92 శాతం కౌలురైతులకు సీసీఆర్‌సీలు 

target of issuing CCRCs to 8 lakh people this financial year - Sakshi

ఈ ఆర్థిక సంవత్సరం 8.81 లక్షలమందికి సీసీఆర్‌సీల జారీ లక్ష్యం  

ఇప్పటికే 8.10 లక్షలమందికి అందిన కార్డులు  

వీటిపై ఇప్పటికి రూ.948.77 కోట్ల రుణాలు  

కౌలురైతులకు రుణాల మంజూరు ఇంకా పెరగాలి 

ఇందుకు బ్యాంకుల వారీగా లక్ష్యాలు  

జిల్లాల్లో బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించండి 

కలెక్టర్లకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశం 

సాక్షి, అమరావతి: కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు పంట సాగుదారుల హక్కుల కార్డు (సీసీఆర్‌సీ)ల జారీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ప్రభుత్వం 92 శాతం లక్ష్యాన్ని సాధించింది. కౌలురైతులకు సీసీఆర్‌సీలు ఇవ్వడంతోపాటు వారికి బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు మంజూరు చేయించడంపై ప్రత్యేకదృష్టి సారించింది. భూ యజమానులకు, కౌలురైతులకు మధ్య అవగాహన ఒప్పందాలను కుదిర్చి భూ యజమానులకు నష్టం లేకుండా కౌలురైతులకు మేలుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.

ఇందులో భాగంగానే కౌలురైతులకు సీసీఆర్‌సీలు జారీచేసి వీలైనంతమందికి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)  డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ప్రతి వారం కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తున్నారు. కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడంపై సీఎస్‌ ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలిచ్చారు.

ఈ ఆర్థిక సంవత్సరం 8.81 లక్షలమంది కౌలురైతులకు సీసీఆర్‌సీలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 8.10 లక్షలమందికి (92 శాతం) కార్డులు జారీచేశారు. 13 జిల్లాల్లో లక్ష్యానికి మించి ఈ కార్డులు జారీచేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా లక్ష్యాలను సాధించాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించడంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్డులున్న వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల కోసం లోన్‌ చార్జ్‌ క్రియేష్‌ మాడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఈ–క్రాప్‌తో కౌలురైతుల రుణ ఖాతాలను అనుసంధానించను­న్నట్లు చెప్పారు. బ్యాంకులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.948.77 కోట్ల మేర కౌలురైతులకు రుణాలిచ్చాయని తెలిపారు. మరింతమంది కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడానికి అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశా­లు నిర్వహించాలని ఆదేశించారు.

బ్యాంకర్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించి, బ్రాంచీల స్థాయిలో మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ యజ­మానులకు ఎటువంటి హాని కలగకుండానే కౌలురైతులకు రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభు­త్వం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విషయంపై భూ యజమానులకు అవగాహన కల్పించి కౌలురైతులకు సహకరించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top