రైతుల ముసుగులో టీడీపీ నేతల హల్‌చల్‌

TDP Leaders Over Action At Gudivada Amaravati Farmers Protest - Sakshi

గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర

సందర్భంగా కవ్వింపు చర్యలు

కొడాలి నాని కటౌట్‌కు చెప్పు చూపించిన మాజీ ఎంపీ మాగంటి బాబు  

గుడివాడ వచ్చాం.. అంటూ తొడలు కొడుతూ మహిళల చిందులు 

గుడివాడ: రైతుల ముసుగులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శనివారం సాయంత్రం అమరావతి రైతుల మహా పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడకు చేరుకుంది. స్థానిక శరత్‌ థియేటర్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు రాగానే టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. కవ్వింపుగా ఈలలు, కేకలు వేశారు.

అదే సమయంలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు అక్కడికి చేరుకుని, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కటౌట్‌కు చెప్పు చూపించటంతో వైఎస్సార్‌సీపీ కార్యాలయం లోపల ఉన్న పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అంతలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వారిని విదదీసి.. రోప్‌ పార్టీతో అడ్డుగా నిలిచాయి.

అయినప్పటికీ, పాదయాత్రలో పాల్గొన్న మహిళలు తొడలు కొడుతూ చిందులు వేశారు. వచ్చాం.. వచ్చాం.. గుడివాడకు వచ్చాం.. అంటూ నినాదాలు చేస్తూ చప్పట్లు కొడుతూ.. కేకలు వేస్తూ ముందుకు సాగారు. తాము ఎందుకు యాత్రగా వచ్చామో చెప్పకుండా గుడివాడ ప్రజలను రెచ్చగొట్టేలా మహిళలు గోల చేసిన తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

టీడీపీ గుడివాడ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు వర్గీయులు, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పిన్నమనేని బాబ్జి వర్గీయులు వేర్వేరుగా బల ప్రదర్శన చేస్తూ తమ ప్రాబల్యం చాటుకునేందుకు యత్నించారు. కాగా, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌.. హౌస్‌ అరెస్ట్‌ నుంచి తప్పించుకుని గుడివాడ చేరుకున్నారు.

మార్కెట్‌ యార్డ్‌ వద్ద పోలీసులు అడ్డుకోగా.. వారి కళ్లుగప్పి ఓ కార్యకర్త బైక్‌ ఎక్కి పాదయాత్ర ప్రాంతానికి వచ్చారు. ఈ తంతు మొత్తాన్ని ఆయన తన అనుచరుడి ద్వారా వీడియో తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top