ఆ నలుగురిపైనే.. బాబు ఫోకస్..! | TDP IVRS Survey | Sakshi
Sakshi News home page

ఆ నలుగురిపైనే.. బాబు ఫోకస్..!

Jun 30 2025 1:35 PM | Updated on Jun 30 2025 1:44 PM

TDP IVRS Survey

ప్రజాప్రతినిధుల పనితీరుపై టీడీపీ అధిష్టానం చేయించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేశాం.. గతం కన్నా మిన్నగా పాలన సాగిస్తున్నాం అని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సర్వే ఫలితాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధ్వానపు పనితీరుతో    ప్రజాప్రతినిధులు ఆదరణ కోల్పోయిన విషయం స్పష్టమైంది.  

సాక్షి, పుట్టపర్తి:  కూటమి ప్రజాప్రతినిధులు ఏడాదికే ప్రజలకు బేజారయ్యారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఏడాది పాలనలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి సవిత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పనితీరుపై టీడీపీ అధిష్టానం ఐవీఆర్‌ఎస్‌ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌) సర్వే చేపట్టింది. ఏ ప్రభుత్వానికైనా కనీసం మూడేళ్ల తర్వాత వ్యతిరేకత వస్తుంది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఏడాదికే ప్రజలు విసుగు చెందడం గమనార్హం.  

ఆ నలుగురిపైనే ఎక్కువగా..  
జిల్లాలో సగం మంది ప్రజాప్రతినిధుల పనితీరుపై మాత్రమే తెలుగుదేశం పార్టీ అధిష్టానం సర్వే చేపట్టింది. పుట్టపర్తిలో పల్లె సింధూరరెడ్డి బదులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పెత్తనం చెలాయిస్తుంటారు. మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు బదులు మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామిదే హవా సాగుతోంది. పెనుకొండలో మంత్రి సవిత బదులు ఆమె భర్త వెంకటేశ్వర్లు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎంపీగా పార్లమెంటు వ్యాప్తంగా పర్యటించాల్సిన బీకే పార్థసారథి పెనుకొండ నియోజకవర్గంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. దీంతో ఆ నలుగురిపై ఎక్కువ ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా పరిగణనలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.  

అడ్రెస్‌ లేకున్నా.. అడగరా?  
సీఎం చంద్రబాబు బావమరిది, సినీనటుడు   నందమూరి బాలకృష్ణ చుట్టపుచూపుగా హిందూపురం నియోజకవర్గానికి వస్తుంటారు. ఏ మండలంలో ఏ నాయకుడు ఉన్నాడో కూడా గుర్తించలేరని చెబుతుంటారు. అంతేకాకుండా తన పీఏలు హిందూపురం వ్యాప్తంగా దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సీఎంకు బావమరిది కావడంతో ఆయన పనితీరుపై ఎలాంటి సర్వేలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. 

అరాచకాలను అడ్డుకోరా?  
ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తోన్న రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో అరాచకాలు వెలుగు చూశాయి. ఆమె పనితీరుపై ఎలాంటి సర్వే చేయకపోవడంపై సొంత పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి రేగింది. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు వెలుగు చూసినా పరిటాల కుటుంబానికి అధిష్టానం నుంచి ఎలాంటి హెచ్చరికలూ రాలేదని కూటమి నేతలు వాపోతున్నారు. 

కదిరిలో వన్‌మ్యాన్‌ షో  
కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ వన్‌మ్యాన్‌ షో చేస్తున్నారు. కిందిస్థాయి నాయకులను ఎదగనీయకుండా.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన నాయకులను దగ్గరకు కూడా రానీయడం లేదని వాపోతున్నారు. అయినా అధిష్టానం వద్ద మంచి మార్కులు ఎలా వచ్చాయని నాయకులు ఆలోచనలో పడ్డారు. 

జిల్లా కేంద్రానికి రాని మంత్రి  
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తికి ఓ మంత్రి రావడమే లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒకట్రెండు సార్లు మినహా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే వ్యవహారం నచ్చలేదా? లేక అధికారులు తనకు నచ్చిన వారు లేరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

Advertisement
 
Advertisement
Advertisement