


