అక్రమ మైనింగ్‌పై బాంబు పేల్చిన టీడీపీ ఎమ్మెల్సీ.. బాబుకు ఫిర్యాదు
Jul 25 2025 7:09 AM | Updated on Jul 25 2025 12:13 PM
నిత్యం 100 టన్నుల బెరైటీస్ అక్రమంగా తరలిస్తున్నారు
సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి బాంబు పేల్చారు. ‘అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అపారమైన బెరైటీస్ ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల్లేవు, రాయల్టీ లేదు, అక్రమార్జనతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. బ్లాస్టింగ్ మెటీరియల్ విచ్చలవిడిగా లభిస్తోంది. ఎలాంటి రక్షణ చ
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి బాంబు పేల్చారు. ‘అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అపారమైన బెరైటీస్ ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల్లేవు, రాయల్టీ లేదు, అక్రమార్జనతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. బ్లాస్టింగ్ మెటీరియల్ విచ్చలవిడిగా లభిస్తోంది. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వాడుతున్నారు’ అంటూ సీఎం చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి గురువారం ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఇంకా ఆ లేఖలో ఏం రాశారంటే.. ‘వేముల మండలం గొందిపల్లెలో సర్వే నంబర్ 275లోని 705.43 ఎకరాల్లో కృష్ణప్ప ఆజ్బెస్టాస్ అండ్ బెరైటీస్ కంపెనీకి గతంలో అనుమతులుండేవి. ప్రస్తుతం లీజు అనుమతులకు రెన్యువల్స్ లేకపోగా, రూ.6కోట్లు బకాయిలున్నాయి. అయినప్పటికీ కొందరు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. నిత్యం 100 టన్నులు ఖనిజాన్ని వెలికి తీస్తున్నారు. టన్ను రూ.35వేలు చొప్పున కడపలో ఉన్న పల్వరైజింగ్ మిల్స్‌కు విక్రయిస్తున్నారు. దీనిపై హక్కుదారులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. వెల్ మైనింగ్‌లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా విచ్చలవిడిగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఇదివరకూ అక్రమ మైనింగ్‌లో అయ్యవారిపల్లెకు చెందిన రామచంద్ర మృతి చెందాడు. కలసపాడు వద్ద బ్లాస్టింగ్ మెటీరియల్ కారణంగా గతంలో 10మంది కార్మికులు చనిపోయారు. విరివిగా దొరుకుతున్న జిలెటిన్ స్టిక్స్ వాడుకొని వి.కొత్తపల్లె గ్రామంలో నరసింహులును పేల్చి చంపారు’ అని వివరించారు.
ఓ వైపు అక్రమ మైనింగ్, మరోవైపు దోపిడీ.. ‘వేముల, వేంపల్లె మండలాల్లో అక్రమ మైనింగ్ నిర్వహణే కాకుండా టిఫెన్ కంపెనీకు చెందిన రూ.10 కోట్లు విలువైన ఖనిజాన్ని దోపిడీ చేశారు. టిఫెన్ కంపెనీ ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు, ఇతర సంస్థలకు రూ.కోట్లలో బకాయి పడింది. దాంతో నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) స్వాధీనం చేసుకుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి నిల్వ ఉన్న ఖనిజాన్ని ఎన్సీఎల్టీ వేలం వేయగా, ఎంబసీ గ్రూపు కొనుగోలు చేసింది. కోర్టు పరిధిలో ఉన్న ఆ ఖనిజాన్ని ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా దోపిడీ చేశారు. గూగుల్ చిత్రాలను పరిశీలిస్తే దోపిడీ స్పష్టంగా తెలుస్తుంది’ అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.