సదస్సుకు వస్తున్న వివిధ కాలేజీల విద్యార్థులు
వేదికపై కానరాని అంబానీ, అదానీ, బిర్లా, టాటా, మిట్టల్ తదితరులు
విశాఖ పెట్టుబడుల సదస్సుపై రెడ్‌బుక్ రాజ్యాంగం ఎఫెక్ట్
ఇప్పటికే రాష్ట్రంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారితో తూతూమంత్రంగా ప్రారంభోత్సవం
కొత్త పెట్టుబడుల ఆకర్షణలో చంద్రబాబు సర్కారు అట్టర్ ఫ్లాప్
పాత పెట్టుబడుల కొనసాగింపే కొత్త పెట్టుబడులుగా తిరిగి ఒప్పందాలు
ఇప్పటికే ఉన్న కియా, రెన్యూ పవర్, సాగర్ డిఫెన్స్, స్కైరూట్లతో ఒప్పందాల హడావిడి
ఈ సదస్సు ద్వారా 303 ఒప్పందాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల ఒప్పందాలంటూ చంద్రబాబు ప్రకటన
గతేడాదితో పోలిస్తే రూ.3.5 లక్షల కోట్లు తగ్గిన విలువ
సాక్షి, అమరావతి: విశాఖ వేదికగా గురువారం ప్రారంభమైన రెండ్రోజుల సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు దేశ, విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు మొహం చాటేశాయి. రెండు నెలలుగా పెట్టుబడులను ఆకర్షించడానికి అంతర్జాతీయంగా వివిధ దేశాలు, దేశంలో పలు నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించినా కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది.
దేశంలోని ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మిట్టల్, జిందాల్, బజాజ్, బంగూర్, భజంకా, ఓబెరాయ్ వంటి వారు ఒక్కరు కూడా ఈ సదస్సు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కార్పొరేట్ దిగ్గజాలన్నీ కలిసికట్టుగా ఈ సదస్సుకు దూరంగా ఉండటంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో అమలుచేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం ఎఫెక్ట్ వల్లే కార్పొరేట్ దిగ్గజాలు ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
2023లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తే ఇలాంటి పెట్టుబడుల సమావేశాలకు ఎప్పుడూ హాజరుకాని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతోపాటు, అదానీ గ్రూపు కరణ్ అదానీ, ఓబెరాయ్ గ్రూపు నుంచి అర్జున్ ఓబెరాయ్, సెంచురీ ప్లై సజ్జన్ భజాంకా, శ్రీ సిమెంట్ హరిమోహన్ బంగూర్, టెస్లా నుంచి మార్టిన్ ఎబర్ హార్ట్, దాల్మియా భారత్ నుంచి పునీత్ దాల్మియా, కియా నుంచి కబ్ డాంగ్‌లీ, జపాన్ టోరే ఇండియా నుంచి మసహిరో యమగుచి, కెనాఫ్ నుంచి సుబిత్ బిదానీ వంటి జాతీయ, అంతర్జాతీయ దిగ్గజాలతో పాటు రాష్ట్రానికి చెందిన జీఎంఆర్ గ్రంధి మల్లిఖార్జునరావు, అపోలో ప్రీతి రెడ్డి, సైయంట్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా వంటి పారిశ్రామిక ఉద్దండులు హాజరైన విషయాన్ని ఈ సందర్భంగా చర్చించుకుంటున్నారు.

విద్యార్థులతోనే నిండిపోయిన విశాఖలోని సీఐఐ భాగస్వామ్య సదస్సు
కొత్తగా వచ్చిందేమీ లేదు..
ఈసారి సమావేశాలకు దిగ్గజ సంస్థలు ఏవీ పెద్దగా రాకపోవడంతో రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలపాలు నిర్వహిస్తున్న సంస్థలతో సమావేశాన్ని నిర్వహించి మమ అనిపించేశారు. ఇందులో భాగంగా..
» కియా మోటార్స్ తన విస్తరణ కింద రూ.18,878 కోట్ల కొత్త పెట్టుబడులను చూపిస్తూ భారీ ఒప్పందం చేసుకున్నట్లు చూపించారు.
» జేఎస్‌డబ్ల్యూ గ్రూపు కడప స్టీల్‌ప్లాంట్‌ను రూ.15,000 కోట్లుగా కొత్త ఒప్పందం కింద చూపించారు.
» గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందాలు కుదుర్చుకుని పెట్టుబడులు పెట్టిన గ్రీన్‌కో, మేఘా ఇంజనీరింగ్ (రెన్యూవల్ ఎనర్జీ–ఆర్‌ఈ), గెయిల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్, మైహోమ్ సిమెంట్స్, రెన్యూ పవర్, సెయింట్ గొబియాన్, హిందుస్థాన్ కోకోకోలా వంటి వాటిని గతేడాది, ఈ ఏడాది కూడా వాటినే తిరిగి కొత్త పెట్టుబడులుగా చూపించుకోవడం చంద్రబాబు దిగజారుడుకు పరాకాష్టగా నిలిచింది.
» ఇక ఈ సదస్సులో మొత్తం 303 ఒప్పందాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. అంటే.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడులు రూ.3.5 లక్షల కోట్లు తగ్గిపోయాయి. గతేడాది భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు ద్వారా రూ.13.25 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
జగన్ తెచ్చిన కంపెనీలతో బాబు డబ్బా..
సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ప్రచారానికి తాము తెచ్చిన కంపెనీలేమీ లేకపోవడంతో వైఎస్ జగన్ హయాంలో వచ్చిన కంపెనీల ఫొటోలనే వాడుకోవాల్సిన దుర్గతి చంద్రబాబు సర్కారుకు పట్టింది. కర్నూలు ఓర్వకల్లు వద్ద గ్రీన్‌కో పంప్డ్ స్టోరేజ్‌కి అన్ని అనుమతులు సాధించి పరుగులు పెట్టించి వైఎస్ జగన్ పూర్తిచేస్తే ఇప్పుడు దాన్ని తన ఖాతాలో వేసుకుంటూ చంద్రబాబు భారీ ప్రకటనలు ఇచ్చుకున్నారు. అలాగే.. 2023 గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న గోద్రెజ్ ఆగ్రోవెట్ యూనిట్ ఉత్పత్తిని ప్రారంభిస్తే అది కూడా తన ఖాతాలో వేసుకున్నారు.
స్వయంగా ఆదిత్య బిర్లా అధినేత కుమార మంగళం బిర్లా రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి యూనిట్లు ప్రారంభిస్తే వాటిని.. విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తర్వాత ఆ యూనిట్‌ను శ్రీసిటీకి తరలించడానికి అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన మద్దతుకు మురిసిపోయిన ఎల్జీ గ్రూపు అదే శ్రీసిటీలో ఎలక్ట్రానిక్స్ యూనిట్‌ను ఏర్పాటుచేస్తే అది కూడా తన ఖాతాలో వేసుకుంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా డబ్బా కొట్టుకోవడం బాబు క్రెడిట్ చోరికి మచ్చుతునకలని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.


