
ఎమ్మెల్యే ఐడెంటీ కార్డును
ప్రెస్‌కు చూపిన ఆదిమూలం
సత్యవేడు: ‘నేను సత్యవేడు ఎమ్మెల్యేను .. ఇదిగో నా రాజముద్ర.’ అంటూ కోనేటి ఆదిమూలం తన ఎమ్మెల్యే ఐడెంటీ కార్డును పార్టీ నాయకులు, అధికారులు, విలేకరులకు చూపారు. సత్యవేడులో సోమవారం అన్నా క్యాంటిన్ భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తనని ఓడించాలని కుట్రలు, కుతంత్రాలు చేసిన మాజీ ఎమ్మెల్యే హేమలత, ప్రత్యర్థి పార్టీకి పనిచేసిన వారు నేడు టీడీపీ కార్యక్రమాల్లో స్టేజీలపై ముందు వరుసలో కూర్చొంటున్నారన్నారు.
టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు సమావేశాల్లో కింద వరుసలో ఉన్నారని, తగుదునమ్మా అంటూ హేమలత, సతీష్ నాయుడు పలు మండలాల్లో పార్టీ కార్యక్రమాల్లో తిరగడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. తన పదవి తన దగ్గర ఉంటుందని, ప్రభుత్వ పథకాల కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పంపిణీ తన ద్వారానే జరుగుతుందన్నారు. అలాగే పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌గా కూరపాటి శంకర్ రెడ్డి ఉంటారన్నారు.
స్నేహితుడా న్యాయమేనా..?
సీఎం చంద్రబాబు నాయుడు ‘నీన్ను టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ గా నియమించారు. స్థానిక శాసన సభ్యుడిగా ఉన్న నన్ను వదిలేసి.. ఎన్నికల్లో నన్ను ఓడించడానికి కుట్రలు పన్నిన హెచ్.హేమలత, చెరుకు పార్టీ వాళ్లని వెంట పెట్టుకుని తిరుగుతున్నావు. మండలాల్లో మీరు చేపట్టే కార్యక్రమాలకు నాకు ఆహా్వనం లేదు. అందరం పార్టీ కోసం పనిచేస్తున్నాం. సీఎం చంద్రబాబు ఆదేశాలు పాటిస్తున్నాం. ఒంటెద్దు పోకడలు వద్దు.. అందరం కలసి సత్యవేడులో పార్టీ అభివృద్ధికి చేయి కలుపుదాం స్నేహితుడా.. శంకర్ రెడ్డి.’ అంటూ హితబోధ చేశారు.