రూ.20 కోసం హత్య.. ట్యాక్సీ డ్రైవర్‌ మృతి! | Taxi Driver Murder In Raptadu Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రూ.20 కోసం హత్య.. ట్యాక్సీ డ్రైవర్‌ మృతి!

Jun 12 2026 11:51 AM | Updated on Jun 12 2026 5:51 PM

Taxi Driver Murder In Raptadu Andhra Pradesh

ఇద్దరి మధ్య గొడవ ఆపబోయి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

రాప్తాడు రూరల్‌: రూ.20 కోసం గొడవ.. ఒకరి హత్యకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో ట్యాక్సీ డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం రూరల్‌ మండలం పాపంపేటలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పాపంపేట జుడియో షోరూం పక్కన శేఖర్‌ అనే వ్యక్తి కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి కూరగాయలు కొనుగోలు చేశారు. బిల్లు రూ.120 అయ్యింది. రూ.500 నోటు ఇవ్వడంతో శేఖర్‌ రూ.380 వెనక్కు ఇచ్చాడు. అయితే ఇంకా రూ.20 వెనక్కు ఇవ్వాలని ఆ ఇద్దరు యువకులు అడిగారు. ఇందుకు వ్యాపారి ఇవ్వలేదు. మాటామాటా పెరిగి శేఖర్‌పై దాడి చేశారు.

సర్దిచెప్పేందుకు వస్తే ప్రాణం తీసేశారు
కూరగాయల దుకాణం వద్ద పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అక్కడే ఉన్న పాపంపేటకు చెందిన ట్యాక్సీ డ్రైవర్‌ బెస్త చంద్ర (55) జోక్యం చేసుకున్నాడు. ఇద్దరినీ సముదాయించి గొడవను ఆపాలని ప్రయత్నించాడు. కానీ మద్యం మత్తులో ఉన్న యువకులు విచక్షణ కోల్పోయి ముఖం, ఛాతీపై పిడిగుద్దులు గుద్దడంతో చంద్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. రూ.20 చిల్లర విషయంలో మొదలైన వాగ్వాదం చివరకు ఒక కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. సమాచారం అందుకున్న చంద్ర భార్య, పిల్లలు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘గొడవ ఆపడానికి వెళ్లిన మా మనిషిని ఇలా పొట్టన పెట్టుకున్నారు‘ అంటూ భార్య రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

నిందితుల కోసం గాలింపు
అనంతపురం రూరల్‌ సీఐ శ్రీకాంత్‌యాదవ్‌, ఎస్‌ఐ ధరణిబాబు సమాచారం అందగానే హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కూరగాయల వ్యాపారితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికే అక్కడి నుంచి పరారైన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement