వర్ల రామయ్య న్యాయవాదిని నిలదీసిన సుప్రీంకోర్టు

Supreme Court of India questioned On TDP Leader Varla Ramaiah - Sakshi

రాజకీయ వైరుధ్యం ఉంటే విచారణ చేయకూడదా?

విచారణలో అన్నీ వెలుగులోకి వస్తాయి

పాలనలో దురుద్దేశం ఉన్నప్పుడు విచారణ జరగాలి కదా

రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం

ఇరు పక్షాల వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వు

సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి తప్పూ చేయకుండా పారదర్శకంగా ఉన్నప్పుడు సిట్‌ దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవినీతి దురుద్దేశం ఉన్నప్పుడు ఎందుకు విచారించకూడదని ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని భావించిన తర్వాతి ప్రభుత్వం,  వాటిని సమీక్షించకూడదంటే తప్పు జరిగినట్లు వందశాతం అంగీకరించినట్టే (ఇమ్యూనిటీ ఇచ్చినట్లే) కదా అని వ్యాఖ్యానించింది. ఇలా సమీక్షించడం ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకమా అని ప్రశ్నించింది.

రాజకీయ వైరుధ్యం ఉంటే విచారణ చేయకూడదా అని నిలదీసింది. పాలనలో దురుద్దేశం ఉన్నప్పుడు విచారణ జరగాలి కదా , శాశ్వతంగా తప్పించుకోలేరు కదా అని వ్యాఖ్యానించింది. సీబీఐ విచారణకు స్వీకరించలేదన్న కారణంతో తప్పు ఏమీ జరగనట్లేనని ఎలా భావించాలని ప్రశ్నించింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధాన నిర్ణయాలు, అమరావతి భూసేకరణ, ఫైబర్‌నెట్‌ తదితర అంశాలపై ఏర్పాటైన సిట్‌ దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

గురువారం వర్ల రామయ్య తరపున సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ బృందంలో అందరూ వారి పార్టీ వారేనని ఆరోపించారు. న్యాయమూర్తి జస్టిస్‌ షా స్పందిస్తూ.. గత ప్రభుత్వం చేసిన పనులపై తర్వాతి ప్రభుత్వం సమీక్షించకూడదా అని ప్రశ్నించారు. పాలన వ్యవహారాలైతే తప్పకుండా పరిశీలించొచ్చని దవే అన్నారు. దురుద్దేశపూర్వకమైన పాలనా వ్యవహారమైతే విచారణ చేపట్టొచ్చుకదా అని జస్టిస్‌ షా మరోసారి ప్రశ్నించగా.. రాజకీయపరమైన ఉద్దేశాలైతే విచారణలను నియంత్రించాలని దవే అన్నారు.

ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడని వారు అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించడంలో ఉద్దేశం తెలుసుకోవాలన్నారు. నిజ నిర్ధారణ బృందం నివేదిక పరిశీలించిన సభాపతి దర్యాప్తు చేయమని ఆదేశించారని అన్నారు. నిజ నిర్ధారణ బృందంలో రాజకీయ నేతల గురించి తాను మాట్లాడుతున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ, విచారణకు సీబీఐ చేతులు ఎత్తేసిందన్నారు. సీబీఐ నిరాకరించినంత మాత్రాన దురుద్దేశపూర్వక వ్యవహారాలు జరగలేదని ఎలా భావించాలని, ఈ విధంగా ఎలా ఊహించుకుంటారని జస్టిస్‌ షా ప్రశ్నించారు.

ప్రభుత్వం మారిన తర్వాత దురుద్దేశ చర్యలపై వీకే ఖన్నా తీర్పును దవే ప్రస్తావించారు. పక్షపాతం ఉంటే న్యాయపరమైన చర్యలకు వెళ్లొచ్చని ఆ తీర్పులో ఉందని జస్టిస్‌ సుందరేశ్‌ చెప్పారు. ఈ కేసు విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంటున్నామని, కేవలం రాజకీయ కక్షలు మాత్రమే నిజాలను వెలికితీస్తాయని భజన్‌లాల్‌ తీర్పు చెబుతోందని జస్టిస్‌ షా గుర్తుచేశారు. మీరు పారదర్శకంగా ఉంటే ఆందోళన ఎందుకని దవేనుద్దేశించి అన్నారు. ఈ వ్యవహారంలో అధికారులేమైనా ప్రకటన చేస్తే సీఆర్‌పీసీ వర్తించడంతోపాటు అరెస్టులు ఉంటాయని దవే తెలిపారు. గోద్రా ఘటన ఎఫ్‌ఐఆర్‌ల గురించి దవే ప్రస్తావిస్తుండగా అవి అవసరం లేదని జస్టిస్‌ ఎంఆర్‌ షా చెప్పారు.

దవే వాదనలు కొనసాగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ జీవో ఏకపక్షంగా, పక్షపాతంగా ఉందన్నారు. సిట్‌ కూడా చీకట్లో దేని కోసమో వెతుకుతున్నట్లు ఉందన్నారు. దీనికి జస్టిస్‌ షా స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ చీకట్లోనే వెదుకుతారని, విచారణ జరిగితే అన్నీ వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. వాదనలకు సంబంధించి క్లుప్తంగా కోర్టుకు అందజేయాలని ఇరుపక్షాలకు ధర్మాసనం సూచించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి కొన్ని అంశాలు ప్రస్తావించాలని పేర్కొనగా ఒక్కో పక్షం నుంచి ఒకరికే అవకాశం ఇస్తామని, ఇది అందరికీ వర్తిస్తుందని జస్టిస్‌ ఎంఆర్‌ షా వ్యాఖ్యానించారు. 

సిట్టింగ్‌ జడ్జిపై సీజేఐకి సీఎం లేఖపై విచారణ వాయిదా
సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తిపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2020 అక్టోబరు 6న సీజేఐకి రాసిన లేఖలో చేసిన వ్యాఖ్యలపై దాఖలైన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. న్యాయవాదికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పిటిషనర్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలేమిటని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించగా.. సీజేఐకి ముఖ్యమంత్రి రాసిన లేఖను మీడియా ముందు బహిర్గతం చేశారని, ఈ పద్ధతిని అనుమతించకూడదని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయకుండా హైకోర్టు స్టే విధిస్తూ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ నుంచి ఈ పిటిషన్‌ను వేరు చేస్తున్నట్లు జస్టిస్‌ ఎంఆర్‌ షా తెలిపారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ధర్మాసనం డిసెంబరు 12కు వాయిదా వేసింది. ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వాలన్న పిటిషనర్‌ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top